దేవరకద్ర : దేవరకద్ర మార్కెట్‌లో బుధవారం ఉల్లిపాయల కొనుగోళ్లు జోరందుకున్నాయి. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు నేరుగా కొనగోళ్లు చేయడంతో ధరలు కొంత మేరకు పెరిగాయి. గతవారం దళారుల జోక్యం వల్ల రైతులు నష్టపోగా.. ఈ వారం రైతులే నేరుగా విక్రయాలు చేసుకున్నారు. దీనివల్ల ఉల్లి ధర క్వింటాకు రూ. 1650 వరకు వచ్చింది. అయితే వ్యాపారులు వేలం ద్వారా చేసిన కొనుగోళ్లకు తక్కువ ధరలు నమోదు అయ్యావి. రూ. వేయి నుంచి రూ. 1100 వరకు ధరలు వచ్చాయి.
నేరుగానే ఎక్కువ అమ్మకాలు...
మార్కెట్‌లో బుధవారం వివిధ గ్రామాల నుంచి రైతులు పెద్ద ఎత్తున ఉల్లిపాయలను అమ్మకానికి తీసుకువచ్చారు. ప్రజలు నేరుగా బస్తాల ప్రకారం కొనుగోళ్లు చేశారు. ప్రస్తుతం బాగా ఆరిన ఉల్లిని ఏడాది పాటు నిల్వ చేసుకునే అవకాశం ఉండడంతో ప్రజలు ఎగబడి ఉల్లిని కొనుగోళ్లు చేశారు. ప్రజలే స్వయంగా సంచుల్లో నింపుకుని తూకాలు చేయించుకున్నారు. 45 కేజీల బస్తా రూ. 750 వరకు ధర పలికింది. దీనివల్ల క్వింటాల్ ధర రూ. 1650 వరకు పలికింది. మార్కెట్‌కు వచ్చిన 2వేల బస్తాల ఉల్లిపాయల్లో సగానికి పైగా వేలం లేకుండానే క్రయ విక్రయాలు జరిగాయి.
వేలంలో తక్కువ ధరలు..
ప్రజలు కొనుగోలు చేసిన తరువాత మిగిలిన ఉల్లి కుప్పలకు వేలం వేశారు. స్థానిక వ్యాపారులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు వేలం వేసినా ధరలు మాత్రం పెరగలేదు. రూ. 1000 నుంచి రూ. 1100 వరకు ధరలు వచ్చాయి. నేరుగా అమ్ముకున్న రైతులు లాభాలు చవిచూడగా వ్యాపారులకు అమ్ముకున్న రైతులకు నష్టాలు కష్టాలు మిగిలాయి.
జోరందుకున్న ఉల్లి కొనుగోళ్లు
Published Thu, Apr 23 2015 1:36 AM | Last Updated on Sun, Sep 3 2017 12:41 AM
Advertisement
Advertisement