Oscar Fernandes
-
ఫెర్నాండెజ్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సంతాపం తెలిపారు. యూపీఏ ప్రభుత్వంలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ కేబినెట్లో ఆస్కార్ ఫెర్నాండెజ్ రోడ్డు రవాణా & హైవే, కార్మిక, ఉపాధికల్పన శాఖలకు మంత్రిగా పనిచేశారన్నారు. తొలి యూపీఏ ప్రభుత్వంలోని కేబినెట్లో ఆయనతో కలిసి పనిచేసే అవకాశం లభించిందని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఆస్కార్ ఫెర్నాండెజ్ మృతి జాతీయ రాజకీయాలకు తీరని లోటని, ఆయన చేసిన సేవలు గొప్పవన్నారు. వారి కుటుంబసభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. చదవండి: రాజ్యసభ సభ్యుడు ఆస్కార్ ఫెర్నాండేజ్ మృతి -
Oscar Fernandes: రాజ్యసభ సభ్యుడు ఆస్కార్ ఫెర్నాండేజ్ మృతి
సాక్షి, బెంగళూరు: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ఆస్కార్ ఫెర్నాండేజ్ కన్నుమూశారు. ఆస్కార్ ఫెర్నాండేజ్ గత జూలై చివరలో మెదడులో రక్తం గడ్డకట్టడంతో మంగళూరు ఆసుపత్రిలో చేరి ఆపరేషన్ చేయించుకున్నారు. అప్పటి నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. ఫెర్నాండేస్ మృతిపై సదరు ఆస్పత్రి యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు ఫెర్నాండేజ్ మృతి పట్ల కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు ట్విటర్ వేదికగా సంతాపం ప్రకటించారు. Anguished by the passing away of Rajya Sabha MP and senior Congress leader, Shri Oscar Fernandes. Condolences to his family, friends and supporters. Om Shanti! — Rajnath Singh (@rajnathsingh) September 13, 2021 ఫెర్నాండెజ్ 1941 మార్చి 27న జన్మించారు. ఆయన తండ్రి రోక్ ఫెర్నాండెజ్ ఒక విద్యావేత్త., రోక్ ఫెర్నాండెజ్ మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి మొదటి అధ్యక్షుడిగా పనిచేశారు. ఆస్కార్ ఫెర్నాండేజ్ తల్లి లియోనిస్సా ఫెర్నాండెజ్ భారతదేశంలో మొదటి మహిళా మేజిస్ట్రేట్. కాగా ఫెర్నాండేజ్ 1975-76లో ఉడిపి మున్సిపల్ కౌన్సిలర్‌గా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అదే ఉడిపి నుంచి 1980లో మొదటిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. మొత్తం అయిదుసార్లు (1980, 1984, 1989, 1991, 1996) ఆయన ఉడిపి నుంచి ప్రాతినిధ్యం వహించారు. My heartfelt condolences to the family and friends of Shri Oscar Fernandes Ji. It is a personal loss for me. He was a guide and mentor to many of us in the Congress Party. He will be missed and fondly remembered for his contributions. pic.twitter.com/NZVD592GSJ — Rahul Gandhi (@RahulGandhi) September 13, 2021 ఫెర్నాండెజ్ 1984-85లో ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీకి పార్లమెంటరీ సెక్రటరీగా పనిచేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి అంత్యంత విశ్వసనీయ వ్యక్తిగా ఉన్నారు. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా పనిచేసిన యూపీఏ 1 హయాంలో ఆయన కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. 2004 నుంచి 2009 వరకు కేంద్ర మంత్రిగా విధులు నిర్వర్తించారు. విదేశాంగ వ్యవహారాలు, యూత్ అండ్ స్పోర్ట్స్, గణాంకాలు వాటి అమలు ప్రోగ్రాం, లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ శాఖల బాధ్యతలు చూశారు. అయితే 1999 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత ఫెర్నాండెజ్ రాజ్యసభకు నామినేట్ అయ్యారు. 2004లో కూడా మరోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. చదవండి: కాంగ్రెస్‌కు ఊహించని షాక్: హాట్‌హాట్‌గా ఉత్తరాఖండ్ రాజకీయం -
Oscar Fernandes: విషమంగా ఆస్కార్ ఆరోగ్యం
సాక్షి, యశవంతపుర: మంగళూరులో గత ఆదివారం ఇంట్లో జారి పడి ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ (80) ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. తల లోపల బలమైన గాయాలై మంగళూరులోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మెదడులో రక్తం గడ్డ కట్టినట్లు వైద్యులు నిర్ధారించారు. ఐసీయూలో వైద్యమందిస్తున్నారు. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిసింది. -
ఐసీయూలో ఆస్కార్ ఫెర్నాండెజ్
యశవంతపుర: సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు ఆస్కార్ ఫెర్నాండెజ్ (80) ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆదివారం మంగళూరు లోని అత్తావరలోని నివాసంలో యోగా చేస్తుండగా జారి పడడంతో తలకు దెబ్బ తగిలింది. ఏమీ కాలేదని పట్టించుకోలేదు. అయితే అదేరోజు సాయంత్రం ఒక ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా తల లోపల బలమైన గాయమైనట్లు వైద్యులు గుర్తించారు. ఆయనకు తక్షణం శస్త్రచికిత్స చేయాల్సి ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఐసీయూలో వైద్యమందిస్తున్నారు. -
పూజారీ... నేను బాగున్నా ఏడవకు
సాక్షి, బెంగళూరు: కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జనార్ధన్ పూజారి భోరున విలపించారు. మంగళూరులో చర్చి, దేవాలయంలో ఆయన నిన్న కన్నీళ్లు పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఆస్కార్ ఫెర్నాండేజ్ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలంటూ మొదట గోకర్ణనాథేశ్వర స్వామి ఆలయంలో జనార్థన పూజారి పూజలు చేసి విలపించారు. తర్వాత రోసారియో చర్చికి వెళ్లి ప్రార్థన చేస్తుండగా అక్కడకు ఆస్కార్‌ఫెర్నాండేజ్ వచ్చారు. ఈ సందర్భంగా పూజారిని గట్టిగా హత్తుకుని, తనకు ఏమీ కాలేదని ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు. ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ ఫెర్నాండేజ్ చెప్పారు. అయితే ఈ తతంగం అంతా అక్కడున్నవారిని ఆశ్చర్యపరిచింది. -
ఆస్కార్జీ..హ్యాట్సాఫ్
అనాథగా మారిన ఓ విద్యార్థిని చూసేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ఆస్కార్ ఫెర్నాండెజ్ గురువారం నగరానికి వచ్చారు. వారిద్దరి మధ్య ఉన్న బంధం.. ఏడేళ్ల క్రితం ఇంటి ముందున్న హోటల్లో తల్లి వద్ద ఆ బాలుడ్ని చూడ్డమే. అయితే, మూడు నెలల క్రితం తన తల్లి ఆచూకీ వెతుక్కుంటూ ఢిల్లీ వెళ్లిన బాలుడి పరిస్థితిని తెలుసుకున్న ఆయన చలించిపోయారు. సిటీలోని అమన్ వేదిక బాయ్స్ హోమ్‌లో ఉన్న పిల్లాడిని కలిసి యోగక్షేమాలు తెలుసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. బన్సీలాల్‌పేట్: ఓ తల్లి ఉపాధి కోసం తన చంటి బిడ్డను తీసుకుని హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వలస పోయింది. అక్కడ ఓ హోటల్లో పని దొరకడంతో కొడుకు ఖాజా పాషాను సమీపంలోని ఓ హాస్టల్లో చేర్పించి తన చిరునామాగా ఎదురింట్లో ఉంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత అడ్రస్ ఇచ్చింది. కొద్దిరోజులకే ఆమే హోటల్లో పనిమానేసి ఎటో వెళ్లిపోయింది. ఏడాది పాటు చూసినా ఆమె రాకపోవడంతో హాస్టల్ వారు తమకు ఇచ్చిన అడ్రస్‌కు వెళ్లగా.. అది కాంగ్రెస్ నేత ఆస్కార్ ఫెర్నాండెజ్‌గా తెలిసి.. తప్పుడు చిరునామానేమోనని భావించి వెనుదిరిగి పోయారు. పిల్లాడు తెలుగు మాట్లాడ్డంతో 2012లో మోండా మార్కెట్ డివిజన్ ఆదయ్యనగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఉన్న అమన్ వేదిక బాయ్స్ హోమ్‌కు తరలించారు. ప్రస్తుతం ఆరో తరగతి చదువుతున్న ఖాజా.. ఇన్నేళ్లుగా తన తల్లి కోసం ఎదురు చూసినా ఆచూకీ దొరక్కపోవడంతో మూడు నెలల క్రితం ఆమెను వెతుక్కుంటూ ఢిల్లీకి వెళ్లాడు. తాను గడిపిన పరిసరాల్లో తిరుగుతున్న బాలుడి గురించి తెలుసుకున్న ఎంపీ ఫెర్నాండెజ్.. విద్యార్థిని చేరదీసి వివరాలు తెసుకున్నారు. తిరిగి హైదరాబాద్ పంపారు. ఆ క్షణంలో బాలుడిపై ఎంపీ ప్రత్యేకమైన అభిమానం పెంచుకున్నారు. ఎవరూ లేని అనాథలా బతుకుతున్న బాలుడిని చూసేందుకు గురువారం ఢిల్లీ నుంచి స్వయంగా నగరానికి వచ్చి ఖాజా పాషాను కలిశారు. హోమ్ నిర్వాహకుడు సురేష్‌తో మాట్లాడి ఖాజా యోగక్షేమాలు తెలుసుకున్నారు. అనాథ పిల్లలను ఆదరించి ప్రయోజకులను చేయాలని కోరారు. హోమ్ విద్యార్థులతో ఆస్కార్ ఫెర్నాండెజ్ -
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలకు అందలం
న్యూఢిల్లీ: వరుస ఓటములతో కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలో సీనియర్లకు ప్రాధన్యం ఇచ్చింది. పార్టీకి నమ్మకంగా ఉంటున్న సీనియర్ నాయకులకు అవకాశం ఇచ్చింది. కేంద్ర మాజీ మంత్రులు పి చిదంబరం, కపిల్ సిబల్, జైరాం రమేష్, అంబికా సోనీ, ఆస్కార్ ఫెర్నాండెజ్ తదితరులు కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపికయ్యారు. తమిళనాడుకు చెందిన పి చిదంబరం మహారాష్ట్ర నుంచి, జైరాం రమేష్ సొంతరాష్ట్రం కర్ణాటక నుంచి పోటీ చేయనున్నారు. కపిల్ సిబల్ ఉత్తరప్రదేశ్ నుంచి బరిలో దిగనున్నారు. అంబికా సోనీ, ఆస్కార్ ఫెర్నాండెజ్‌తో పాటు వివేక్ ఠంకా, ఛాయ వర్మలను కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేశారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీని వరుస ఓటములు వెంటాడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన కేరళ, అసోం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయంపాలైన సంగతి తెలిసిందే. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో మాత్రం అధికారంలోకి రావడం కాంగ్రెస్‌కు కాస్త ఊరట కలిగించే విషయం. కష్టాల్లో ఉన్న కాంగ్రెస్‌కు పూర్వవైభవం తీసుకొచ్చేందుకుగాను రాజ్యసభ ఎన్నికల్లో సీనియర్లకు సముచిత ప్రాధాన్యం కల్పించారు. -
రైతులకు ప్రాధాన్యత
మండ్య, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ రైతులకు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని, ఈ విధానాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పష్టం చేశారు. రాష్ట్ర శాసన సభ ఎన్నికలు, లోక్‌సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఇచ్చిన మద్దతును కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. మద్దతునిస్తారనే విశ్వాసం తనకుందన్నారు. శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు గాను ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేయడానికి ఇక్కడి సర్ ఎం. విశ్వేశ్వరయ్య స్టేడియంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. శాసన సభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చుతామని తెలిపారు. ఇప్పటికే రూపాయి కిలో బియ్యం పథకం ‘అన్న భాగ్య’ అమలులోకి వచ్చిందన్నారు. ఇంకా అనే సంక్షేమ కార్యక్రమాలు అమలులోకి వచ్చాయని చెప్పారు. గతంలో ఎస్ఎం. కృష్ణ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ సాధనల వల్ల మొత్తం ప్రపంచమే బెంగళూరు వైపు చూసిందని అన్నారు. అనంతరం బీజేపీ ప్రభుత్వ హయాంలో లక్షల మంది నిరుద్యోగులు ఉపాధికి దూరమయ్యారని ఆరోపించారు. ఎల్లరిగూ నమస్కార (అందరికీ నమస్కారం) అంటూ ఆమె ప్రసంగాన్ని ప్రారంభించారు. శాసన సభ ఎన్నికలప్పుడు తాను ఇక్కడికి వచ్చి కాంగ్రెస్‌కు మద్దతునివ్వాల్సిందిగా కోరానని గుర్తు చేశారు. ఆ ప్రకారం పార్టీని ఆదరించినందుకు ఈ సందర్భంగా ఆమె ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ప్రశంసిస్తూ, ప్రజల కోసం ఆయన ఎన్నో ఆందోళనలు చేశారని కొనియాడారు. మళ్లీ ఆశీర్వదించండి : సీఎం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ మండ్య ప్రజలు రమ్యను దీవించారని, బెంగళూరు గ్రామీణ ప్రజలు కూడా డీకే. సురేశ్‌ను ఆదరించారని కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ హయాంలో నిరాదరణకు గురైన మహిళలు, మైనారిటీలు, వికలాంగుల పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం మెరుగు పరిచిందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ను ఆశీర్వదించాలని కోరారు. వచ్చే ఐదేళ్లలో కర్ణాటకను దేశంలో అగ్ర స్థానంలో నిలబెడతామని తెలిపారు. సభలో అంతకు ముందు కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర ఆహూతులకు స్వాగతం పలికారు. మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం. కృష్ణ, కేంద్ర మంత్రులు మల్లిఖార్జున ఖర్గే, వీరప్ప మొయిలీ, ఆస్కార్ ఫెర్నాండెజ్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్, మంత్రి అంబరీశ్ ప్రభృతులు పాల్గొన్నారు. దళితుడిపై లాఠీచార్జ సోనియా గాంధీ ప్రసంగిస్తున్నప్పుడు దళిత సంఘర్ష సమితి కార్యకర్తలు నల్ల జెండాలను ప్రదర్శించారు. వారిలో ఒకరిని పోలీసులు చితకబాదారు. దీంతో అతనికి నుదుటిపై రక్త గాయమైంది. -
హెచ్ఐవీ బాధితుల రక్షణకు బిల్లు
HIV/AIDS Bill in next Parliament session: Oscar Fernandes బెంగళూరు, న్యూస్‌లైన్: హెచ్ఐవీ బాధితుల రక్షణకు త్వరలో పార్లమెంటులో బిల్లును ప్రవేశ పెడతామని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ తెలిపారు. కర్ణాటకలో హెచ్ఐవీ నియంత్రణకు కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో నగరంలోని వికాససౌధలో మంగళవారం ఏర్పాటు చేసిన చర్చాగోష్టిలో ఫెర్నాండెజ్ ప్రసంగించారు. పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టడానికి ముందు దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, స్పీకర్లు, ఆరోగ్య శాఖల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశాన్ని నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. దీనిపై సెక్స్ వర్కర్లు, స్వచ్ఛంద సంస్థలతో హైదరాబాద్‌లో సమావేశాన్ని కూడా నిర్వహించాలనుకున్నామని, అయితే సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా దానిని కర్ణాటకలో నిర్వహించాలని నిర్ణయించామన్నారు. అక్టోబరు లేదా నవంబరులో సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు.