orphan boy
-
విషాదం: అమ్మమ్మా.. ఎంతపని చేశావ్!
అమలాపురం టౌన్: రెండేళ్ల వయస్సులో తండ్రి మరణం.. మూడేళ్ల వయసులో తల్లి వేరే పెళ్లితో దూరం..అమ్మమ్మ పెంపకంతో జీవనం... ఇప్పుడు ఆ ఒక్క ఆసరాగా ఉన్న అమ్మమ్మ కరోనాతో మరణం... అయినవాళ్లు ఉన్నా ఎవరూ తనను సాకేందుకు ముందుకు రాకపోవడం...నేను ఇక అనాథగా మిగిలిపోతానా... నన్నెవరూ చేరదీయరా...అంటూ ఆ పదేళ్ల బాలుడు పడుతున్న మనోవేదన వర్ణనాతీతం. అమలాపురం మైపాలవీధికి చెందిన సంకు సాయిచరణ్ రెండో ఏటే అతని తండ్రి అనారోగ్యంతో మృత్యువాత పడ్డాడు. దీంతో తల్లి, అన్న, అతను దిక్కులేని వారయ్యారు. ఆ కుటుంబం అమలాపురంలోని అమ్మమ్మ సూర్యవతి ఇంటికి చేరుకుంది. అన్నయ్యను బంధువులు దత్తత తీసుకున్నారు. అమ్మమ్మ పెద్ద మనసుతో ఆలోచించి తన కూతురికి వేరే పెళ్లి చేసి పంపించేసి, సాయిచరణ్‌ను తనే పెంచుకోవాలనుకుంది. అనుకున్నట్టుగానే ఏడేళ్ల కిందట అమ్మమ్మ.. సాయిచరణ్ అమ్మకు ఖమ్మం జిల్లా సింగరేణి ప్రాంతానికి చెందిన అప్పటికే భార్య చనిపోయిన వ్యక్తికి రెండో పెళ్లి చేసి సాగనంపింది. అప్పటి నుంచి మనవడు సాయిచరణ్‌ను చదివిస్తూ అల్లా రు ముద్దుగా చూస్తోంది. గత నెలలో అమ్మమ్మ సూర్యావతికి కరోనా సోకి మృత్యువాత పడింది. వేరే పెళ్లితో అప్పడు వెళ్లిన అమ్మ, సూర్యావతి కుమారులు కలిసి ఆమె అంత్యక్రియలు ముగించారు. కొద్దిరోజులకు సాయిచరణ్‌కు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. సాయిచరణ్‌ను ఎవరు పెంచాలన్నదే ప్రశ్నార్థకం? అమ్మమ్మ దిన కార్యక్రమం ఆమె రక్త సంబంధీకులంతా ఏ లోటూ లేకుండా పూర్తి చేశారు. అయితే సాయి చరణ్‌ను ఇక నుంచి ఎవరు పెంచాలనే ప్రశ్న తలెత్తింది. సాయిచరణ్‌కు తల్లిగా ఆమె తీసుకుని వెళితే బాగుంటుందని అమలాపురంలోని వారి బంధువులు ఒకే మాటగా చెప్పారు. అయి తే సాయిచరణ్ తల్లి, ఆమె భర్త మాత్రం అతని బాగోగులు బయట నుంచి మేమూ చూస్తూ ఉంటాం. అతడిని అమలాపురంలోని బంధువులే చేరదీసి పెంచాలని కోరుతున్నారు. బుధ, గురువారాల్లో అమలాపురంలోని ఆ కుటుంబాల పెద్దలు ఇరు పక్షాలతో చర్చించినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో నేనెవరికీ వద్దా... నన్నెవరూ తీసుకు వెళ్లరా..అంటూ సాయిచరణ్ మౌనంగా రోదిస్తున్నాడు. చదవండి: ఆధార్ లేకున్నా టీకా మరణించి.. నలుగురిలో జీవించి.. -
‘మాట్లాడటానికి ఓ కుటుంబం కావాలి’
అనాథలుగా బతకడం ఎంత కష్టమో చెప్పడానికి మాటలు చాలవు. స్వయంగా అనుభవిస్తే తప్ప ఆ బాధ ఎవరికి అర్థం కాదు. తల్లీతండ్రి ప్రేమకు నోచుకోకుండా.. నా అనే వాళ్లు ఎవరూ లేకుండా బతకడం నరకంతో సమానం. ఈ క్రమంలో ఓ తొమ్మిదేళ్ల అనాథ పిల్లాడి వేదన జనాలను కదిలిస్తోంది. అతడిని దత్తత తీసుకుంటామంటూ ఇప్పటికే 5వేల మంది అప్లై చేశారు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. వివరాలు.. తొమ్మిదేళ్ల జోర్డాన్ తన సోదరుడితో కలిసి గత ఆరేళ్లుగా అనాథాశ్రమంలో ఉంటున్నాడు. కొద్ది రోజుల క్రితం సోదరుడిని ఓ కుటుంబం దత్తత తీసుకుంది. దాంతో మరింత ఒంటరి అయ్యాడు జోర్డాన్. ఈ క్రమంలో కేఎఫ్ఓఆర్ వీక్లీ సిరీస్ ‘ఏ ప్లేస్ టు కాల్ హోమ్’ లైవ్ షోలో తనకంటూ ఓ కుటుంబం ఉంటే ఎంతో సంతోషిస్తానని.. ఓ శాశ్వత కుటుంబం కోసం తాను ఎంత ఆత్రంగా ఎదురు చూస్తున్నాడో తెలియజేశాడు జోర్డాన్. (ఆ ఘటన కలిచివేసింది: దివ్య దేవరాజన్) ఈ షోలో తన మనోవేదనను తెలిపాడు జోర్డాన్. ‘నాకంటూ ఓ కుటుంబం ఉంటే బాగుంటుంది. అమ్మ, నాన్న ఇతర కుటుంబ సభ్యులు. ఇవేం కుదరకపోతే కనీసం అమ్మ, నాన్న ఎవరో ఒకరు ఉన్నా చాలు. నేను మాట్లాడటానికి.. నా మనసులోని భావాలను తెలపడానికి నాకు ఓ కుటుంబం కావాలని బలంగా కోరుకుంటున్నాను. ఈ షో చూస్తున్న వారిలో ఎవరైనా నన్ను దత్తత తీసుకుంటారని ఆశిస్తున్నాను’ అన్నాడు. జోర్డాన్ వేదన పలువురిని కదిలించింది. అతడిని దత్తత తీసుకోవడనానికి ఎందరో ఆసక్తి చూపించారు. ఈ క్రమంలో జోర్డాన్ ఉంటున్న ఆశ్రమానికి అతడిని దత్తత తీసుకుంటామంటూ దాదాపు 5వేల అప్లికేషన్లు వచ్చాయి. ప్రస్తుతం ఆశ్రమ నిర్వహకులు జోర్డాన్‌ను పంపడానికి తగిన వ్యక్తుల కోసం అప్లికేషన్లను పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వహకుడు మాట్లాడుతూ... ‘గతంలో చాలా మంది జోర్డాన్‌ను దత్తత తీసుకెళ్లారు. కానీ అతడు వారి కుటుంబానికి సూట్ కాడని తెలిపి.. తిరిగి ఇక్కడకు తీసుకువచ్చేవారు’ అన్నాడు. -
మరుభూమే అమ్మ ఒడి
సాక్షి కడప: ఆమె నివసించేది శ్మశానం.. వృత్తి కాటికాపరి.. కటిక పేదరికం వెంటాడుతున్నా మనసు మాత్రం గొప్పది. తను తినడానకి తిండి లేక అల్లాడుతున్నా ఎవరో బస్టాండ్‌లో వదిలేసిన బిడ్డను పాతికేళ్గగా సాకుతున్న అమ్మ మనసు ఆమెది. కూర్చోలేడు, నడవలేడు, కదల్లేడు. ఆ బిడ్డకు అన్నీ తానై పెంచుతోంది కడపలోని ఆర్టీసి బస్టాండు సమీపంలోని హిందూ శ్మశాన వాటికలో నివాసం ఉంటున్న చిలంకూరు జయమ్మ దాతృత్వానికి తార్కాణమిది. పుట్టుకతోనే వికలాంగుడిగా జన్మించాడు మస్తాన్. రెండు చేతులు వంకర పోయాయి. కాళ్ళు కూడా చచ్చుబడి కదల్లేని పరిస్థితి. 25 ఏళ్ల క్రితం కదల్లేని మెదల్లేని ఈ బిడ్డను జయమ్మ బస్టాండ్‌లో గమనించింది. మనసు కరిగిపోయింది. ఆ బిడ్డకు మానసికంగా అంత ఎదుగుదల లేదు. మస్తాన్ అని పేరు పెట్టి కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. మస్తాన్‌కు అన్నీతానై.. శ్మశాన వాటికలోనే పాడుబడిన సత్రంలో జయమ్మ చాలాకాలంగా ఉంటోంది రు. శ్మశానానికి వచ్చే శవాలను పూడ్చడం మెదులు మిగతా పనులను చేయగా వచ్చిన సొమ్ముతో.. మస్తాన్‌తో పాటు జీవనం సాగిస్తోంది. మస్తాన్‌కు అన్నం తినిపించడంతో పాటు అన్ని పనులూ ఆమె చేయాల్సి ఉంటుంది. సైకిల్ ద్వారా నెమ్మదిగా మంచం వరకు తీసుకొచ్చి పడుకోబెడుతోంది. ఆర్ధికంగా చాలా ఇబ్బందులు పడుతున్నానని కన్నీరు పెట్టుకుంది జయమ్మ. 55 ఏళ్ళుగా ఉంటున్నా జయమ్మకు ఏ కార్డు దక్కలేదు. శ్మశానంలో డోరు నంబరు లేదన్న కారణంతో పథకాలకు దూరమయ్యారు.. చివరకు రేషన్ కార్డు కూడా లేదు. ఆదార్ కార్డు ఉన్నా శ్మశా నంలో ఉన్న వారికి లబ్ది చేకూరలేదు. అష్ట కష్టాలు పడుతున్న ఆమెకు రేషన్ కార్డుతో పాటు పింఛన్. ఇంటిపట్టా లాంటివి అందించాలని వేడుకుంటోంది.మస్తాన్ పరిస్దితి బాగు లేని విషయం తెలిసినా ఏఒక్కరూ కూడా స్పందించడం లేద ని ఆవేదన వ్యక్తం చేస్తొంది. దివ్యాంగుల కోటాలో మానవ తా హృదయంతో మస్తానుకు పించన్ మంజూరు చేసినా కొంత మేలు జరుగుతుందని జిల్లా కలెక్టరును వేడుకుంటోంది. -
అనాథ అని చేరదీస్తే...
బొమ్మనహళ్లి : అనాథగా తిరుగుతున్న యువకుడిని చేరదీసి అన్నం పెట్టిన పాపానికి చెడు అలవాట్లకు బానిసైన యువకుడు చేరదీసిన వృద్ధురాలిని హత్య చేసిన సంఘటన ఆలస్యం గా వెలుగులోకి వచ్చింది. వివరాలు... బొమ్మనహళ్లి పరిధిలోని రూపేన అగ్రహార ఎన్జీఆర్ లేఔట్లో యల్లమ్మ (80) అనే వృద్ధురాలు స్మశాసనంలో కాపలాగా ఉంటోంది. భర్త చనిపోవడంతో యల్లమ్మ రెండేళ్ల క్రితం హరీశ్ (19) అనే యువకుడిని చేరదీసింది. హరీశ్‌కు తల్లిదండ్రులు లేకపోవడంతో అతని అవ్వ దగ్గర పెరిగాడు. చెడు అలవాట్లకు బానిసకావడంతో హరీశ్‌ను ఆమె దూరంగా ఉంచింది. దీంతో ఇంట్లో నుంచి వెళ్లగొట్టడంతో హరీశ్ ఏమి చేయాలో తెలియక స్మశానం వద్దకు వచ్చేవాడు. దీంతో యల్లమ్మ అతనికి తరచూ అన్నం పెట్టి చేరదీసింది. ఈ క్రమంలో అతని బుద్ధి మారకపోగా స్నేహితులతో కలిసి చెడు అలవాట్లకు బానిస అవుతున్నాడని యల్లమ్మ హరీశ్‌ను మందలించింది. దీంతో శనివారం సాయంత్రం ఇద్దరు స్నేహితులతో వచ్చిన హరీశ్ వృద్ధురాలిపై విచక్షణరహితంగా దాడి చేసి పారిపోయారు. యలమ్మ గట్గిగా కేకలు వేయడంతో గొర్రెల కాపరులు అక్కడికి చేరుకుని చూడగా వృద్ధురాలు రక్తపు మడుగులో ఉంది. స్థానికుల సహకారంతో విక్టోరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు ఫిర్యాదు చేసుకున్న పోలీసులు కేసు విచారణ చేపట్టారు. వృద్ధురాలిపై అత్యాచారం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. -
ఆస్కార్జీ..హ్యాట్సాఫ్
అనాథగా మారిన ఓ విద్యార్థిని చూసేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ఆస్కార్ ఫెర్నాండెజ్ గురువారం నగరానికి వచ్చారు. వారిద్దరి మధ్య ఉన్న బంధం.. ఏడేళ్ల క్రితం ఇంటి ముందున్న హోటల్లో తల్లి వద్ద ఆ బాలుడ్ని చూడ్డమే. అయితే, మూడు నెలల క్రితం తన తల్లి ఆచూకీ వెతుక్కుంటూ ఢిల్లీ వెళ్లిన బాలుడి పరిస్థితిని తెలుసుకున్న ఆయన చలించిపోయారు. సిటీలోని అమన్ వేదిక బాయ్స్ హోమ్‌లో ఉన్న పిల్లాడిని కలిసి యోగక్షేమాలు తెలుసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. బన్సీలాల్‌పేట్: ఓ తల్లి ఉపాధి కోసం తన చంటి బిడ్డను తీసుకుని హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వలస పోయింది. అక్కడ ఓ హోటల్లో పని దొరకడంతో కొడుకు ఖాజా పాషాను సమీపంలోని ఓ హాస్టల్లో చేర్పించి తన చిరునామాగా ఎదురింట్లో ఉంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత అడ్రస్ ఇచ్చింది. కొద్దిరోజులకే ఆమే హోటల్లో పనిమానేసి ఎటో వెళ్లిపోయింది. ఏడాది పాటు చూసినా ఆమె రాకపోవడంతో హాస్టల్ వారు తమకు ఇచ్చిన అడ్రస్‌కు వెళ్లగా.. అది కాంగ్రెస్ నేత ఆస్కార్ ఫెర్నాండెజ్‌గా తెలిసి.. తప్పుడు చిరునామానేమోనని భావించి వెనుదిరిగి పోయారు. పిల్లాడు తెలుగు మాట్లాడ్డంతో 2012లో మోండా మార్కెట్ డివిజన్ ఆదయ్యనగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఉన్న అమన్ వేదిక బాయ్స్ హోమ్‌కు తరలించారు. ప్రస్తుతం ఆరో తరగతి చదువుతున్న ఖాజా.. ఇన్నేళ్లుగా తన తల్లి కోసం ఎదురు చూసినా ఆచూకీ దొరక్కపోవడంతో మూడు నెలల క్రితం ఆమెను వెతుక్కుంటూ ఢిల్లీకి వెళ్లాడు. తాను గడిపిన పరిసరాల్లో తిరుగుతున్న బాలుడి గురించి తెలుసుకున్న ఎంపీ ఫెర్నాండెజ్.. విద్యార్థిని చేరదీసి వివరాలు తెసుకున్నారు. తిరిగి హైదరాబాద్ పంపారు. ఆ క్షణంలో బాలుడిపై ఎంపీ ప్రత్యేకమైన అభిమానం పెంచుకున్నారు. ఎవరూ లేని అనాథలా బతుకుతున్న బాలుడిని చూసేందుకు గురువారం ఢిల్లీ నుంచి స్వయంగా నగరానికి వచ్చి ఖాజా పాషాను కలిశారు. హోమ్ నిర్వాహకుడు సురేష్‌తో మాట్లాడి ఖాజా యోగక్షేమాలు తెలుసుకున్నారు. అనాథ పిల్లలను ఆదరించి ప్రయోజకులను చేయాలని కోరారు. హోమ్ విద్యార్థులతో ఆస్కార్ ఫెర్నాండెజ్ -
పాపం పసివాడు
బాల్యంలో బతుకుభారం అమ్మానాన్నలకు దూరం... ఆదుకునేవారు కరువు అనాథకు ఆసరాగా నిలవని అంత్యోదయకార్డు మెదక్ రూరల్: చిన్నతనంలోనే తల్లిదండ్రుల ప్రేమకు దూరమై అనాథగా మారిన ఓ పసివాడిని విధి వంచిస్తే... ప్రభుత్వం సరఫరా చేసే రేషన్ సరుకులు రాకుండా అంత్యోదయకార్డును తొలగించిన అధికారులు ఆ పసివాడి కడుపు మాడుస్తున్నారు. మండలంలోని రాజ్‌పేటకు చెందిన బోయిని పవన్‌శ్రీకర్‌ను ఊహ తెలియని వయస్సులోనే తల్లి వదిలేసి వెళ్లిపోగా, నాలుగేళ్ల క్రితం తండ్రి లక్ష్మయ్య అనారోగ్యంతో మరణించాడు. దీంతో తల్లిదండ్రుల ఆలనా పాలనలో గడపాల్సిన బాల్యం ఒంటరితనాన్ని మిగిల్చింది. పవన్‌శ్రీకర్ నానమ్మ బోయిని ఊశమ్మ మనవడిని తనకు వచ్చే పింఛన్ డబ్బులతో బతికిస్తూ బడికి పంపుతోంది. ప్రస్తుతం పవన్‌శ్రీకర్ అదే గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో ఆరు నెలల క్రితం పవన్‌శ్రీకర్‌తోపాటు నానమ్మ ఊశమ్మకు చెందిన అంత్యోదయకార్డును అధికారులు తొలగించారు. దీంతో రేషన్ సరుకులు రాకపోవడంతో ఆ నానమ్మ, మనవళ్లు అర్ధాకలితో అలమటిస్తున్నారు. కనీసం ఉండడానికి ఇళ్లు కూడా లేని ఆ అభాగ్యులు గ్రామంలోని పొరుగువారి పంచన బతుకీడుస్తున్నారు. కాటికి కాలు చాపుకొని ఉన్న నేను మట్టిలో కలిసిపోతే పసివాడైన నా మనవడికి దిక్కెవరని ఆ వృద్ధురాలు ఊశమ్మ కన్నీటి పర్యంతమవుతోంది. ఉన్నత చదువులు చదవాలని కోరిక ఉన్నా పవన్‌ను చదివించే స్థోమత లేక వృద్ధురాలు ఆ బాలుడి భవిష్యత్‌ను గురించి కుంగిపోతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అంత్యోదయ కార్డు సరిచేసి రేషన్ సరుకులు ఇప్పించి తన మనవడు పవన్‌శ్రీకర్‌ను ఆదుకోవాలని వృద్ధురాలు ఊశమ్మ వేడుకుంటోంది.