జూలై 15లోపు కమిటీల నియామకం
► జిల్లాలో సంస్థాగత నిర్మాణంపై దృష్టి
► గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ సమావేశం
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : నిస్తేజంలో ఉన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించింది. క్షేత్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలను నియమించాలని నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో శుక్రవారం జిల్లా ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఇటీవల జిల్లా ఇన్‌చార్జిగా నియమితులైన పీసీసీ ఉపాధ్యక్షురాలు సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆ పార్టీ జిల్లా ముఖ్య నేతలందరు పాల్గొన్నారు. ఈ వారం జిల్లా పార్టీ సమావేశం నిర్వహించి, వివిధ కమిటీల నియామకంపై కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు జరిగి ఏడాది గడుస్తోంది. కానీ కమిటీల నియామకం జరగలేదు. గత కొంతకాలంగా పార్టీ ఆధ్వర్యంలో చెప్పుకోదగ్గ కార్యక్రమాలేవీ జరగలేదు.
జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి బరిలో ఉంటారని ప్రకటించినప్పటికీ చివరి క్షణంలో చేతులెత్తేయడం వంటి పరిణామంతో పార్టీలో పూర్తిగా నిస్తేజం ఆవహించినట్లయ్యింది. ఎట్టకేలకు శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో జిల్లా ముఖ్య నేతలందరు హాజరయ్యారు.
వారంలో సమావేశం..
ఈ వారంలో జిల్లా పార్టీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో వివిధ కమిటీల నియామకంపై కార్యాచరణ రూపొందించాలని సమావేశంలో నిర్ణయించారు. జూలై 15లోపు పూర్తిస్థాయిలో కమిటీలను నియమించి పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలని భావిస్తున్నారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్‌చార్జిలు శ్రావణ్, సునితాఅగర్వాల్, శ్రీనివాస్, మాజీ ఎంపీ వివేక్, పీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి రాంచంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు, పార్టీ జిల్లా, నియోజకవర్గ నాయకులు నరేష్ జాదవ్, భార్గవ్‌దేశ్ పాం డే, అనిల్ జాదవ్, ఆత్రం సక్కు, శ్రీదేవి, నారాయణ్‌రావు పటేల్, అరవిందరెడ్డి, హరినాయక్, సాజిద్‌ఖాన్, సంజీవరెడ్డి, చం ద్రయ్య, వెంకటేష్, దుర్గా భవాని, చంద్రకాంత్, తదితరులు పాల్గొన్నారు.