సాక్షి, సిటీబ్యూరో: దీపావళి నేపథ్యంలో కేవలం రెండు గంటలు మాత్రమే టపాసులు కాల్చడానికి అనుమతి ఉందని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ గురువారం ప్రకటించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాత్రి 8 నుంచి 10 వరకు మాత్రమే అనుమతిస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నామన్నారు. ఈ నెల 6వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 9వ తేదీ ఉదయం 6 గంటల వరకు అమలులో ఉండే ఈ ఉత్తర్వులను అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయనహెచ్చరించారు.
కాలుష్యం పెరగకుండా టపాసులను రెండు గంటలే కాల్చాలని ఇటీవల సుప్రీం కోర్టు నిబంధనలతో నగర ప్రజల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. ఎక్కువ శాతం ప్రజలు సుప్రీం తీర్పును సమర్థిస్తున్నారు. టపాసుల హోల్‌సేల్ వ్యాపారులు, డీలర్లు మాత్రం సుప్రీం ఆదేశాలను బాహాటంగా వ్యతిరేకించడంలేదు. రిటైల్ వ్యాపారులు బాణసంచాను కొనుగోలు చేసిన తరువాత సుప్రీం తీర్పు వెలువడటంతో తమ వ్యాపారంపై ప్రభావం పడే అవకాశముందని విక్రయదారులు పేర్కొంటున్నారు.
ఏటేటా తగ్గుముఖం పడుతున్న అమ్మకాలు
గత రెండు మూడేళ్లుగా బాణసంచా విక్రయాలు అనుకున్న స్థాయిలో జరగడం లేదు. ఈ సారి రెండు గంటల ప్రభావంతో మరింత తగ్గుముఖం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా భారత అత్యున్నత న్యాయస్థానం తీర్పుకు 30,40 శాతం మంది ప్రజలు కూడా మద్దతు తెలుపుతున్నారు.ఈ పరిస్థితుల్లో టపాసుల విక్రయాలు తగ్గడం ఖాయమనే నిర్ణయానికి వ్యాపారులు వచ్చేశారు. నగరంలో గత నాలుగేళ్లలో దాదాపు 20 శాతం టపాసుల విక్రయాలు తగ్గాయని, గత ఏడాది దాదాపు 30 శాతం వరకు తగ్గాయని వ్యాపారులు వాపోతున్నారు. నగర వ్యాప్తగా దాదాపు వందల కోట్ల వ్యాపారం జరుగుతుంది. పండుగకు ఒకటి రెండు రోజుల ముందు నుంచి రిటైల్ వ్యాపారం ప్రారంభం కానున్నాయి.
కనిపించని గ్రీన్ బాణసంచా
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గ్రీన్ బాణసంచా కాల్చాలి. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో అవి అందుబాటులోలేవు. వచ్చే ఏడాదికి గ్రీన్ టపాసులు అందుబాటులోకి వచ్చే అవకాశముంది.
ఆసక్తి చూపని వ్యాపారులు
గతంలో దీపావళి వస్తోందంటే చాలు చిన్న చిన్న గల్లీల్లో కూడా బాణసంచా విక్రయ దుకాణాలు వెలిసేవి. దాదాపు 5 వేల మంది విక్రయాలు సాగించేవారు. అయితే మూడేళ్ల నుంచి తాత్కాలిక దుకాణాల కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య భారీ స్థాయిలోతగ్గింది. 2015 నుంచి ఏటా వెయ్యి దరఖాస్తులు తగ్గుతూ వచ్చాయి. 2017లో ఈ సంఖ్య రెండు వేలకు పడిపోయింది. ఈ ఏడాది ఇంకా విక్రయాలు జోరందుకొలేదు.
Comments
Please login to add a commentAdd a comment