ప్రజల పక్షాన ప్రభుత్వం ఉండాలి: కోదండరాం
నిర్మల్: తెలంగాణ రాష్ర్టం ఏర్పాటైన తరువాత వచ్చిన ప్రభుత్వం ప్రజల పక్షాన ఉండేలా పోరాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని టీవీవీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లోని ఎంఎస్ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం నిర్వహించిన టీవీవీ నాలుగో జిల్లా మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజలు సమస్యలతో ఉన్నప్పుడు మౌనం వహించడం నేరమని అన్నారు. సమాజం కష్టంలో ఉన్నప్పుడు ఎవరూ సంతోషంగా ఉండలేరని చెప్పారు. నష్టం జరిగినప్పుడు సమస్యల పరిష్కారానికి పూనుకోవాలని అన్నారు. ప్రజాసమస్యలపై జేఏసీ, టీవీవీ, కలిసి సంఘటితంగా పోరాడదామని పిలుపునిచ్చారు.
కేటాయింపులతో సరిపోదు: మల్లెపల్లి లక్ష్మయ్య
బడ్జెట్ కేటాయింపులతో సరిపోదని, అవి ప్రజలకు పూర్తిస్థాయిలో చేరాలని టీవీవీ రాష్ర్ట అధ్యక్షుడు మల్లెపల్లి లక్ష్మయ్య అన్నారు. ప్రజలు పైసల్లో భాగం, పాలనలో భాగం అయినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఆర్థిక, రాజకీయ ప్రజాస్వామ్యం కోసం టీవీవీ పోరాడుతుందన్నారు. రాజకీయాలు వ్యాపారంగా మారాయని ఆరోపించారు. ప్రజల పక్షాన లేని ఎమ్మెల్యేలను నిలదీయాలని పిలుపునిచ్చారు.