
సాక్షి, హైదరాబాద్: నాగర్‌కర్నూల్ జిల్లా గగ్గన్నపల్లి ఎంపీటీసీ స్థానంకు జరిగిన ఏకగ్రీవ ఎన్నిక చెల్లదని, దీనికి చట్టబద్ధత లేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి ప్రకటించారు. మరోసారివిడిగా నోటిఫికేషన్ జారీచేసి ఈ స్థానంలో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. టీఆర్‌ఎస్ నేత దొడ్ల ఈశ్వరరెడ్డి తనను బెదిరించి రూ.10 లక్షలు ఇచ్చి ప్రలోభాలకు గురిచేసి ఎన్నికను ఏకగ్రీవానికి తనపై ఒత్తిడి తెచ్చినట్లు గగ్గనపల్లి ఎంపీటీసీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న దొడ్ల వెంకటనారాయణరెడ్డి ఆరోపించారు.
ఈ విషయంపై పత్రికల్లో వచ్చిన కథనాలపై ఎన్నికల కమిషన్ స్పందించి, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎన్నికల అధికారుల నుంచి నివేదిక తెప్పించినట్టు పేర్కొన్నారు. వెంకటనారాయణరెడ్డి నామినేషన్ ఉపసంహరణ వెనుక డబ్బు ప్రలోభాలతో పాటుగా ప్రత్యర్థిపార్టీ నేతల ఒత్తిళ్లు పనిచేసినట్లు స్పష్టమైం దని ఆయన తెలిపారు. దీంతో ఈ ఏకగ్రీవ ఎన్నికను రద్దు చేస్తున్నట్లు శనివారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం లోని నిబంధనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. నివేదికలో నారాయణరెడ్డిపై దాడికి దిగినట్టుగా ఎక్కడా నిరూపితం కాలేదన్నారు.
కలెక్టర్ల నివేదిక తర్వాతే ఏకగ్రీవాలు..
నామినేషన్లు వేయకుండా బెదిరింపులు, డబ్బుతో ప్రలోభపరచి సీట్ల వేలం మొదలుకుని నామినేషన్ల ఉపసంహరణకు ఒత్తిళ్లు పనిచేస్తున్నాయని గతంలో వచ్చిన వార్తల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ గత జనవరిలోనే ఏకగ్రీవాలపై జిల్లా కలెక్టర్ల నివేదికలు వచ్చాకే వాటిని ప్రకటించాలని నోటిఫికేషన్‌ను ఇచ్చిందని నాగిరెడ్డి తెలిపారు. దీంతో పాటు ఏకగ్రీవాలకు సంబంధించి రిటర్నింగ్ అధికారులు జిల్లా కలెక్టర్లకు నివేదికలు పంపించి, జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారుల నుంచి క్లియరెన్స్ వచ్చాకే జెడ్పీటీసీ,ఎంపీటీసీ అభ్యర్థుల ఏకగ్రీవా లను ప్రకటించాలని ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఆదేశాలిచ్చిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment