పాతబస్తీలో పాగాకు ఎంబీటీ తహతహ
- రెండు దశాబ్దాలుగా తీవ్ర ప్రయత్నాలు
- అక్షరాస్యత, అభివృద్ధి ప్రణాళికలే ప్రచారాస్త్రాలు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని పాతబస్తీలో పాగా వేసేందుకు మజ్లిస్-బచావో-తహరిక్ (ఎంబీటీ) తహత హలాడుతోంది. రెండు దశాబ్దాల కిందటి వైభవం కోసం పడరాని పాట్లు పడుతోంది. గత మూడు పర్యాయాలుగా రాజకీయ శత్రు పక్షమైన మజ్లిస్-ఇత్తేహదుల్-ముస్లిమీన్ (ఎంఐఎం)ను మట్టి కరిపించేందుకు శక్తియుక్తులను ఒడ్డుతోంది.
ఈ సార్వత్రిక ఎన్నికల్లో సైతం పాతబస్తీలోని హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంతోపాటు చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, చార్మినార్, బహదూర్‌పురా, ఖైరతాబాద్, ముషీరాబాద్, సనత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి అభ్యర్ధులను బరిలో దింపింది. మజ్లిస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టడంతోపాటు పాతబస్తీలో అక్షరాస్యత, అభివృద్ధి ప్రణాళికల పేరుతో ప్రజల్లో మమేకమయ్యేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.
గతంలో పార్టీ ప్రాతినిధ్యం వహించిన చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా అసెంబ్లీ స్థానాలు ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనైనా తిరిగి దక్కించుకునేందుకు రెండు నెలల ముందు నుంచే వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. ఆ రెండు స్థానాల నుంచి సాక్షాత్తు ఎంబీటీ వ్యవస్థాకుడైన దివంగత నేత అమానుల్లాఖాన్ కుమారులైన ప్రస్తుత పార్టీ అధినేత డాక్టర్ ఖయ్యాం ఖాన్, ఫర్హాతుల్లా ఖాన్‌లు బరిలో దిగి గట్టిపోటీకి సిద్ధమయ్యారు.
పట్టు వదలకుండా..
పాతబస్తీలో మజ్లిస్ పార్టీని దెబ్బతీసి గట్టెక్కేందుకు గత మూడు పర్యాయాలుగా ఎంబీటీ పట్టు వదలని విక్రమార్కునిలా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. రెండు దశాబ్దాల క్రితం సుల్తాన్ సలావుద్దీన్‌తో ఏర్పడ్డ విభేదాలతో అమానుల్లా ఖాన్ నాయకత్వంలో 1993లో ఏర్పడిన మజ్లిస్- బచావ్ తహరీక్ (ఎంబీటీ) 1994లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తొలి విజయం సాధించింది. మజ్లిస్ కంచు కోటలైన చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా అసెంబ్లీ స్థానాల్లో ఎంబీటీ విజయకేతనం ఎగురవేయగా, మజ్లిస్ మాత్రం కేవలం చార్మినార్ నియోజకవర్గానికే పరిమితమైంది.
అది కూడా సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ పెద్ద కుమారుడు అసదుద్దీన్ ఓవైసీ రాజకీయ అరంగేట్రంతో చార్మినార్ దక్కినట్లయింది. అయితే 1999 ఎన్నికల్లో ఎంబీటీ తన బలాన్ని నిలుపుకోలేకపోయింది. రాజకీయ పరిస్థితులు తారుమారయ్యాయి. పార్టీ అధినేత అమానుల్లా ఖాన్ వరసగా ఐదు పర్యాయాలు విజయం సాధించిన చాంద్రాయణగుట్ట నుంచి ఓటమి చవిచూడక తప్పలేదు.
అదేవిధంగా గతంలో యాకుత్‌పురా నుంచి విజయం సాధించిన ముంతాజ్ అహ్మద్‌ఖాన్ ఎంఐఎం పక్షాన పోటీ చేసి గెలుపొందగా, ఎంబీటీ పక్షాన పోటీ చేసిన విరాసత్ రసూల్ ఖాన్ కూడా ఎంఐఎం గూటికి చేరారు. ఆ తర్వాత రెండు పర్యాయాలు జరిగిన ఎన్నికల్లో చాంద్రాయణ గుట్ట అసెంబ్లీ నంచి అమానుల్లాఖాన్ పెద్ద కుమారుడు ఖయ్యాంఖాన్, యాకుత్‌పురా నుంచి ఫర్హాతుల్లా ఖాన్, మిగతా నియోజకవర్గాల నుంచి అభ్యర్థులు బరిలో దిగి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూడక తప్పలేదు. తిరిగి ఈసారి అభ్యర్థులను బరిలో దింపి మజ్లిస్‌తో అమీతుమీ తేల్చుకోవడానికి ఎంబీటీ సిద్ధమవుతోంది.
అభ్యర్థులు వీరే...
నగరంలోని ఒక లోక్‌సభ, ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఎంబీటీ అభ్యర్థులను బరిలో దింపింది. హైదరాబాద్ లోక్‌సభ నుంచి సయ్యద్ ముస్తాక్ మహముద్... చాంద్రాయణగుట్ట అసెంబ్లీ స్థానం నుంచి డాక్టర్ ఖయ్యాంఖాన్, యాకుత్‌పురా నుంచి పర్హాతుల్లా ఖాన్, బహదూర్‌పురా నుంచి రశీద్ హష్మీ, చార్మినార్ నుంచి మాజీద్ ఖాన్, ఖైరతాబాద్ నుంచి ఆలమ్‌ఖాన్, సనత్‌నగర్ నుంచి సంఘిశెట్టి రంజిత్ కుమార్, ముషీరాబాద్ నుంచి దుర్గం మధుసూదన్‌లు పోటీ పడుతున్నారు.