
హైకోర్టుకు 13న బక్రీద్ సెలవు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టుతో పాటు ఉభయ రాష్ట్రాల్లో ఉన్న కింది కోర్టులకు బక్రీద్ సందర్భంగా ఈ నెల 13వ తేదీని సెలవు దినంగా ప్రకటించారు. వాస్తవానికి హైకోర్టు గతంలోనే బక్రీద్ సందర్భంగా 12వ తేదీని సెలవుగా ప్రకటించింది. అయితే 13న బక్రీద్ నిర్వహిస్తుండటం, సుప్రీంకోర్టు కూడా ఆ రోజునే సెలవు ప్రకటించిన నేపథ్యంలో హైకోర్టు కూడా 13నే సెలవుగా ప్రకటించింది. 12వ తేదీ యథాతథంగా కోర్టు విధులు కొనసాగుతాయని రిజిస్ట్రార్ జనరల్ సీహెచ్ మానవేంద్రనాథ్‌రాయ్ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఎల్లారెడ్డికి హైకోర్టు ఘన నివాళి: ఇటీవల మృతి చెందిన సీనియర్ న్యాయవాది, బార్ కౌన్సిల్ మాజీ చైర్మన్ ఇ.ఎల్లారెడ్డికి ఉమ్మడి హైకోర్టు గురువారం ఘనంగా నివాళులు అర్పించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలో న్యాయమూర్తులందరూ గురువారం మధ్యాహ్నం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా న్యాయవ్యవస్థకు ఎల్లారెడ్డి అందించిన సేవలను ఆంధ్రప్రదేశ్ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, తెలంగాణ అదనపు ఏజీ జె.రామచంద్రరావులు కొనియాడారు.