230 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
మోర్తాడ్: మలేసియా దేశానికి విజిట్ వీసాపై వెళ్లి నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్నవారిని పట్టుకునేందుకు అక్కడి ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. తాజాగా సోమవారం రాత్రి కూడా అక్కడి వివిధ పట్టణాల్లో దాడులు జరిపిన పోలీసులు 230 మంది అక్రమ వలసదారులను అరెస్టు చేసినట్లు పలువురు ‘సాక్షి’కి ఫోన్‌లో సమాచారం అందించారు. విజిట్ వీసాల గడువు ముగిసిన విదేశీయులు తమ దేశం విడిచి వెళ్లిపోవాలని, ఇందుకు తగిన సహకారమందిస్తామని మలేసియా ప్రభుత్వం మూడు నెలల క్రితం ప్రకటించింది. అయితే, అక్కడ పని చేయడం కోసం ఏజెంట్లకు లక్షల రూపాయల సొమ్ము చెల్లించిన వేలాది మంది తెలుగువారు అక్కడే ఉండిపోయారు.
వివిధ కంపెనీలలో రోజువారీ కూలీలుగా పని చేస్తున్నారు. వారిని పట్టుకునేందుకు ప్రభుత్వం పోలీసులను రంగంలోకి దింపింది. అయితే ఏజెంట్ల మోసంతో తప్పనిసరి పరిస్థితుల్లో కార్మికులు అక్రమంగా ఉండిపోయారు. తెలిసినవారి గదుల్లో తలదాచుకుంటూ, ఎక్కడ దొరికితే అక్కడ పని చేసుకుంటూ రోజులు గడుపుతున్నారు. ఇంటికి రావాలంటే చేసిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక అక్కడే ఉండిపోయారు. ఈ నేపథ్యంలో ఒకే రోజున 230 మందిని అరెస్టు చేయడంతో తెలుగువారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మలేసియాలో కొనసాగుతున్న అరెస్టులు
Published Wed, Jan 14 2015 2:50 AM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM
Advertisement
Advertisement