మండ్య, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ రైతులకు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని, ఈ విధానాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పష్టం చేశారు. రాష్ట్ర శాసన సభ ఎన్నికలు, లోక్‌సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఇచ్చిన మద్దతును కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. మద్దతునిస్తారనే విశ్వాసం తనకుందన్నారు. శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు గాను ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేయడానికి ఇక్కడి సర్ ఎం. విశ్వేశ్వరయ్య స్టేడియంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు.
శాసన సభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చుతామని తెలిపారు. ఇప్పటికే రూపాయి కిలో బియ్యం పథకం ‘అన్న భాగ్య’ అమలులోకి వచ్చిందన్నారు. ఇంకా అనే సంక్షేమ కార్యక్రమాలు అమలులోకి వచ్చాయని చెప్పారు. గతంలో ఎస్‌ఎం. కృష్ణ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ సాధనల వల్ల మొత్తం ప్రపంచమే బెంగళూరు వైపు చూసిందని అన్నారు.
అనంతరం బీజేపీ ప్రభుత్వ హయాంలో లక్షల మంది నిరుద్యోగులు ఉపాధికి దూరమయ్యారని ఆరోపించారు. ఎల్లరిగూ నమస్కార (అందరికీ నమస్కారం) అంటూ ఆమె ప్రసంగాన్ని ప్రారంభించారు. శాసన సభ ఎన్నికలప్పుడు తాను ఇక్కడికి వచ్చి కాంగ్రెస్‌కు మద్దతునివ్వాల్సిందిగా కోరానని గుర్తు చేశారు. ఆ ప్రకారం పార్టీని ఆదరించినందుకు ఈ సందర్భంగా ఆమె ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ప్రశంసిస్తూ, ప్రజల కోసం ఆయన ఎన్నో ఆందోళనలు చేశారని కొనియాడారు.
మళ్లీ ఆశీర్వదించండి : సీఎం
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ మండ్య ప్రజలు రమ్యను దీవించారని, బెంగళూరు గ్రామీణ ప్రజలు కూడా డీకే. సురేశ్‌ను ఆదరించారని కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ హయాంలో నిరాదరణకు గురైన మహిళలు, మైనారిటీలు, వికలాంగుల పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం మెరుగు పరిచిందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ను ఆశీర్వదించాలని కోరారు.
వచ్చే ఐదేళ్లలో కర్ణాటకను దేశంలో అగ్ర స్థానంలో నిలబెడతామని తెలిపారు. సభలో అంతకు ముందు కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర ఆహూతులకు స్వాగతం పలికారు. మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఎం. కృష్ణ, కేంద్ర మంత్రులు మల్లిఖార్జున ఖర్గే, వీరప్ప మొయిలీ, ఆస్కార్ ఫెర్నాండెజ్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్, మంత్రి అంబరీశ్ ప్రభృతులు పాల్గొన్నారు.
దళితుడిపై లాఠీచార్‌జ
సోనియా గాంధీ ప్రసంగిస్తున్నప్పుడు దళిత సంఘర్ష సమితి కార్యకర్తలు నల్ల జెండాలను ప్రదర్శించారు. వారిలో ఒకరిని పోలీసులు చితకబాదారు. దీంతో అతనికి నుదుటిపై రక్త గాయమైంది.
రైతులకు ప్రాధాన్యత
Published Tue, Oct 1 2013 3:24 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
Advertisement
Advertisement