సాక్షి, సిటీబ్యూరో: రవాణాశాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన ఆన్‌లైన్ పొల్యూషన్ టెస్టింగ్ ఆరంభశూరత్వమే అయింది. విషం చిమ్ముతున్న వాహనాలకు కళ్లెం వేసేందుకు పారదర్శకమైన పరీక్ష విధానానికి ప్రతిపాదనలు రూపొందించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కాలుష్య ప్రమాణాలను నిర్ధారించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. గతేడాది ఇందుకోసం అర్హత కలిగిన సాంకేతిక సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానించారు. దీనికోసం కొన్ని సంస్థలు పోటీపడ్డాయి. కానీ ఆ తర్వాత ఎలాంటి పురోగతి లేకుండాపోయింది. సాంకేతిక సంస్థల ఎంపిక ఆదిలోనే నిలిచిపోయింది. నగరంపై విషం చిమ్ముతున్న వాహన కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రస్తుతం మొబైల్ పొల్యూషన్ టెస్టింగ్ సెంటర్లను వినియోగిస్తున్నారు. ఈ కేంద్రాల్లో ఎలాంటి శాస్త్రీయతకు అవకాశం లేదనే ఆరోపణలున్నాయి.
కచ్చితమైన అంచనా
వాహన కాలుష్యాన్ని కచ్చితంగా నిర్ధారించి ధ్రువీకరణ పత్రాలను అందజేసేందుకు ఆన్‌లైన్ వ్యవస్థ దోహదం చేస్తుంది. వాహనాల్లోంచి వెలువడే పొగలో ఏ రకమైన కాలుష్య కారకాలు ఏ స్థాయిలో ఉన్నాయో శాస్త్రీయంగా నిర్ధారించేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానంతో కొత్తగా ప్రతిపాదించిన పొల్యూషన్ టెస్టింగ్ స్టేషన్లు పని చేస్తాయి. వాహనాలకు అక్కడే పరీక్షలు నిర్వహించి ధ్రువీకరణ పత్రాలను అందజేస్తారు. ఒకవేళ కాలుష్య కారకాలు అతిగా వెలువడితే వాహనానికి మరమ్మతులు సూచిస్తారు. అప్పటికే దాని జీవితకాలం ముగిసినట్లుగా తేలితే ఆ వాహనాన్ని పక్కనపెడతారు. సదరు వాహనదారులు కూడా వాటిని వినియోగించకుండా చర్యలు తీసుకుంటారు. ఇలా ఏర్పడిన స్టేషన్లకు, మొబైల్ పొల్యూషన్ టెస్టింగ్ కేంద్రాలను ఆన్‌లైన్‌తో అనుసంధానం చేసి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కాలుష్య నియంత్రణ చర్యలు చేపడతారు. ఈ వ్యవస్థ రవాణా కమిషనర్ కార్యాలయంలోని ప్రధాన సర్వర్‌తో అనుసంధానమై ఉంటుంది. వాహనాల కాలుష్య కారకాల మోతాదులను ఇక్కడి నుంచే నిర్దేశించి ధ్రువీకరణ పత్రాలను అందజేయాలనేది ఆన్‌లైన్ పొల్యూషన్ టెస్టింగ్ కేంద్రాల ఏర్పాటు లక్ష్యం.
కాలుష్యం నుంచి ఊరట..
ప్రస్తుతం నగరంలో సుమారు 350 వరకు మొబైల్ పొల్యూషన్ టెస్టింగ్ కేంద్రాలు ఉన్నాయి. కానీ వీటి ద్వారా నిర్వహించే తనిఖీల్లో ఎలాంటి ప్రామాణికత, శాస్త్రీయత లేదు. వాహనాల నుంచి వెలువడే పొగలోని కాలుష్యకారక పదార్థాలను అంచనా వేసి సర్టిఫికెట్లను అందజేసే కాలుష్య తనిఖీ కేంద్రాలు ఉత్తుత్తి పరీక్షలతో కాసులు పండించుకుంటున్నాయి. రోడ్డుపై అక్కడక్కడా దర్శనమిచ్చే ఈ మొబైల్ పొల్యూషన్ టెస్టింగ్ స్టేషన్లు వాహనదారులను నిలిపి పరీక్షలు నిర్వహిస్తాయి. కాలుష్య నియంత్రణలో ఆ వాహనం ఎలాంటి ప్రమాణాలను అనుసరించేదీ ధ్రువీకరిస్తారు. ఈ టెస్టింగ్ స్టేషన్లు అందజేసే ధ్రువీకరణ పత్రాలనే రవాణా శాఖ ప్రాతిపదికగా భావిస్తోంది. ఇలాంటి కీలకమైన అంశంలో టెస్టింగ్ స్టేషన్లలో సింహభాగం ఎలాంటి పరీక్షలు లేకుండానే వాహనదారులకు ధ్రువీకరణ పత్రాలను అందజేస్తున్నాయి. అతి ప్రమాదకరమైన కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోకార్బన్ వంటి పదార్థాలను వెలువరించే వాహనాలకు సైతం ఈ స్టేషన్లు పచ్చజెండా ఊపుతున్నాయి. ఆధునిక మొబైల్ పొల్యూషన్ టెస్టింగ్ స్టేషన్‌ల వల్ల ఇలాంటి తప్పుడు పరీక్షలకు అవకాశం లేకుండా పోతోంది.
ఆగిన ప్రక్రియ..
సాంకేతిక సంస్థల నుంచి టెండర్లను ఆహ్వానించడంతో ఆరు సంస్థలు పోటీపడ్డాయి. కానీ ఎంపిక నాటికి ఎన్నికల ప్రక్రియ ముందుకొచ్చింది. దీంతో అధికారులు వెనకడుగు వేశారు. తిరిగి ఎలాంటి కదలిక లేకుండాపోయింది. టెండర్ల కాలపరిమితి ముగిసింది. ఈ ప్రతిపాదన ముందుకు సాగాలంటే మరోసారి టెండర్లను ఆహ్వానించాలి. ఇందుకోసం ప్రభుత్వం మరోసారి నిర్ణయం తీసుకోవాలి. అప్పటి వరకు అనిశ్చితి తప్పదని రవాణాశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment