ఒక్క సీసీ కెమెరా పది మంది పోలీసులతో సమానం
ఆదిలాబాద్ క్రైం : ఒక్క సీసీ కెమెరా పది మంది పోలీసులతో సమానమని ఆదిలాబాద్ ఏఎస్పీ జోయల్ డేవిస్ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో పట్టణ వ్యాపారులకు సీసీ కెమెరాల ఏర్పాటుపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆయా కంపెనీలకు సంబంధించి సీసీ కెమెరాలను ప్రదర్శించారు. ముందుగా ఏఎస్పీ సీసీ కెమెరాల నిర్వహణ, వాటి సామర్థ్యం, ధర గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జోయల్ డేవిస్ మాట్లాడుతూ గత పది రోజుల వ్యవధిలో పట్టణంలో రెండు పెద్ద దొంగతనాలు జరిగాయని, దీన్ని దృష్టిలో ఉంచుకొనైనా వ్యాపారులు వారివారి దుకాణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మన అజాగ్రత్త వల్ల జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బు దొంగలపాలవుతుందన్నారు.
దీంతో ఆ కుటుంబం రోడ్డున పడాల్సిన పరిస్థితి కూడా ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. అందుకని ప్రతీ దుకాణంలో వ్యాపారులు రెండు సీసీ కెమెరాలు, నాలుగు దుకాణాలకు కలిపి బయట ఒక కెమెరాను ఏర్పాటు చేసుకోవాలన్నారు. రూ.2,600 ధరకే సీసీ కెమెరా లభ్యమవుతుందని, దీని సామర్థ్యం 20 మీటర్ల వరకు ఉంటుందన్నారు. కెమెరాలు పెట్టుకోవడం ద్వారా యజమాని దుకాణంలో లేకపోయిన ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా మొబైల్ దుకాణంలో ఏం జరుగుతుందో తెలుసుకునే వెసులుబాటు ఉంటుందని తెలిపారు. ఎన్నో విధాలుగా ఉపయోగమున్న కెమెరాలను తప్పనిసరిగా అమర్చుకోవాలన్నారు. పోలీసుల సంఖ్య తక్కువగా ఉందని, ప్రజల సహకారంతో పోలీసులు నేరాలను అదుపు చేస్తున్నారని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఆదిలాబాద్‌లో రాత్రి గస్తీ పెంచామని, పెట్రోలింగ్ లో సైతం అదనంగా సిబ్బందిని నియమించినట్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్ మహారాష్ట్రకు దగ్గరలో ఉన్నందున అక్కడి నుంచి వచ్చే వారిని గుర్తించేందుకు నిఘా ఉంచామని, ఆయా ప్రాంతాల్లో ఎవరైన అనుమానస్పదంగా సంచరిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని కోరారు. పాత నేరస్థులు, కోర్టు నుంచి విడుదలయ్యే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, పట్టణంలోని లాడ్జీలను సైతం ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో వన్‌టౌన్ సీఐ బుచ్చిరెడ్డి, మహిళపోలీసు స్టేషన్ సీఐ హరిచంద్, ఎస్సై అబ్దుల్ నజీర్ ఉన్నారు.