తగ్గించుకుందాం అధనపు భారం! | Online Shopping best For Budget Control | Sakshi
Sakshi News home page

తగ్గించుకుందాం అధనపు భారం!

Published Thu, Dec 13 2018 8:57 AM | Last Updated on Thu, Jan 3 2019 12:17 PM

Online Shopping best For Budget Control - Sakshi

హిమాయత్‌నగర్‌: కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే బడ్జెట్‌ మన చేతుల్లోనేఉంచుకోవచ్చు. పొదుపు మంత్రం పాటిస్తే అ‘ధన’పు భారాన్ని తగ్గించుకోవచ్చు. ఆర్థికపరమైన ఇబ్బందులకు చెక్‌ పెట్టేయొచ్చు. ఇందుకోసం సేవింగ్స్‌ స్కీంలపై దృష్టి పెట్టడం, రియల్‌ఎస్టేట్, మ్యూచువల్‌ ఫండ్స్, షేర్లు, బాండ్స్‌ కొనడం, బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చెయ్యడం.. ఇలా పొదుపు సూత్రాలను పాటిస్తే సరి. వీటిని ఎలా చేయాలనేది మాత్రం సరైన స్పష్టత లేక సతమతమవుతుంటారు. అలాంటి చిట్కాలు ఇవిగో...

ఆన్‌లైన్‌ షాపింగ్‌తో కొంత పొదుపు
ముందుగా ఆన్‌లైన్‌ షాపింగ్‌ సైట్‌లను పరిశీలించాలి. వాటిలో మనం తీసుకోవాల్సిన  వస్తువు ఎక్కడ తక్కువ ధరకు లభిస్తుందో చూడాలి. గూగుల్‌ సెర్చ్‌లో మనకు కావాల్సిన వస్తువు ధర ఎంత అని సెర్చ్‌ చేస్తే.. అమెజాన్‌లో ఎంత, ఫ్లిప్‌కార్డ్‌లో ఎంత, టాటా క్లూస్‌లో ఎంత అనేది  తెలుస్తుంది. ధర ఒక్కటీ తక్కువుండటం మాత్రమే కాదు షిప్పింగ్‌ చార్జీ ఎంత వసూలు చేస్తున్నదీ చూస్తే అన్ని వివరాలు తెలుస్తాయి.  

క్రెడిట్‌ కార్డుతోనూ ఆదా..
వాడుతున్న క్రెడిట్‌ కార్డును బట్టి నెలలో రూ.500 నుంచి రూ.1,000 వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది. కిరాణా సరుకులు, ఇంధనంపై 5 శాతం వరకు, మూవీ టికెట్లు, రెస్టారెంట్లలో విందులపై 20 శాతం వరకు తగ్గింపులను పొందవచ్చు. బ్యాంకు ఖాతాలో బ్యాలెన్స్‌ ఉన్నప్పటికీ క్రెడిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేయడం వల్ల అదనపు ప్రయోజనం ఉంది.

లిస్ట్‌ ప్రిపేర్‌ చేసుకోండి..  
కిరాణా, నిత్యావసర వస్తువుల విషయంలో క్రమశిక్షణతో వ్యవహరించాలి. ముందుగా ఇంట్లోకి కిరాణా సామగ్రి ఏమేమి కావాలన్న జాబితా లేకుండా షాపింగ్‌ చేయొద్దు. షాపింగ్‌కు వెళ్లేటప్పుడు కచ్చితంగా లిస్ట్‌ తయారు చేసుకుని వెళ్లాలి. తప్పకుండా ఆ లిస్ట్‌ కే కట్టుబడాలి. సమయం ఉంటే నెల సరుకులు కొనే ముందు సమీపంలోని సూపర్‌ మార్కెట్లు లేదా సాధారణ కిరాణా షాపుల్లో ధరల వ్యత్యాసం ఎంతుందో తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు.  

గుల్ల చేసే మొబైల్‌ బిల్లు..
చాలా మందికి మొబైల్‌ బిల్లు విషయంలో కంట్రోల్‌ ఉండదు. పోస్ట్‌ పెయిడ్‌ అయితే అడ్డే ఉండదు. పొదుపు చేయాలంటే ముందు చేయాల్సింది పోస్ట్‌పెయిడ్‌కు గుడ్‌బై చెప్పేయడమే.  ప్రీపెయిడ్‌కు మారాలి.  

ఆఫర్ల సమయంలోనూ..
ఏడాదికోసారి వస్త్రాలను కొనుగోలు చేయడంతోనూ ఎక్కువ ఆదా చేసుకోవచ్చు. అది కూడా ఆఫర్ల సమయంలో పెట్టుకుంటే చాలా మంచిది. పండగలకు ముందు ఆన్‌లైన్‌లోనూ, బయట కూడా షాపుల్లో భారీ ఆఫర్లు ఉంటాయి. అప్పుడు కొనుగోలు చేయడంవల్ల కనీసం 30 శాతమైనా ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది.  

10 నుంచి 50శాతం రాయితీ ఇస్తాం..
ఈ మధ్య అందరూ ఆన్‌లైన్‌ షాపింగ్‌కు అలవాటు పడ్డారు. దీంతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే ఓ వెబ్‌సైట్‌ని రూపొందించాం. ‘సెలబ్రేట్‌’ అనే వెబ్‌సైట్‌ నుంచి ఏదైనా షాపింగ్‌ చేస్తే 10 నుంచి 50శాతం రాయితీ ఇస్తున్నాం.   – జీవన్‌చౌదరి, వెబ్‌సైట్‌ రూపకర్త

బ్యాంకు ఖాతాలోనూ కిటుకులు..  
సేవింగ్స్‌ బ్యాంకు ఖాతాలో మినిమం బ్యాలెన్స్‌ కంటే అదనంగా ఉంచడం వల్ల వడ్డీ రాబడి తక్కువే వస్తుంది. కనుక ఆటో స్వీప్‌ సదుపాయం పెట్టుకోవాలి. దీంతో కనీస నగదు నిల్వకు మించి ఉన్న నగదు డిపాజిట్‌గా మారిపోతుంది. దీనిపై 7శాతం వరకు వడ్డీ లభిస్తుంది.  

వాయిదా మంచిదే..
ఏదైనా వస్తువు కొనాలని అనిపిస్తే వెంటనే కొనొద్దు. దాన్ని ఒక నెల వాయిదా వేయండి. ఈ మధ్యలో అది అవసరమా లేదా అని ఆలోచించండి. నెల గడిచిన తర్వాత మరోసారి ఆ వస్తువు కావాలని అనిపిస్తే కొనండి.

ఆన్‌లైన్‌ షాపింగే బెస్ట్‌..
నాకు నచ్చిన డ్రెస్సెస్, జ్యువెలరీ అన్నీ ఆన్‌లైన్‌లోనే కొంటుంటా. ఎందుకంటే ఆన్‌లైన్‌లో చాలా చాలా ఆఫర్స్‌ ఉంటున్నాయి. బయట వాటికన్నా చాలా తక్కువ ధరల్లో నచ్చినవి దొరుకుతున్నాయి. అందుకే బయట షాపింగ్‌ చేయకుండా ఆన్‌లైన్‌ షాపింగ్‌నే ఇష్టపడుతున్నా.– నిహారిక కాసుల, స్టూడెంట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement