
సాక్షి, హైదరాబాద్ : ప్రతిష్టాత్మక ఉస్మానియా జనరల్ ఆస్పత్రిని మళ్లీ మురుగు నీరు ముంచెత్తింది. బుధవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి పాతభవనంలోని సూపరింటెండెంట్ చాంబర్ సహా కారిడార్ మేల్ వార్డులు ఉస్మాన్‌సాగర్‌ను తలపించాయి. ఆస్పత్రిలోకి వరద నీరు ముంచెత్తడంతో వార్డుల్లో చికిత్స పొందుతున్న ఇన్‌పేషెంట్లు మాత్రమే కాదు..వారికి చికిత్సలు అందిస్తున్న వైద్య సిబ్బంది సైతం బెంబేలెత్తిపోయారు. వందేళ్ల క్రితం నిర్మించిన ఈ భవనం ఇప్పటికే చాలా వరకు శిథిలావస్థకు చేరుకుంది. తరచూ పైకప్పులు పెచ్చులూడిపడుతుండటం, శ్లాబ్ సహా గోడలకు పగుళ్లు ఏర్పడటంతో చిన్నపాటి వర్షం కురిసినా నీరు కిందికి ఇంకుతుంది.
అటకెక్కిన కొత్త భవనాల హామీ
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 జూలైలో సీఎం కేసీఆర్ ఆస్పత్రిని సందర్శించి, వారం రోజుల్లో రోగులను ఖాళీ చేయించి, పాతభవనం స్థానంలో అత్యాధునిక రెండు బహుళ అంతస్థుల భవనాలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. కానీ ఇప్పటి వరకు పైసా కూడా విడుదల చేయలేదు. ఆస్పత్రి నిర్మాణ ప్రస్తావనను కూడా పూర్తిగా విస్మరించడంతో సాక్షాత్తూ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ అటకెక్కింది. మురుగు నీటి వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతినడంతో వర్షానికి ఆస్పత్రి ఆవరణలోని పలు మ్యాన్‌హోళ్లు పొంగిపొర్లుతున్నాయి. వర్షపు నీటికి మురుగు నీరు తోడై..వార్డులను ముంచెత్తడంతో రోగులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. కొంతమంది రోగులు వరద నీటికి పరుపులను అడ్డుపెట్టి..నీటిని బయటికి తోడేశారు. మరికొంత మంది పడకల కింద నీరు చేరినప్పటికీ..విధిలేని పరిస్థితుల్లో అలాగే ఉండిపోయారు. వైద్యులు, స్టాఫ్ నర్సులు రోగుల వద్దకు వెళ్లలేని దుస్థితి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment