డాక్టర్ కాకుండానే..
డాక్టర్ కావాలని ఎన్నో కలలు కన్నాడు.. అందుకనుగుణంగా ఎంతో కష్టపడి ఎంబీబీఎస్‌లో ఫ్రీ సీటు పొందాడు.. నాలుగేళ్లయితే చాలు డాక్టరై పేదలకు సేవ చేయాలనుకున్నాడు.. అంతలోనే ఆ యువకుడి ఆశలు అడియాసలయ్యాయి.. రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.. హృదయ విదారకమైన ఘటన మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకుంది.
ఆమనగల్లు / కల్వకుర్తి :జిల్లాలోని గుండ్లపల్లి(డిండి) మండలం చెర్కుపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని పడమటితండాకు చెందిన రాత్లావత్ రామదాసునాయక్ (24)కు ఇటీవల ఎంసెట్ మెడిసిన్ విభాగంలో ఎస్టీ కోటాలో ఫ్రీ సీటు వచ్చింది. దీంతో హైదరాబాద్‌లోని ఉస్మానియా కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో చేరేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం బైక్‌పై బయలుదేరాడు. మార్గమధ్యంలోని మహబూబ్‌నగర్ జిల్లా ఆమనగల్లు గ్రామపంచాయతీ పరిధిలోని జంగారెడ్డిపల్లి సమీపంలోకి చేరుకోగానే ఎదురుగా వస్తున్న ఆర్‌టీసీ బస్సును ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఇది గమనిం చిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు.
సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ సాయికుమార్ పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ మృతదే హంతో గంటపాటు బంధువులు కల్వకుర్తి ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా చేపట్టారు. దీంతో సీఐ భిక్షపతిరావు, ఎస్‌ఐ వీరబాబు అక్కడికి చేరుకుని ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. బాధిత కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని డీఎం అజ్మతుల్లా హామీతో వారు శాంతించి వెనుదిరిగారు.