అభివృద్ధి పథకాల అమలే ఎజెండాగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 23న జిల్లాలో పర్యటించనున్నారు.
23న జిల్లాకు రానున్న కేసీఆర్
రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం, డబుల్ బెడ్‌రూం పథకం ప్రారంభం
మడికొండలో బహిరంగసభ
హన్మకొండ : అభివృద్ధి పథకాల అమలే ఎజెండాగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 23న జిల్లాలో పర్యటించనున్నారు. పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు, వరంగల్-యాదగిరిగుట్ట రోడ్డు విస్తరణ, ఏటూరునాగారం వద్ద గోదావరిపై నూతనంగా నిర్మించిన వంతెన తదితర అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎంపాల్గొననున్నారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రితో పాటు కేంద్ర ఉపరితల రవాణాశాఖమంత్రి నితిన్ గడ్కారీ పాలుపంచుకోనున్నారు. రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణం పథకాన్ని దసరా రోజున లాంఛనంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. పథకం తొలిదశలో ప్రతీ నియోజకర్గానికి 400 ఇళ్లు కేటాయించగా, జిల్లాలోని 12 నియోజకవర్గాలకు 4800 ఇళ్లు మంజూరయ్యాయి. డబుల్ బెడ్‌రూం ఇళ్ల పథకాన్ని జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించే అవకాశం ఉంది.
మడికొండలో బహిరంగ సభ
సీఎం జిల్లా పర్యటనలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల పథకాన్ని జిల్లాలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. డబుల్ బెడ్‌రూం ఇళ్ల ప్రథకం ప్రారంభోత్సవ కార్యక్రమంగా వర్ధన్నపేట నియోజకవర్గం మడికొండలో బహిరంగసభ నిర్వహించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఏర్పాట్ల చేస్తున్నారు. బహిరంగ సభ నిర్వహణకు జరుగుతున్న ఏర్పాట్లను మంగళవారం ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహారి, ఎమ్మెల్యే అరూరి రమేష్, కలెక్టర్ వాకాటి కరుణ, వరంగల్ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబులు పరిశీలించారు. మడికొండ దగ్గర ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డబుల్‌బెడ్ రూం ఇళ్ల పథకంతో పాటు హైదరాబాద్-భూపాలపట్నం జాతీయ రహదారి విస్తరణలో భాగంగా యాదగిరిగుట్ట-మడికొండ రహదారి విస్తరణ పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.
తొలుత వంతెన ప్రారంభం
జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ఏటూరునాగారం మండలం నుంచి ప్రారంభం కానుంది. తొలుత జాతీ య రహదారి 163పై ఏటూరునాగారం మండలం ముల్లకట్ట నుంచి ఖమ్మం జిల్లా వాజేడు మండలం పూసురు వరకు గోదావరి నదిపై కొత్తగా నిర్మించిన వం తెనను కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కారీతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఈ కార్యక్రమం ఖమ్మం జిల్లా సరిహద్దు గ్రామమైన పూసూరులో జరుగనుంది. కార్యక్రమం ముగిసిన తర్వాత సీఎం కేసీఆర్, కేంద్రమంత్రి గడ్కారీ మడికొండ వద్దకు చేరుకుంటా రు. కేంద్రమంత్రి పర్యటనకు సంబంధించి షెడ్యుల్ మంగళవారం వెల్లడి కాగా, సీఎం పర్యటన షెడ్యూల్ వివరాలు మాత్రం అధికారికంగా ఖరారు కాలేదు.