♦ మరో మంత్రిపైనా వేటు.. పలువురి పనితీరుపై కేసీఆర్ అసంతృప్తి
♦ శాఖల మార్పు తప్పదంటున్న సీఎం సన్నిహిత వర్గాలు
♦ రాష్ట్ర బడ్జెట్‌కు ముందే మంత్రివర్గ విస్తరణ
♦ 15-20 తేదీల మధ్యే మార్పుచేర్పులు
♦ కొత్తగా ఐదుగురికి అవకాశమిచ్చే యోచన
♦ ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచే ముగ్గురికి చాన్స్
♦ చోటు కోసం పలువురు నేతల యత్నాలు
సాక్షి, హైదరాబాద్:
తెలంగాణ మంత్రివర్గం నుంచి ఓ ఉప ముఖ్యమంత్రిపై వేటుకు రంగం సిద్ధమైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. మరో మంత్రిని కూడా తప్పించాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కేబినెట్ విస్తరణలో భాగంగా కొత్తగా ఐదుగురిని మాత్రమే చేర్చుకోనున్నట్లు సీఎంకు అత్యంత సన్నిహితులు వెల్లడించారు. మంత్రివర్గంలోని పలువురి పనితీరు, వారి పేషీల్లోని వ్యక్తిగత సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుపై కేసీఆర్ ఇప్పటికే తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఆయా మంత్రుల శాఖలను మార్చాలని ఆయన ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 15-20 తేదీల మధ్యే కేబినెట్‌లో మార్పుచేర్పులు ఉంటాయని సీఎం సన్నిహిత వర్గాలు నమ్మకంగా చెబుతున్నాయి. ఈనెల 10న కేబినెట్‌లో మార్పులు చేయాలని మొదట్లో అనుకున్నప్పటికీ.. తర్వాత మరో వారం రోజులకు వాయిదా వేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు పేర్కొంటున్నాయి.
అయితే బడ్జెట్ సమావేశాలకు ముందే కేబినెట్‌ను పునర్వ్యవస్థీకరించి కొత్త మంత్రులతో అసెంబ్లీ సమావేశాలకు వెళతారా లేక బడ్జెట్ భేటీలు ముగిసేవరకు వేచి చూస్తారా? అన్న అనుమానాలు లేకపోలేదు. కాగా, డిప్యూటీ సీఎం ఒకరికి మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలకడం ఖాయమని కేసీఆర్ సన్నిహితులు చెబుతున్నారు. ఆ ఉప ముఖ్యమంత్రి వ్యవహారశైలిపై సీఎం చాలాసార్లు ఆగ్రహం వ్యక్తం చేశారని, తీరును మార్చుకోకుంటే కష్టమని ఇప్పటికే హెచ్చరించారని పేర్కొంటున్నారు. ఉప ముఖ్యమంత్రిగా, బాధ్యతాయుతమైన పోర్టుఫోలియోను నిర్వహిస్తున్నా.. ఆయన శాఖాపరమైన పనిని ఏమాత్రం పట్టించుకోవడం లేదని కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. ఈ స్థానంలో కరీంనగర్ జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ను ఉప ముఖ్యమంత్రిగా చేస్తారన్న వాదన వినిపిస్తోంది. అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాకు చెందిన ఓ మంత్రి పనితీరుపైనా కేసీఆర్ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఆయనను కేబినెట్ నుంచి తొలగించే విషయంలో ఇంకా తుది నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది. మరికొందరిపైనా సీఎంకు అసంతృప్తి ఉన్నా.. వారి విషయంలో శాఖల మార్పునకే పరిమితం కావాలని అనుకుంటున్నారు. మంత్రివర్గంలో ఒకేసారి భారీ మార్పులు చేస్తే ఆయా సామాజిక వర్గాల నుంచి వ్యతిరేకత, నేతల సమీకరణాల్లో సమస్యలు వంటివి తలెత్తే అవకాశాలున్నందున వీరి విషయంలో కొంత వేచిచూస్తున్నట్టుగా తెలుస్తోంది.
పెరుగుతున్న ఆశావహులు...
మంత్రివర్గంలో ఆశావహుల జాబితా పెరుగుతోంది. అవకాశం కోసం సీఎం కేసీఆర్‌పై, ఆయన సన్నిహితులపై వివిధ వర్గాల నుంచి ఇప్పటికే తీవ్ర ఒత్తిడి ఉంది. ఇప్పటిదాకా అవకాశం దక్కని ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి కనీసం ముగ్గురిని కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకుంటారని తెలుస్తోంది. ఖమ్మం జిల్లా నుంచి పార్టీలో చేరనున్న టీడీపీ నేత తుమ్మల నాగేశ్వర్‌రావుకు ప్రధానమైన పోర్టుఫోలియోను అప్పగించనున్నారు. మహబూబ్‌నగర్ నుంచి డాక్టర్ సి.లక్ష్మా రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, జూపల్లి కృష్ణారావు మంత్రి పదవులను ఆశిస్తున్నారు. వీరిలో ఇద్దరికి తప్పకుండా అవకాశం దక్కనుంది. వరంగల్ జిల్లా నుంచి ఎ.చందూలాల్, కొండా సురేఖ, ఎం.యాదగిరి రెడ్డి కేబినెట్‌లో చోటు కోరుకుంటున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి ప్రస్తుతం ఒక్కొక్కరికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యమున్నా.. మరో ఇద్దరికి బెర్తు దక్కుతుందని అక్కడి నేతలు విశ్వాసంతో ఉన్నారు. నిజానికి తెలంగాణ మంత్రివర్గం ఏర్పడిన(జూన్ 2) వారం రోజుల్లోనే విస్తరణ ఉంటుందని కేసీఆర్ సన్నిహితులు ప్రకటించినా.. వివిధ కారణాలతో అది వాయిదాలు పడుతూ వచ్చింది. దీంతో ఈసారైనా మంత్రివర్గ విస్తరణ ఉంటుందా, తమకు అవకాశం దక్కుతుందా అని ఆశావహులు కొట్టుమిట్టాడుతున్నారు.
ఓ డిప్యూటీ ఔట్?
Published Thu, Sep 4 2014 12:54 AM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM
Advertisement