‘గ్రిడ్‌’ గడబిడ! | ORR Grid Roads Connectivity | Sakshi
Sakshi News home page

‘గ్రిడ్‌’ గడబిడ!

Published Mon, Aug 26 2019 10:54 AM | Last Updated on Mon, Aug 26 2019 10:54 AM

ORR Grid Roads Connectivity - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) గ్రోత్‌ కారిడార్‌ ముఖచిత్రాన్ని మార్చే గ్రిడ్‌ రోడ్ల పనుల్లో ఒక్క అడుగు ముందుకు పడటం లేదు. 2008లో మాస్టర్‌ ప్లాన్‌ గ్రోత్‌ కారిడార్‌ ప్రకారం దాదాపు 158 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఓఆర్‌ఆర్‌ చుట్టూరా ఇరువైపులా దాదాపు 718 కిలోమీటర్ల మేర వందలాది గ్రిడ్‌ రోడ్లను అభివృద్ధి చేయాలని హెచ్‌ఎండీఏ అధికారులు నిర్ణయించినా ఆచరణలో మాత్రం ఎలాంటి పురోగతి లేదు. సర్వీస్‌ రోడ్డుతో పాటు ఇంటర్‌ఛేంజ్‌లకు అనుసంధానం చేసే ఈ రహదారుల విషయంలో  పదకొండేళ్ల నుంచి ఇప్పటివరకు ఒక్క అడుగు ముందుకు పడకపోవడంతో ఇక గ్రిడ్‌ రోడ్ల పని కంచికి చేరినట్టేనన్న అనుమానాలు ఓఆర్‌ఆర్‌ ప్రాంతవాసుల్లో వ్యక్తమవుతున్నాయి. 2008లో అంచనా వేసిన గ్రిడ్‌ రోడ్ల పనులకు ఇప్పడూ మొదలుపెడితే అయ్యే పనులు తడిసి మోపెడవడం ఖాయమన్న భావనతో ఉన్న హెచ్‌ఎండీఏ అధికారులు వందల కోట్లతో రహదారులు నిర్మించడంపై దృష్టి సారించడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే ఓఆర్‌ఆర్‌ కిలోమీటర్‌ చుట్టూ పక్కల మల్టీపర్పస్‌ జోన్‌ కింద ఆవాసాలు కట్టుకోవచ్చని ప్రకటించడంతో పాటు ఆయా ప్రాంతాల్లో గ్రిడ్‌ రోడ్ల అభివృద్ధి హెచ్‌ఎండీఏనే చూసుకుంటుందని అప్పటి అధికారులు 718 కిలోమీటర్ల మేర రహదారులు వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం హయాంలో 2008 ఆగస్టు తొమ్మిదిన జీవో నంబర్‌ 470ను విడుదల చేసి గ్రిడ్‌ రోడ్ల నిర్మాణ పనులను మూడు నెలల్లో పూర్తి చేయాలని ఉత్తర్వులిచ్చినా ఇప్పటివరకు మోక్షం కలగలేదు. గ్రిడ్‌ రోడ్ల నిర్మాణంతో ఇటు ఐటీ పెట్టుబడులు ఊపందుకోవడంతో పాటు రియల్‌ ఎస్టేట్‌ మరింత జోరందుకుంటుందనుకుంటే..ఆ దిశగా ప్రయత్నాలు జరగడం లేదు.  రెండు లేన్ల గ్రిడ్‌ రోడ్డు కిలోమీటర్‌కు రూ.8 కోట్లవుతాయని హెచ్‌ఎండీఏ అధికారులు చెబుతుండటంతో మొత్తం  5,744 కోట్లు అవసరం కానున్నాయి. అయితే ల్యాండ్‌ పూలింగ్‌ ప్రతిపాదనతో గ్రిడ్‌ రోడ్ల నిర్మాణానికి అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 

మినీ పట్టణాలు ఇక లేనట్టేనా...
2008లో మాస్టర్‌ ప్లాన్‌ గ్రోత్‌ కారిడార్‌ ప్రకారం దాదాపు 158 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఓఆర్‌ఆర్‌ చుట్టూరా ఇరువైపులా దాదాపు 718 కిలోమీటర్ల మేర వందలాది గ్రిడ్‌ రోడ్లను అభివృద్ధి చేయాలని హెచ్‌ఎండీఏ అధికారులు నిర్ణయించారు.. ఇందుకోసం దాదాపు లక్ష ఎకరాలు అవసరముంటుంది. చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు, అటవీ భూములు ఇలా దాదాపు 30 వేల ఎకరాలు పోనుంది. దాదాపు పది వేల ఎకరాలు ప్లాటింగ్‌ చేసిన భూములున్నాయి. వీటిని కూడా ఏం చేసేందుకు వీలులేదు. మిగిలుతున్నది 60 వేల ఎకరాలే. ఈ లెక్కన చూసుకున్న ఈ 60 వేల ఎకరాల్లో గ్రిడ్‌ రోడ్లు అభివృద్ధి చేస్తే నగర శివారు ప్రాంతాలు మినీ పట్టణాలుగా ప్రగతివైపు అడుగులు పడటం ఖాయం. కానీ భూసేకరణ కష్టమని, వేల కోట్ల ఖర్చవుతుందని ఆవైపే ఎవరూ చూడటం లేదు. అయితే ఉప్పల్‌ భగాయత్‌ రైతుల నుంచి భూమి సేకరించి అభివృద్ధి చేసి ఇచ్చిన మాదిరిగానే ల్యాండ్‌ పూలింగ్‌ చేస్తే బాగుంటుందని హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఏ పురోగతి లేదు. ఓఆర్‌ఆర్, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డును అనుసంధానం చేసే రేడియల్‌ రోడ్ల అభివృద్ధి కూడా అటకెక్కింది. ఆర్‌ అండ్‌ బీ అధికారుల నిర్లక్ష్యంతో రేడియల్‌ రోడ్ల పనుల్లో ఆశించినంత వేగిరం లేదనే అభిప్రాయం నగరవాసుల నుంచి వ్యక్తమవుతోంది. 

కొత్త అభివృద్ధికి అవకాశం...
ఓఆర్‌ఆర్‌ చుట్టూరా ఉన్న ప్రాంతాలైన మేడ్చల్‌లో హాస్పిటల్‌ అండ్‌ హెల్త్‌ ఇండస్ట్రీ, శామీర్‌పేటలో అమ్యూజ్‌మెంట్‌ అండ్‌ ఎగ్జిబిషన్‌ ఇండస్ట్రీ, పటాన్‌ చెరులో ఆటో పార్క్‌లు, పౌల్ట్రీ, వెజిటబుల్‌ మార్కెట్‌ ఇండస్ట్రీ, కీసరలో నాలెడ్జ్‌ అండ్‌ సైన్స్‌ ఇండస్ట్రీ, ఘట్‌కేసర్‌లో ఐటీ అండ్‌ ట్రాన్స్‌పోర్టు ఇండస్ట్రీ, కోకాపేటలో ఐటీ, స్పోర్ట్స్, ప్రభుత్వ సంస్థల పరిశ్రమలు, బొంగుళూరులో ఎలక్ట్రానిక్, ఐటీ అండ్‌ టెక్స్‌టైల్‌ ఇండస్ట్రీ, పెద్ద అంబర్‌పేటలో మీడియా, ఆటోమొబైల్‌ అండ్‌ హోల్‌సేల్‌ ఇండస్ట్రీ, గుండ్ల పోచారంలో ఫార్మా అండ్‌ బల్క్‌ డ్రగ్స్‌ ఇండస్ట్రీ తీసుకొస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే ఓఆర్‌ఆర్‌ గ్రోత్‌ కారిడార్ల అభివృద్ధితోనే ఇది సుసాధ్యమవుతుందని, పెట్టబుడులు సులభతరంగా వస్తాయని హెచ్‌ఎండీఏ అధికారులు చెబుతున్నారు. గ్రోత్‌ కారిడార్‌ అభివృద్ధితో నగర శివారు ప్రాంతాల ముఖచిత్రం మారుతుందని, భూముల విలువ పెరగడంతో పాటు ఐటీ రంగం అభివృద్ధికి ఊతమిస్తోందనే వాదన వారిలో వినబడుతోంది. దాదాపు 32 మండలాలను అనుసంధానం చేయనున్న ఈ గ్రిడ్‌ రోడ్ల ద్వారా రీజినల్‌ రింగ్‌ రోడ్డు కూడా డిమాండ్‌ పెరుగుతుందని అంటున్నారు. అయితే దీనికి రూ.5,744 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. 

ప్రభుత్వం దృష్టిసారిస్తే మంచిది...
నగర శివారు ప్రాంతాలను అనుకొని ఉన్న ఓఆర్‌ఆర్‌కు వివిధ మార్గాల నుంచి సరైన కనెక్టివిటీ లేదు. ఇప్పటివరకు కేవలం సర్వీసు రోడ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. హైవేల నుంచి ఓఆర్‌ఆర్‌కు సరైన అనుసంధానం లేదు. అందుకే అభివృద్ధి వైపు పరుగులు పడటం లేదు. ఓఆర్‌ఆర్‌ గ్రోత్‌ కారిడార్‌ వస్తేనే అభివృద్ధి అనేది సాధ్యం. మల్టీపర్పస్‌ జోన్‌ కూడా ఉంది. మౌలికవసతులను మెరుగుపడేందుకు అస్కారం ఉంటుంది. ఇప్పటికైనా గ్రోత్‌ రోడ్లపై ప్రభుత్వం దృష్టి సారించి అధికారులకు దిశా నిర్దేశం చేస్తే శివారుల్లో మినీ ప్రాంతాలు వందల్లో వెలిసే అవకాశముంటుంది. వివిధ రంగాల్లో పెట్టుబడులతో ఉపాధి అవకాశాలు మెండుగా రానున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరందుకోవడం కూడా ఖాయంగా కనబడుతోందని ఓఆర్‌ఆర్‌ ప్రాంతవాసులు అంటున్నారు. 

గుర్తించిన గ్రిడ్‌ రోడ్డు మార్గాలు ఇవే...
ఇబ్రహీం పట్నం–హయత్‌నగర్‌
మహేశ్వరం–శంషాబాద్‌–ఇబ్రహీంపట్నం
రాజేంద్రనగర్‌–శంషాబాద్‌–మొయినాబాద్‌–శంకర్‌పల్లి
రామచంద్రపురం–శంకర్‌పల్లి–పటాన్‌చెరు
రాజేంద్రనగర్‌–శేరిలింగంపల్లి–రామచంద్రపురం–జిన్నారం
మేడ్చల్, కుత్బుల్లాపూర్, శామీర్‌పేట్, కీసర, ఘట్‌కేసర్‌ ప్రాంతాలను పటాన్‌చెరు అనుసంధానం చేయనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement