చిన్నారులతో మాట్లాడుతున్న సీపీ అంజనీకుమార్
సాక్షి, సిటీబ్యూరో: వెట్టి చాకిరీలో మగ్గుతున్న పిల్లలకు విముక్తి కల్పించడం... తప్పిపోయిన చిన్నారుల్ని తల్లిదండ్రుల చెంతకు చేర్చడం, చదువుకు దూరమైన వారిని పాఠశాలల్లో చేర్పించడం... ఈ లక్ష్యాలతో ఏర్పాటైన ‘ఆపరేషన్ ముస్కాన్’ ఐదో విడతను నగర పోలీసులు విజవంతంగా పూర్తి చేశారు. గత నెల 1 నుంచి 31 వరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో మొత్తం 445 మందిని రెస్క్యూ చేశారు. ఈ దఫా మొత్తం 31 మందిని బడికి దగ్గర చేశారని పోలీసు కమిషనర్ అంజనీకుమార్ గురువారం వెల్లడించారు. క్రైమ్స్ విభాగం అదనపు సీపీ షికా గోయల్, నగర నేర పరిశోధన విభాగం అదనపు డీసీపీ ఎంఏ బారిలతో కలిసి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొత్వాల్ పూర్తి వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది రెండు విడతల్లో మొత్తం 874 మందిని రక్షించామన్నారు. ఆపరేషన్ ముస్కాన్ కోసం ఒక్కో సబ్–డివిజన్‌కు ఒక్కోటి చొప్పున ఎస్సైల నేతృత్వంలో మొత్తం 17 టీమ్స్ ఏర్పాటు చేశారు. గడిచిన 27 రోజుల్లో రెవెన్యూ, లేబర్ డిపార్ట్‌మెంట్, మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారులతో కూడిన ఈ టీమ్స్ సిటీలోని దాదాపు 200 ప్రాంతాల్లో దాడులు, తనిఖీలు నిర్వహించారు. కొన్ని కార్ఖానాల్లో చిన్నారుల వెట్టి చాకిరి చేస్తుండగా, మరికొన్ని చౌరస్తాల్లో బిక్షాటన చేస్తున్నట్లు గుర్తించారు. ఇంకొందరు చిన్నారులు చదువుకు దూరమై కేవలం ఇళ్ళు, బస్తీలకే పరిమితమైనట్లు తెలుసుకున్నారు. ఆయా చోట్ల దాదాపు మూడు రోజుల పాటు పరిశీలన చేసిన తర్వాత వరుపెట్టి దాడులు చేశాయి. ఫలితంగా 38 మంది బాలికల సహా మొత్తం 445 మందిని రెస్క్యూ చేశారు.
యాజమాన్యాల వివరాలతో డేటాబేస్
ఈ రెస్క్యూ అయిన చిన్నారుల్లో ఆరుగురు పదేళ్లలోపు, 155 మంది 11 నుంచి 15 ఏళ్ల మధ్య వయస్సులో, మిగిలిన వారు ఇతర వయస్కులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ రెస్క్యూ ఆపరేషన్స్‌లో చిక్కిన 381 మందికి సమగ్ర కౌన్సిలింగ్ తర్వాత వారివారి కుటుంబీకులకు అప్పగించారు. 51 మంది బాలురిని సైదాబాద్‌లోని రెస్క్యూ హోమ్, 13 మంది బాలికల్ని నిండోలిఅడ్డా హోమ్‌లకు తరలించారు. లేబర్ యాక్ట్ నిబంధనలు ఉల్లంఘించిన ఏడుగురు యజమానులపై కేసులు నమోదు చేసిన అధికారులు మొత్తం రూ.18.7 లక్షల జరిమానా విధించి వసూలు చేశాయి. ఈ చిన్నారుల్లో ఏపీ, బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌లతో పాటు దాదాపు ఎనిమిది రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు.
అది కూడా అభివృద్ధికి సూచికే
సమాజంలో పిల్లల్ని ఏ విధంగా ట్రీట్ చేస్తామనేది కూడా అభివృద్ధికి ఓ సూచికగా ఉంటుంది. ఇతర విభాగాలతో కలిసి సమన్వయంతో ముందుకు వెళ్తున్నాం. చిన్నారుల్ని రెస్క్యూ చేయడంతో పాటు వారికి పునరావాసం కల్పించడం, పాఠశాలల్లో చేర్పించడం అనేది పెద్ద టాస్క్. దీనికోసం అటు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌తో పాటు అన్ని డిపార్ట్‌మెంట్స్ సహకారం ఉండాలి. 2016–2019 మధ్య చేపట్టిన ఈ ఆపరేషన్స్‌లో మొత్తం 4624 మంది చిన్నారుల్ని రెస్క్యూ చేశాం. ఇది కేవలం ఓ డ్యూటీ కాదు... మసస్ఫూరిగా, త్రికరణ శుద్ధితో ఆచరించాల్సిన బాధ్యత. ఈ ‘ముస్కాన్’ను విజయవంతం చేసిన ఎస్సైలకు రివార్డులు అందిస్తాం. – అంజనీకుమార్ సిటీ కొత్వాల్
Comments
Please login to add a commentAdd a comment