
పాడుబడి, పెచ్చులూడుతూ ప్రమాదకరంగా ఉన్న ఉస్మానియా ఆస్పత్రి భవనాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఇక్కడి వైద్యులు వినూత్న నిరసనకు దిగారు. శిథిల భవనం స్థానంలో కొత్త భవనం నిర్మించాలని కొన్నాళ్లుగా వైద్యులు కోరుతున్నా ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో గురువారం చెట్ల కిందే రోగులకు సేవలు అందించారు.
సాక్షి, సిటీబ్యూరో: కొత్త భవన నిర్మాణం కోసం ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు గురువారం వినూత్న పద్ధతిలో నిరసనకు దిగారు. ఇప్పటికే గత కొంత కాలంగా రకరకాల పద్ధతుల్లో నిరసన తెలిపిన వైద్యులు తాజాగా భవనం నుంచి బయటికి వచ్చి బయటి రోగులకు చెట్లకిందే వైద్యసేవలు అందించారు. ప్రస్తుతం ఉన్న భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో పాటు రోజుకో ప్రాంతంలో పెచ్చులూడి పడుతున్నాయి. ఇప్పటికే పలువురు రోగులు గాయాలపాలై ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే.
ఆస్పత్రి పాతభవనం దుస్థితి..ఎదరవుతున్న ఇబ్బందులపై వైద్యాధికారులు అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రభుత్వం నుంచి స్పందన లభించలేదు. తమకు రక్షణ కల్పించాలని కోరుతూ చివరకు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు సైతం చేశారు. రోగులకే కాదు వైద్యుల ప్రాణాలకు రక్షణ కల్పించలేని పాత భవనంలో చికిత్సలు అందించలేమని స్పష్టం చేస్తూ గురు వారం ఓపీ ప్రధాన ద్వారం బయటే చెట్ల కింద రోగులకు సేవలు అందించి నిరసన తెలిపారు. ఇదే సమయంలో ఔట్‌పేషెంట్ విభాగంలో ఓపీ టోకెన్లు జారీ చేసే కంప్యూటర్ మెరాయించడంతో రోగులు ఇబ్బంది పడాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment