ఏడి‘పింఛన్’ | old peoples are concern on pension | Sakshi
Sakshi News home page

ఏడి‘పింఛన్’

Published Tue, Dec 16 2014 3:09 AM | Last Updated on Sat, Sep 2 2017 6:13 PM

old peoples are concern on pension

పింఛన్ రాకుంటే ఎట్టా బతికేది ?

మా ఆయన నర్సింహారావు పదేళ్ల క్రితం పోయారు. అప్పటి నుంచి నాకు పింఛన్ వస్తనే ఉంది. గీ మధ్య కొత్త పింఛన్‌లతో పాటు పాత పింఛనోళ్లూ దరఖాస్తు చేసుకోవాలంటే..దరఖాస్తు చేసిన. కానీ జాబితాలో నాపేరు లేదు. బీఎస్‌ఆర్ నగర్‌లో అద్దె ఇంట్లె ఉంటున్న. పామాయిల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న. గీ మధ్య గా పనిలో నుంచి కూడా తప్పించిండ్రు. అటు కూలి లేక..ఇటు పింఛన్ రాకపోతే నేనెట్ట బతికేది!.   
 -కండరాతి లక్ష్మి, గత లబ్ధిదారు, పేరాయిగూడెం, అశ్వారావుపేట
 
సాక్షి, ఖమ్మం: లబ్ధిదారులు అనుకున్నట్లే ఆసరా ఆందోళన కలిగిస్తోంది. అన్ని అర్హతలున్నా అధికారులు, సిబ్బంది సర్వే తప్పుల తడకగా చేయడంతో గతంలోని అర్హులు ఇప్పుడు అనర్హులయ్యారు. జిల్లా వ్యాప్తంగా గత పింఛన్లలో 20 వేల వరకు ఈ సారి అధికారులు తొలగించారు. దీనిపై తహశీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల ఎదుట బాధితులు ఆందోళనకు దిగుతున్నా సమాధానం చెప్పేవారే లేకపోయారు. తాజాగా సోమవారం తిరుమలాయపాలెం మండలం కాకరవాయిలో నల్లగుట్టు లచ్చమ్మ (80) అనే వృద్ధురాలు పింఛన్ రాలేదనే బెంగతో మృతి చెందింది.

గత ఏడాది జిల్లాలో అన్ని రకాల పింఛన్లు మొత్తంగా 2,27,426 వరకు ఉన్నాయి. ఇందులో వృద్ధాప్య పింఛన్లు 1,11,552, వితంతు 87,341, వికలాంగులు 26,296, నేత కార్మికులు 868, గీత కార్మికుల పింఛన్లు 1,369 ఉన్నాయి. లబ్ధిదారులందరికీ పింఛన్లు వస్తాయని సర్వేతో ఆందోళన చెందవద్దని ప్రభుత్వం ప్రకటనలిచ్చింది. కానీ అసలైన అర్హుల పేర్లు జాబితాలో లేకపోవడంతో జిల్లాలో ఎక్కడికక్కడ ఆందోళనలు కొనసాగుతున్నాయి. వికలాంగుల పింఛన్లు మినహా మిగతా కేటగిరీ పింఛన్లకు కోత పడింది. సర్వే సమయంలో జిల్లా వ్యాప్తంగా 3,13,831 దరఖాస్తులు వచ్చాయి.

ధ్రువీకరణ పత్రాలు సరిగా లేవంటూ వేల సంఖ్యలో వీటిని తిరస్కరించారు. అర్హులైన వారికి ఈనెల 10 నుంచి జిల్లాలో పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. ప్రస్తుతం వృద్ధాప్య పింఛన్లు 92,561, వితంతు 85,696, వికలాంగులు 26,711, నేత కార్మికులు 1,469, గీత కార్మికులు 1,222 మంది అర్హులుగా అధికారులు తేల్చారు. వీరి జాబితా గ్రామ పంచాయతీల్లో ప్రకటించడం, ఇందులో కొంతమంది అర్హుల పేర్లే లేకపోవడంతో ఆందోళనకు దిగుతున్నారు. పభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అధికారులు.. ‘మీ దరఖాస్తులు మళ్లీ పరిశీలన చేస్తాం’ అని చెబుతున్నారే తప్ప.. తమకు ఎందుకు పింఛన్ రాలేదో చెప్పడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అన్ని ధ్రువీకరణ పత్రాలు సర్వే సమయంలో ఇచ్చినా తమ పేర్లు తొలగిం చారని, గ్రామాల్లో వందలాది పింఛన్లు లేకుం డా పోయాయని దరఖాస్తుదారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా అధికారులకు విన్నవిస్తున్నా ఫలితం లేకుండాపోతోంది. ఉన్నతాధికారులు మాత్రం పింఛన్లు అర్హుందరికీ ఇస్తామని చెబుతున్నా క్షేత్ర స్థాయిలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యపు సమాధానంతో పింఛన్లురాని వారు ఆందోళన చెందుతున్నారు. కొన్ని దరఖాస్తులను అసలు అధికారులు సర్వే చేయలేదని ఆరోపణలు వస్తుండడంతో కొంతమంది లబ్ధిదారులు మళ్లీ దరఖాస్తు చేసుకోవడానికి వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.

ఆందోళనతో పరుగులు
ప్రభుత్వం వృద్ధాప్య, వికలాంగులు, వితంతు పింఛన్లు పెంచడంతో లబ్ధిదారులు తమకు ఇళ్లు గడుస్తుందన్న సంతోషంలో ఉన్నారు. అయితే జాబితాలో పేర్లు లేకపోవడంతో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ విసిగివేసారారు. చేసేదీ లేక రోడ్డెక్కి రాస్తారోకోలు, ధర్నాలు చేస్తున్నారు. కూసుమంచి, తిరుమలాయపాలెం, వైరా, కొణిజర్ల, దుమ్ముగూడెం, సత్తుపల్లి, పెనుబల్లి, వేంసూరు మండలాల్లో ఇంకా లబ్ధిదారుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఖమ్మం కార్పొరేషన్‌కు నిత్యం వందలాది మంది వస్తూ తమ పేర్లే ఎందుకు తొలగించారని అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని పత్రాలు ఉన్నా అనర్హులుగా మిగిల్చారని మనోవేదనకు గురువుతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రతి మండల కేంద్రంలో మాత్రం అధికారులు ప్రత్యేకంగా కనీసం హెల్ప్‌లైన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

వచ్చేనెల నుంచి బ్యాంకు ఖాతా..
ప్రస్తుతం జిల్లాలో అర్హులైన వారికి ఈ రెండు నెలల పింఛన్ చేతికి ఇచ్చారు. నూతన సంవత్సరం వచ్చే నెల నుంచి అర్హులకు బ్యాంకు ఖాతాలో పింఛన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనర్హులుగా ఉన్నవారిలో ఆందోళన ఎక్కువైంది. తొలుత చేతికే పింఛన్ రాలేదంటే తమకు అర్హత కల్పించి బ్యాంకు ఖాతాలో వేయడానికి ఎన్ని నెలలు పడుతుందోనని ఆర్జిదారుల్లో ఆందోళన నెలకొంది. అర్హులైన వారు తమకు అర్హత లేదని ఆవేదనతో ఈ గ్రీవెన్స్‌లోనూ కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు. ఉన్నతాధికారులు మాత్రం మలి విడతలో అర్హులందరికీ పింఛన్లు వేస్తాయని చెబుతున్నారే కానీ క్షేత్రస్థాయిలో మాత్రం లబ్ధిదారుల ఆందోళనకు ఊరటగా అధికారుల నుంచి ప్రకటన రావడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement