సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వెలుగు చూసిన అతి పురాతన శిల్పాలు అమెరికాలో తళుక్కుమననున్నాయి. న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియంలో జరగబోయే ప్రదర్శనలో మన కళాఖండాలు కొలువుదీరనున్నాయి. అమెరికా, యూరప్, భారత్ ల నుంచి 150 కళాఖండాలకు మాత్రమే ఈ ప్రదర్శనలో చోటు దక్కనుండగా, అందులో తెలంగాణకు చెందినవి దాదాపు 13 వరకు ఉండబోతున్నాయి. దాదాపు 100 రోజుల పాటు అవి అక్కడ ప్రదర్శనలోనే ఉంటాయి. మన దేశం నుంచి కళాఖండాల తరలింపు ప్రక్రియకు ఢిల్లీలోని నేషనల్ మ్యూజియం నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. చాలా దేశాల్లో బౌద్ధానికి సంబంధించి సజీవ సాక్ష్యాలుగా ఉన్న అలనాటి గుర్తులతో తరచూ ప్రదర్శనలు ఏర్పాటు చేస్తుంటారు. ఇప్పుడు న్యూయార్క్‌లోని మెట్రోపాలిట¯Œ మ్యూజియం వచ్చే ఏడాది నవంబర్ 20 నుంచి ఫిబ్రవరి 14 వరకు బుద్ధుడి జీవితంపై ఓ ప్రదర్శన ఏర్పాటు చేస్తోంది. దీని ఇతివృత్తం భారత్‌తో ముడిపడి ఉండటం విశేషం. ‘ది ట్రీ అండ్ సర్పెంట్: ఎర్లీ బుద్ధిస్ట్ ఆర్ట్ ఇ¯Œ ఇండియా’పేరుతో ఇది ఏర్పాటవుతోంది.
ఎంపిక చేసిన యూఎస్ మ్యూజియం
ఈ ప్రదర్శనను న్యూయార్కు మ్యూజియం నిర్వహిస్తోంది. ఏడాది నుంచే కసరత్తు మొదలుపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా పర్యటించిన ఆ మ్యూజియం ప్రతినిధులు తెలంగాణలో కూడా తిరిగి 13 ప్రదర్శనాంశాలను ఎంపిక చేశారు. ఇందులో ఫణిగిరి బౌద్ధ స్థూపం వద్ద లభించిన అరుదైన తోరణాలు, తల విరిగి రెండు మీటర్ల ఎత్తున్న బుద్ధుడి సున్నపు రాయి విగ్రహం, అష్ట మంగళ చిహ్నాలు చెక్కి ఉన్న సున్నపురాయి బుద్ధ పాదాలు, బుద్ధుడి జీవితాన్ని మూడు భాగాల్లో చెక్కిన మూడున్నర అడుగుల ప్యానెల్ ఉన్నాయి. ధూళికట్టలో లభించిన గొడు గుతో కూడిన బుద్ధుడి పూజా మందిరం, బుద్ధుడికి రక్షణగా పడగవిప్పిన పాము ఉండే నాగముచిలింద తదితరాలున్నాయి. ఇవి ఫణిగిరిలోని స్టోర్ రూమ్, నగరంలోని స్టేట్ మ్యూజియం, హెరిటేజ్ తెలంగాణ ప్రధాన కార్యాలయం, కరీంనగర్ మ్యూజియాల్లో ఉన్నాయి. ఇవన్నీ క్రీ.శ. 2వ శతాబ్దానికి పూర్వమైనవి.
భారీ బీమా..
ఈ కళాఖండాలను అమెరికాకు తరలించటం, తిరిగి తీసుకువచ్చే క్రమంలో దెబ్బతినటం, దోపిడీకి గురయ్యే ప్రమాదం పొంచి ఉంటుంది. ఈ నేపథ్యంలో వాటికి భారీ మొత్తంలో బీమా చేయబోతున్నారు. గతంలో ముంబై, ఢిల్లీ మ్యూజియాల్లో జరిగిన ప్రదర్శనకు స్టేట్ మ్యూజియం నుంచి తరలించిన బుద్ధ ప్యానెల్‌కు రూ.2 కోట్ల బీమా చేశారు. ఇప్పుడు ఈ అన్ని విగ్రహాలకు దాదాపు రూ.25 కోట్ల మేర బీమా చేసే అవకాశం ఉంది.
ప్రభుత్వానికి పంపాం
‘అమెరికాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రదర్శనకు తెలంగాణ నుంచి కూడా కొన్ని కళాఖండాలు పంపబోతున్నాం. న్యూయార్క్ మ్యూజియం ప్రతినిధులు ఎంపిక చేసిన వాటికి సంబంధించి అమెరికాకు పంపేందుకు అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపాం. ప్రభుత్వం నుంచి ఎన్నింటికి అనుమతి వస్తే అన్నింటిని పంపుతాం.’ – దినకర్ బాబు,
ఇంచార్జి డైరెక్టర్, హెరిటేజ్ తెలంగాణ
Comments
Please login to add a commentAdd a comment