గజ్వేల్‌లో 20న సీఎం పాదయాత్ర
* అధికారికంగా కార్యక్రమం ఖరారు
* వరంగల్ తరహాలో పర్యటన
* అన్ని శాఖల అధికారులూ అప్రమత్తం
గజ్వేల్: ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ నగర పంచాయతీలో ఈనెల 20న పాదయాత్ర చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యుల్ అధికారికంగా ఖరారైంది. ఈ విషయాన్ని ‘గడా’ (గజ్వేల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ) ఓఎస్డీ హన్మంతరావు ‘సాక్షి’కి తెలిపారు. తన సొంత నియోజకవర్గంలోని గజ్వేల్ నగర పంచాయతీని దేశంలోనే బంగారుతునకగా మారుస్తానని కేసీఆర్ ప్రకటించిన సంగతి తెల్సిందే.
ఈ క్రమంలోనే గజ్వేల్‌తోపాటు ప్రజ్ఞాపూర్, ముట్రాజ్‌పల్లి, క్యాసారం గ్రామాల్లో గల 20 వార్డుల్లో సీఎం పాదయాత్ర జరుపనున్నారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల్లో ప్రజల నుంచి స్వయంగా విజ్ఞప్తులను స్వీకరించనున్నారు. వరంగల్ పర్యటన తరహాలో ఈ కార్యక్రమం ఉండబోతోందని భావిస్తున్నారు. సీఎంగా ఎన్నిక కాగానే 2014 జూన్ 4న ఇక్కడ పర్యటించిన కేసీఆర్.. నగర పంచాయతీకి రింగు రోడ్డు, గోదావరి శాశ్వత మంచినీటి పథకం ప్రకటించిన సంగతి తెల్సిందే.
అదేవిధంగా 2014 నవంబర్ 30న జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించి భారీగా వరాలు కురిపించారు. ప్రత్యేకించి మండల కేంద్రా లు, గ్రామాలు, మదిర గ్రామాలకు సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి రూ.50 కోట్లు, ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రోడ్లకు సైతం విరివిగా నిధులు మంజూరు చేశారు.
తాజాగా ఈనెల 20న గజ్వేల్ నగర పంచాయతీలో పాదయాత్రకు సన్నద్ధమవుతుండగా పట్టణానికి మరిన్ని వరాలు ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో వివిధ శాఖల అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. గజ్వేల్ నగర పంచాయతీ పరిధిలో తమ శాఖల సంబంధించిన పనులు, ఫిర్యాదులపై ఆరా తీస్తున్నారు.