ఖమ్మం : ఇప్పటికే పార్టీని నడిపించే నాయకుడు లేక.. చుక్కాని లేని నావలా ఉన్న కాంగ్రెస్‌కు కొత్త సమస్య వచ్చింది. డీసీసీ కార్యాలయ నిర్వహణకు ఐదుగురు సభ్యుల కమిటీ ఉన్నా.. ఎవరికీ సంపూర్ణ అధికారం లేదు. దీంతో స్వాతంత్య్ర దినోత్సవం రోజున జిల్లా కార్యాలయంలో జాతీయ జెండాను ఎవరు ఎగుర వేయాలనేది ప్రశ్నగా మారింది. పార్టీ సీనియర్ నాయకులు ఎగురవేస్తారా.. లేదా అధిష్టానం జిల్లా ఇన్‌చార్జి కుసుమకుమార్‌ను పంపుతుందా.. లేకుంటే ఈ ఐదుగురిలోనే ఒకరు పతాకావిష్కరణ చేయాలని ఆదేశిస్తుందా.. అలా వస్తే ఏ వర్గం వారికి అవకాశం దక్కుతుంది అనేది పార్టీలో చర్చనీయాంశమైంది.
ఒక కుర్చీ .. ఐదుగురు నాయకులు
జిల్లా కాంగ్రెస్ పార్టీ నిర్వహణ ఒక కుర్చీ.. ఐదుగురు నాయకులు చందంగా మారింది. డీసీసీ అధ్యక్షుడిగా వనమా వెంకటేశ్వరరావు ఉన్నప్పుడు ఆయన కొత్తగూడెంలోనే ఉండి పార్టీ ముఖ్య సమావేశాలు, ఇతర వ్యవహారాలకు హాజరయ్యేవారు. పార్టీ కార్యాలయ నిర్వహణ అంతా రేణుకాచౌదరి వర్గానికి చెందిన వ్యక్తిగా ముద్ర ఉన్న పులిపాటి వెంకయ్య చూసేవారు. అయితే ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు రావడంతో కార్యాల ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తప్పించారు.
దీనికి తోడు డీసీసీ అధ్యక్షుడు వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోయారు. దీంతో ఇదే అదనుగా భావించిన జిల్లాలోని కొందరు నాయకులు తమ అనుచరులకు పార్టీ పగ్గాలు, కార్యాలయ బాధ్యతలు అప్పగించేందుకు ఎవరికి వారుగా ప్రయత్నించారు. ఎన్నికల ముందు ఒక వర్గానికి ప్రాధాన్యత ఇస్తే మరో వర్గంతో ఇబ్బంది కలుగుతుందని భావించిన పార్టీ అధిష్టానం రాంరెడ్డి వెంకటరెడ్డి అనుచరుడు శీలంశెట్టి వీరభద్రం, భట్టి విక్రమార్క అనుచరుడు ఐతం సత్యం, పొంగులేటి సుధాకర్‌రెడ్డి సోదరుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను కార్యాలయ ఇన్‌చార్జిలుగా నియమించింది.
అయితే కార్యాలయంలో అన్నీ తామై ఉన్న తమ వర్గానికి ప్రస్తుతం ప్రాధాన్యత తగ్గిందని రేణుకాచౌదరి వర్గీయులు ఆమెతో మొరపెట్టుకున్నట్లు సమాచారం. దీంతో ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న రేణుక తమ అనుచరులకు కూడా కార్యాలయ నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని తెలంగాణ పీసీసీ వద్ద పట్టుబట్టి నట్లు తెలిసింది. దీంతో ప్రస్తుతం ఉన్న ముగ్గురితోపాటు రేణుకాచౌదరి వర్గానికి చెందిన వి.వి. అప్పారావు, పరుచూరి మురళీకృష్ణ పేర్లు చేర్చి డీసీసీ నిర్వహణ బాధ్యతలు ఐదుగురికి అప్పగిస్తూ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పుడు పార్టీ కార్యాలయంలో వర్గపోరు మళ్లీ మొదలైంది. ఉన్న కుర్చీలో కూర్చునేందుకు ఒకరి తర్వాత ఒకరు పోటీ పడుతున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు చెపుతున్నారు.
జాతీయ పతాకావిష్కరణ చేసేదెవరో..?
డీసీసీ కార్యాలయంలో స్వాతంత్ర వేడుకల్లో జెండా ఎగుర వేసేది ఎవరనేది జిల్లాలో చర్చనీయాంశమైంది. ఇప్పటి వరకు స్వాతంత్ర, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగుర వేసే ఆనవాయితీ ఉంది. అయితే అధ్యక్షుడు ఎగురవేయాల్సిన జెండాను ఆయన అందుబాటులో లేకపోతే సీనియర్ నేత, మంత్రి స్థాయి నాయకుడు ఎగుర వేసేవారు.
కానీ ఇప్పుడు డీసీసీ నిర్వహణ ఐదుగురు సభ్యులతో ఉంది. ఇందులో వివిధ వర్గాలకు చెందిన వారు ఉన్నారు. స్వాతంత్ర వేడుకల్లో జెండా ఎగురవేసేది తామంటే తామని ఆయా నాయకులు చెప్పుకుంటున్నట్లు సమాచారం. దీంతో కుర్చీల కుమ్ములాట ఇప్పుడు పతాకావిష్కరణ వద్ద బహిర్గతమైతే పార్టీ పరువు పోతుందని కాంగ్రెస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ కార్యాలయంలో ఒక కుర్చీ... ఐదుగురు నాయకులు
Published Thu, Aug 14 2014 3:37 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement