నీ బాంచెన్.. సుశీల!
♦ అదే పరమాన్నం.. పేదోళ్ల ఫుడ్డుగా పేరు
♦ వృద్ధులు, పిల్లల ఆదరువు
♦ కడుపు నింపుతోన్న సాత్విక ఆహారం
♦ పింఛన్ డబ్బులతో సుశీలతోనే జీవనం
♦ తయారీ సులువే.. ఖర్చూ తక్కువే..
♦ ఖేడ్‌లో రుచి చూసిన అమాత్యులు
ఉన్న ఊర్లో ఉపాధి దొరక్క కన్న బిడ్డలు వలస పక్షులయ్యారు.. ఈడు ముదిరి.. నెత్తురు సచ్చిపోయిన అవ్వాఅయ్యలను ఇంటికొదిలేసి ఎల్లలు దాటి వెళ్లిపోయారు. వలస వెళ్లి చేసిన రెక్కల కష్టానికి గుత్తేదారిలెక్కలు కట్టి, అసలు, అప్పు పట్టుకొని మిగిలిన పైకం చేతుల పెడి తే... అర్ధాకలితో కాలం వెళ్లబోస్తున్నారు కూలీ లు. ఈ దశలో ఇంటి దగ్గర అవ్వాఅయ్యల ఊసే మరిచారు. కన్న కొడుకు పంపుతాడని... కడుపు నిండా తింటామనే ఆశ పండుటాకుల్లో రోజురోజుకు సచ్చిపోతోంది. ఈ సమయంలో ఇక్కడి వృద్ధులను ‘సుశీల’అమ్మైఆదరిస్తోంది. వలసలతో వల్లకాడైన నారాయణఖేడ్ పల్లెల్లో సుశీలే పరమాన్నం. రూ.1,000 పింఛన్‌తో పండుటాకులు సుశీల తిని బతుకుతున్నారు.
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: నారాయణఖేడ్ అంటేనే వలసలు. పాల మూరు తరువాత రాష్ట్రంలోనే ఎక్కువ మంది వలసలు పోయే ప్రాంతం. ఇక్కడి నుంచి ఏటా 40 వేల మంది కూలీలు వలస పోతుంటారని అంచనా. ఏళ్లకేళ్లుగా పాలకుల నిర్లక్ష్యంతో సగ టు మనుషుల జీవన ప్రమాణాలు పూర్తిగా అడుగంటిపోయాయి. పల్లెల్లో సాగు భూమి ఉన్నా.. నీళ్లు లేక సాగు చేసుకునే పరిస్థితి లేదు. పిల్లలు డిగ్రీలు చేసినా... స్థానికంగా ఉపాధి అవకాశాలులేక పట్నం బాటపట్టారు. ప్రస్తుతం ఏ గ్రామంలో చూసినా కనీసం తాగు నీరు దొరకదు. అటు తిండిలేక, ఇటు నీళ్లు దొరక్క వలస వెళ్లాల్సిన పరిస్థితులు పల్లెల్లో కన్పించాయి. గత్యంతరం లేని పరిస్థితుల్లో యువకులు తమ ముసలి తల్లిదండ్రులను, పిల్లలను ఇంటి వద్దే వదిలేసి పోతున్నారు. కంగ్టి, కల్హేర్, మనూరు మండలాల్లోని గిరిజన తండాలు, దళిత కాలనీ లన్నీ వలసపోయాయి. చేతగాని వృద్ధులు మాత్రమే పిల్లలను పట్టుకొని ఇంటి వద్ద ఉన్నారు. పని దొరకగానే డబ్బు పంపిస్తామని చెప్పి వెళ్లిపోయిన బిడ్డలు నెలలు గడుస్తున్నా రూపాయి కూడా పంపకపోవడంతో పండుటాకులు, పసిపిల్లలు ఆకలికి అలమటిస్తున్నారు.
ఇక్కడ సుశీలే టాప్...
ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో రూ.వెయ్యి పింఛన్, ఈ ప్రాంతంలో ప్రాచూర్యంలో ఉన్న సరళ ఆహారం సుశీల వారి కడుపు నింపుతోంది. పండ్లూడిన బోసి నోరు నమలడానికి సులువుగా ఉండి, అత్యంత చౌకగా పేదలకు అందుబాటులో ఉంటోంది. పొయ్యి మంట కూడా వెలిగించ లేని వృద్ధులు సుశీలతోనే కాలం నెట్టుకొస్తున్నారు. మురమురాలను(బొరుగు పేలాలు) నీళ్లలో తడిపి దానికి కొంత పోసు వేస్తే సుశీల సిద్ధమవుతుంది. రూ.10 ఖర్చుతోనే రోజు గడిచిపోతోం ది. సలువుగా జీర్ణం అవుతుంది. దీనికి రూ.2 కిలో బియ్యం కూడా తోడుకావటంతో నారాయణఖేడ్ నియోజకవర్గంలోని గ్రామాల్లో ఆకలి చావులు లేవని చెప్పొచ్చు.
నేతల దృష్టికొచ్చిన సుశీల...
ఉప ఎన్నికల నేపథ్యంలో రాష్ర్ట నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదరరాజనర్సింహ, సునీతారెడ్డి, జగ్గారెడ్డి తదితరులు పల్లెల్లో తిరుగుతున్నారు. నేతలు పల్లెల్లో తిరుగుతోన్న సమయంలో పల్లెజనం సుశీల తిని బతుకుతున్నాం అని చెప్పడంతో నేతలకు సుశీల మీద ఆసక్తి ఏర్పడింది. ఈ నేపథ్యంలో బుధవారం మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మె ల్యే రామలింగారెడ్డి, చింతా ప్రభాకర్, మదన్‌రెడ్డి తదితరులతో కలిసి నారాయణఖేడ్‌లోని శంకరప్ప కొట్టులో సుశీల రుచి చూశారు. ‘నా అనుకున్న వాళ్ల ఆదరణ లేని పండుటాకులు పింఛన్ డబ్బుతో కనీసం రెండు పూటల సుశీలైనా తింటున్నారని సంతోష పడాలో లేక కనీస మౌలిక వసతులు లేక యువత ఉపాధి వెతుక్కుంటూ వృద్ధ తల్లిదండ్రులను ఒంటరిగా వదిలి వలస పోయినందుకు బాధపడాలో అర్థంకాని పరిస్థితుల్లో ఉన్నాం’ అని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.