పాషాతో మాట్లాడుతున్న ఎంపీ ఫెర్నాండెజ్
అనాథగా మారిన ఓ విద్యార్థిని చూసేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ఆస్కార్ ఫెర్నాండెజ్ గురువారం నగరానికి వచ్చారు. వారిద్దరి మధ్య ఉన్న బంధం.. ఏడేళ్ల క్రితం ఇంటి ముందున్న హోటల్‌లో తల్లి వద్ద ఆ బాలుడ్ని చూడ్డమే. అయితే, మూడు నెలల క్రితం తన తల్లి ఆచూకీ వెతుక్కుంటూ ఢిల్లీ వెళ్లిన బాలుడి పరిస్థితిని తెలుసుకున్న ఆయన చలించిపోయారు. సిటీలోని అమన్ వేదిక బాయ్స్ హోమ్‌లో ఉన్న పిల్లాడిని కలిసి యోగక్షేమాలు తెలుసుకున్నారు. వివరాల్లోకి వెళితే..
బన్సీలాల్‌పేట్: ఓ తల్లి ఉపాధి కోసం తన చంటి బిడ్డను తీసుకుని హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వలస పోయింది. అక్కడ ఓ హోటల్‌లో పని దొరకడంతో కొడుకు ఖాజా పాషాను సమీపంలోని ఓ హాస్టల్‌లో చేర్పించి తన చిరునామాగా ఎదురింట్లో ఉంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత అడ్రస్ ఇచ్చింది. కొద్దిరోజులకే ఆమే హోటల్‌లో పనిమానేసి ఎటో వెళ్లిపోయింది. ఏడాది పాటు చూసినా ఆమె రాకపోవడంతో హాస్టల్ వారు తమకు ఇచ్చిన అడ్రస్‌కు వెళ్లగా.. అది కాంగ్రెస్ నేత ఆస్కార్ ఫెర్నాండెజ్‌గా తెలిసి.. తప్పుడు చిరునామానేమోనని భావించి వెనుదిరిగి పోయారు. పిల్లాడు తెలుగు మాట్లాడ్డంతో 2012లో మోండా మార్కెట్ డివిజన్ ఆదయ్యనగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఉన్న అమన్ వేదిక బాయ్స్ హోమ్‌కు తరలించారు.
ప్రస్తుతం ఆరో తరగతి చదువుతున్న ఖాజా.. ఇన్నేళ్లుగా తన తల్లి కోసం ఎదురు చూసినా ఆచూకీ దొరక్కపోవడంతో మూడు నెలల క్రితం ఆమెను వెతుక్కుంటూ ఢిల్లీకి వెళ్లాడు. తాను గడిపిన పరిసరాల్లో తిరుగుతున్న బాలుడి గురించి తెలుసుకున్న ఎంపీ ఫెర్నాండెజ్.. విద్యార్థిని చేరదీసి వివరాలు తెసుకున్నారు. తిరిగి హైదరాబాద్ పంపారు. ఆ క్షణంలో బాలుడిపై ఎంపీ ప్రత్యేకమైన అభిమానం పెంచుకున్నారు. ఎవరూ లేని అనాథలా బతుకుతున్న బాలుడిని చూసేందుకు గురువారం ఢిల్లీ నుంచి స్వయంగా నగరానికి వచ్చి ఖాజా పాషాను కలిశారు. హోమ్ నిర్వాహకుడు సురేష్‌తో మాట్లాడి ఖాజా యోగక్షేమాలు తెలుసుకున్నారు. అనాథ పిల్లలను ఆదరించి ప్రయోజకులను చేయాలని కోరారు.
హోమ్ విద్యార్థులతో ఆస్కార్ ఫెర్నాండెజ్
Comments
Please login to add a commentAdd a comment