రైతు బజార్లలో ఉల్లి విక్రయాలు
మార్కెటింగ్‌శాఖకు మంత్రి హరీశ్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: హోల్‌సేల్ మార్కెట్‌లో ఉల్లి ధరలు గణనీయంగా తగ్గడంతో వినియోగదారులు, రైతులకు ప్రయోజనం చేకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని రైతు బజార్లలో రైతులే నేరుగా ఉల్లిని విక్రయించేలా ఏర్పాట్లు చేయాలని మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు శనివారం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లి ధర సగటున రూ. 20 ఉండగా హోల్‌సేల్ మార్కెట్లో రైతులకు కిలో రూ. 8కు మించి రేటు దక్కడం లేదు. రైతు బజార్లలో కిలోకు రూ. 11కు తక్కువ కాకుండా రైతులు ఉల్లిని అమ్ముకునేలా చూడాలని మంత్రి ఆదేశించారు. ఉల్లి విక్రయాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు సాగు అధికంగా ఉన్న మండలాల్లో మార్కెటింగ్, ఉద్యానవన శాఖ అధికారులు పర్యటిస్తారు.