పడగవిప్పిన పాతకక్షలు
- మహిళను నరికి చంపిన యువకుడు
- అడ్డుకోబోయిన భర్తకు తీవ్రగాయాలు
సుల్తాన్‌బజార్: పాత కక్షలు మహిళ ఉసురు తీశాయి. ఓ యువకుడు కత్తితో దాడి చేయడంతో భార్య మృతి చెందగా...అడ్డుకున్న భర్తకూ తీవ్రగాయాలయ్యాయి. సుల్తాన్‌బజార్ ఠాణా పరిధిలో మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగింది. సుల్తాన్‌బజార్ ఇన్ స్పెక్టర్ శివశంకర్, ప్రత్యేక్ష సాక్షుల కథనం ప్రకారం.... కోఠి పుత్లిబౌలీ రంగ్‌మహాల్ చౌరస్తాలోని లక్ష్మీనారాయణ ఆలయ ప్రాంగణంలో ఆనంద్‌దాస్, సోనిబాయి(34) దంపతులు ముగ్గురు కుమారులతో కలిసి ఉంటున్నారు. ఆనంద్‌దాస్ అదే గుడిలో పూజారి.
ఇదిలా ఉండగా... గతంలో తన పెదనాన్న తులసీరామ్ యాదవ్‌ను సోనిబాయి హత్య చేసిందని మారేడుపల్లి వాల్మీకినగర్‌కు చెందిన లకన్‌యాదవ్(24) ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం 7 గంటలకు లకన్ కత్తి వెంటబెట్టుకొని సోనిబాయిని హత్య చేసేందుకు రంగ్‌మహాల్ చౌరస్తాలోని లక్ష్మీనారాయణ ఆలయానికి చేరుకున్నాడు. వాకిలి ఊడుస్తున్న సోనిబాయి మెడపై ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు. ఆమె అరుస్తూ అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించగా పట్టుకొని మారీ చాతి, చేతులు, మెడ, కడుపు భాగాల్లో విచక్షణారహితంగా పొడిచాడు.
బాత్‌రూంలో స్నానం చేస్తున్న భర్త ఆనంద్‌దాస్ భార్య అరుపులు విని బయటకు వచ్చి లకన్‌ను అడ్డుకోబోగా.. అతడిపై కూడా కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. తల్లిదండ్రుల అరుపులు విని పక్కరూంలో నిద్రిస్తున్న వారి కుమారుడు కూల్దీప్, పక్కనే అద్దెకుండే ఆటో డ్రైవర్ సాయి పరుగెత్తుకు రావడంతో లకన్ కత్తితో అక్కడి నుంచి పరుగుతీశాడు. సాయి అతడిని వెంబడిస్తుండగా చూసిన పోలీసులు లకన్‌ను పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. సోనిబాయి మృతదేహాన్ని పోస్టుమార్టంకు, తీవ్రంగా గాయపడ్డ ఆనంద్‌దాస్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను చికిత్సపొందుతున్నాడు. సుల్తాన్‌బజార్ ఏసీపీ రావుల గిరిధర్, ఇన్‌స్పెక్టర్ శివశంకర్, ఎస్‌ఐ బాల్‌రాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ఆస్తి వివాదంలో గతంలో హత్య..
ఆస్తి వివాదం కారణంగా 2009లో లకన్‌యాదవ్ బాబాయి తుల్జారామ్‌ను అతని సోదరుడు కిషన్‌తో కలిసి దూరపుబంధువు (వరుసకు అత్త) అయిన సోనిబాయి హత్య చేసింది. మృతదేహాన్ని మూడు ముక్కలు చేసి జడ్చర్ల ప్రాంతంలో పడేశారు. ఈ కేసులో సోనిబాయి, కిషన్ ప్రధాన నిందితులు. కిషన్ పరారీలో ఉండటంతో ఈ కేసు చాదర్‌ఘాట్ పోలీసుస్టేషన్‌లో పెండింగ్‌లో ఉంది. తన బాబాయిని హత్య చేసిన సోని బాయిని చంపాలని లకన్ నిర్ణయించుకున్నాడు. మంగళవారం ఆమె ఇంటికి వెళ్లి కత్తితో పొడిచి చంపేశాడు.
కన్నీరు మున్నీరైన కుమారులు..
తన కళ్లముందే తల్లిని విచక్షణారహితంగా పొడిచి చంపుతున్న దృశ్యాన్ని చూసిన కుమారుడు కుల్దీప్ షాక్‌కు గురయ్యాడు. ఆ తర్వాత తేరుకొని ఇసామియాబజార్‌లో ఉండే బంధువులకు సమాచారం అందించడంతో పాటు హాస్టల్‌లో ఉన్న తమ్ముళ్లను తీసుకొచ్చాడు. మృతదేహాన్ని చూసి సోనిబాయి కుమారులు రోదించిన తీరు అక్కడివారి హృదయాలను కలిచివేసింది.
దర్జాగా తిరుగుతున్నారనే: లకన్
తుల్జారామ్ బాబాయి అంటే నాకు చాలా ఇష్టం. ఆస్తి విషయంలో అత్త సోనిబాయి, బాబాయి కిషన్ కలిసి దారుణంగా చంపేసి దర్జాగా బయట తిరుగుతున్నారు. అందుకే సోనిబాయిని చంపేశా. ఆమె భర్త ఆనంద్‌దాస్,అతని కొడుకు కుల్దీప్‌పై నాకు ఎలాంటి పగలేదు. ఆనంద్‌దాస్ అడ్డం రావాడంతో అతడికి గాయాలయ్యాయి.