
సాక్షి సిటీబ్యూరో: వంటింట్లో అతిముఖ్యమైన ఉల్లిగడ్డల రేట్లుసామాన్యులకు దడపుట్టిస్తున్నాయి. ఏకంగా కిలో రూ.50 నుంచి 60 రూపాయలకు చేరడంతో జనం గగ్గోలు పెడుతున్నారు. ధరలపెరుగుదల కారణంగా చివరకు ఉల్లి వినియోగం కూడా తగ్గింది. మిర్చిబజ్జి బండ్లు, దోసె సెంటర్లు, చిన్నచిన్న హోటల్స్, పానీపూరి బండ్ల వద్ద ఉల్లివాడకమే మానేశారు. ముఖ్యంగా గత రెండు వారాల నుంచి ఉల్లిగడ్డల ధరలుభగ్గుమంటున్నాయి. బహిరంగ మార్కెట్‌లో మంచి రకం ఉల్లిపాయలు కిలో రూ.60 వరకు అమ్ముతున్నారు.
ఇక రెండో రకం ఉల్లిపాయల ధర కిలో రూ.40–50 వరకు ఉంది. అధిక ధరల కారణంగా వినియోగదారులు అరకేజీ కొనాలన్నా భయపడుతున్నారు. అన్ని మార్కెట్లలోనూ ఇదే పరిస్థితి ఉందని, గతంలో రెండు మూడు కేజీలు కొనుగోలు చేసేవారు కూడా ఇప్పుడు అరకేజీతో సరిపెట్టుకుంటున్నారని చిన్నవ్యాపారులు చెబుతున్నారు. కాగా మలక్‌పేట మార్కెట్‌కు ఉల్లిపాయల సరఫరా బాగా తగ్గిపోయింది. గత నెల వర్షాలు విపరీతంగా కురవడంతో మార్కెట్‌కు సరిగా సరుకు రావడం లేదని మార్కెట్ వ్యాపారులు పేర్కొంటున్నారు. ప్రతిరోజూ 90 నుంచి 110 లారీలు రావాల్సి ఉండగా..ప్రస్తుతం 40 నుంచి 50 వరకే ఉల్లి లారీలు వస్తున్నాయని చెబుతున్నారు. గత ఏడాది ఇదే సీజన్‌లో ఉల్లి ధరలు కిలో రూ.30 దాటలేదని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు.
సరిపడా సరఫరా లేకే ధరలు పైపైకి..
మలక్‌పేట మార్కెట్‌కు కర్నూలు, మహారాష్ట్ర, మహబూబ్‌నగర్ నుంచి ఉల్లిపాయలు సరఫరా అవుతుంటాయి. కానీ ఇప్పుడు మహారాష్ట్ర, మహబూబ్‌నగర్ నుంచి సరఫరా బాగా తగ్గిపో యింది. కర్నూలు నుంచి కేవలం 15 నుంచి 20 లారీల వరకే వస్తోందని వివరిస్తున్నారు. దీంతో మలక్‌పేట్ హోల్‌సేల్ మార్కెట్‌లో క్వింటాల్ ఉల్లిపాయలు రూ. మూడు వేల నుంచి ఐదువేల వరకు ధర పలుతోకుందని ఓ వ్యాపారి పేర్కొన్నాడు. మార్కెట్‌కు వచ్చిన ఉల్లిని గ్రేడ్‌లుగా విభజించి అమ్మకాలు చేస్తున్నారు. మొదటి గ్రేడ్ ఎక్కువ ధర పలుకుతోందని, ఇక్కడ నుంచి కొనుగోలు చేసుకుని పోయిన వ్యాపారులు బహిరంగ మార్కెట్‌లో మరింత ఎక్కువ ధరకు అమ్ముతున్నారని చెప్పాడు.
మహారాష్ట్ర ఉల్లిపైనే ఆధారం..
మహారాష్ట్ర నుంచి దిగుమతి అయ్యే సరుకుపైనే నగరం ఎక్కువగా అధారపడుతోంది. రోజూ మార్కెట్‌కు వచ్చే ఉల్లిలో కేవలం 20–30 శాతం తెలంగాణ జిల్లాల వాటా ఉండగా, మహారాష్ట్ర ఉల్లి వాటా దాదాపు 70–80 శాతం ఉందని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్రలో గత నెల భారీగా వర్షాలు కురవడంతో నగరానికి ఉల్లిగడ్డల సరఫరా భారీగా తగ్గింది. దీంతో వ్యాపారులు ధరలు పెంచేస్తున్నారు. తెలంగాణకు అతిపెద్ద మార్కెట్‌గా నగరంలోని మలక్‌పేట మార్కెట్ ప్రసిద్ధి చెందింది. ఇక్కడే ఉల్లిగడ్డల లావాదేవీలు ఎక్కువగా జరుగుతుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment