సాక్షి, హైదరాబాద్: 2021లో జరగనున్న జనగణనలో అంతర్భాగంగానే ప్రస్తుత ఎన్‌పీఆర్‌ను చేపడుతున్నట్టు, ఆ మాటకొస్తే యూపీఏ ప్రభుత్వం 2010లో ప్రారంభించిన ఎన్‌పీఆర్ ప్రక్రియను కొనసాగిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎన్‌పీఆర్ అనేది ఎన్‌ఆర్‌సీకి ముందస్తు చర్యల్లో భాగమని ప్రతిపక్షాలు, మీడియాలోని ఓ వర్గం ఉద్దేశపూర్వకంగా చేస్తున్న నిరాధారమైన అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు హైదరాబాద్‌లో విడుదల చేసిన ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. రెండింటి మధ్య ఎటువంటి సంబంధం లేదని కరాఖండిగా తెలిపారు. అయితే ఇందులో భాగంగా మూడు నాలుగు అదనపు అంశాలు జోడించి ఒక వ్యక్తి తల్లిదండ్రులు పుట్టిన ప్రదేశానికి సంబంధించిన వివరాలు, ఆధార్ కార్డ్ నంబర్, చివరి నివాస స్థలం ఎన్‌పీఆర్‌లో పొందుపరచనున్న కనీస ప్రాథమికాంశాలని పేర్కొన్నారు.
ఈ విషయంలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ప్రజల విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేయడానికి అపోహలు సృష్టించి ప్రజల మనసులతో ఆటలాడుతున్నాయని ధ్వజమెత్తారు. దేశంలో సమర్థవంతంగా అమలవుతున్న సంక్షేమ ఎజెండాను నిర్వీర్యం చేసి, పేదరిక నిర్మూలనకు సంబంధించిన ఆయుష్మాన్ భారత్ వంటి వివిధ పథకాల అమలుకు విఘాతం కల్గించడం వీరి లక్ష్యంగా కనబడుతోందన్నారు. అందరి సంక్షేమానికి కట్టుబడి ఉన్న ఏ ప్రభుత్వమూ ప్రామాణికమైన సమగ్రమైన డేటా లేకుండా తన విధానాలను రూపొందించలేదన్నారు. కాబట్టి అసత్యాలతో, అర్థ సత్యాలతో గగ్గోలు పెడుతూ గోబెల్స్ మాదిరి గా విపక్షాలు, ఇతరులు చేస్తున్న ఈ ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment