ఆ యువకుడికి ఆంజనేయ స్వామిపై అమిత భక్తి. రోజూ ఉదయమే గుడికి వెళ్లి దర్శనం చేసుకుంటాడు. తన భార్యపై అమిత ప్రేమ. గర్భవతైన ఆమెను బంగారంలాగా చూసుకుంటున్నాడు.
శుక్రవారం ఉదయం ఆ గుడిలోని ఆంజనేయుడిని దర్శించుకుని బయటికి రాగానే మదిలో భార్య మెదిలింది. ఆమెకు పండ్లు కొనుక్కుని వెళదామనుకున్నాడు. బైక్‌పై బయల్దేరాడు. లారీ ఢీకొంది. ప్రాణాలు కోల్పోయాడు.
సాక్షి, పాల్వంచ: పాల్వంచలోని అంబేద్కర్ సెంటర్ సమీపంలో శుక్రవారం ఉదయం యాష్ లారీ ఢీకొనడంతో యువకుడు రేవంత్ కుమార్ మృతిచెందాడు. పట్టణంలోని బొల్లేరుగూడేనికి చెందిన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ భూక్యా శంకర్ కుమారుడు రేవంత్ కుమార్(27)కు ఆంజనేయ స్వామిపై అమిత భక్తి. బాపూజీ నగర్‌లోని ఆంజనేయ స్వామి ఆలయానికి రోజూ వెళుతుంటాడు. శుక్రవారం ఉదయమే స్నానం చేసి 7.30 గంటలకు బైక్‌పై గుడికి వెళ్లాడు. స్వామిని దర్శించుకుని బయటికొచ్చాడు. ఇతడికి ఎనిమిది నెలల కిందటే లావణ్యతో వివాహమైంది. ఆమె ఇప్పుడు ఆరు నెలల గర్భవతి. ఆమెపై అతడికి ఎంత ప్రేమో! ఆమె కోసం పండ్లు తీసుకుని ఇంటికి వెళదామనుకున్నాడు. అంబేద్కర్ సెంటర్ నుంచి కేఎస్‌పీ రోడ్ వైపు 8.20 గంటల సమయంలో వెళుతున్నాడు. సబ్ స్టేషన్ సమీపంలోకి వచ్చేసరికి, కేటీపీఎస్ యాష్ ట్యాంకర్ వెనుక నుంచి ఢీకొంది. తల పైనుంచి టైర్లు వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.
స్పృహ కోల్పోయిన భార్య
గతంలో కేటీపీఎస్ కాంట్రాక్ట్ కార్మికుడిగా, ప్రయివేట్ కంపెనీ ఉద్యోగిగా పనిచేసిన రేవంత్.. ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. ప్రమాద స్థలంలో తండ్రి శంకర్ గుండె పగిలేలా రోదించాడు. రేవంత్ భార్య ఇంటి వద్దే స్పృహ కోల్పోయింది. ఎస్‌ఐ బి.రవి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment