ఓయూ శతాబ్దికి భారీ ఏర్పాట్లు
► రూ. 28 కోట్లతో ఉస్మానియా వర్సిటీ ‘ఎ’ గ్రౌండ్‌లో భారీ వేదిక
► వీఐపీలు సహా 15 వేల మంది హాజరయ్యే అవకాశం
సాక్షి, హైదరాబాద్
ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే రూ.28 కోట్లతో క్యాంపస్ ‘ఎ’గ్రౌండ్‌లో భారీ వేదికను ఏర్పాటు చేసింది. వర్సిటీ చాన్స్‌లర్, గవర్నర్ నరసింహన్ అధ్యక్షతన జరుగుతున్న ఉత్సవాలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, నగర మేయర్ బొంతు రామ్మోహన్ హాజరవుతుండటంతో క్యాంపస్‌లో ఇప్పటికే భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
150 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 15 వేల మంది రాజకీయ ప్రముఖులు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, అలుమినీ సభ్యులు, పూర్వ, ప్రస్తుత విద్యార్థులు, పూర్వ అధ్యపకులు, ఉద్యోగులు తరలివస్తున్నారు. ఇప్పటికే ఆహ్వాన పత్రాలు స్పీడ్ పోస్టులో పంపించారు. వాహనాల పార్కింగ్ పాస్‌లు, రూట్ మ్యాప్‌లను అందులో ఉంచారు. యాదగిరి, దూరదర్శన్, ఇంటర్ నెట్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఓయూ ఉత్సవాలను చూడవచ్చు అని అధికారులు తెలిపారు.
రాష్ట్రపతి కోసం ప్రత్యేక దారి...
వేదిక వద్దకు రాష్ట్రపతి నేరుగా వచ్చేందుకు పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తార్నాక చౌరస్తా మీదుగా ఆర్టీసీ ఆస్పత్రి లోపలి నుంచి నేరుగా సభాస్థలికి చేరుకునేందుకు అడ్డుగా ఉన్న ఆస్పత్రి ప్రహరీని ఇప్పటికే కూల్చి వేశారు. రాకపోకలకు ఇబ్బంది కలగకుండా బీటీ రోడ్డును నిర్మించారు. ప్రముఖుల కోసం తార్నాక ప్రధాన రహదారి వెంట ఉన్న ప్రహరీని కూల్చివేసి దారిని ఏర్పాటు చేవారు. అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు, అనుబంధ కాలేజీల ప్రతినిధుల కోసం ఇంజనీరిం గ్ కాలేజీ గ్రౌండ్‌లో, అలుమినీ అసోసియేషన్ సభ్యుల కోసం ఆ అసోసియేషన్ కార్యాలయం ముందు పార్కింగ్ ఏర్పాటు చేశారు. పార్కింగ్ నుంచి వేదిక వద్దకు చేరుకోవడానికి ప్రత్యేక బస్సులను సిద్ధం చేశారు. సభాస్థలి వద్ద 25 భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లు అమర్చారు. ఎండల నేపథ్యంలో రూ.1.2 కోట్లతో 15 వేల సీట్ల సామర్థ్యంతో క్లోజ్డ్‌షెడ్డు, అందులో ఏసీ, నీటి వసతి కల్పించారు.
ఓయూలో గంట పాటు రాష్ట్రపతి...
– శతాబ్ది ఉత్సవాల ప్రారంభ కార్యక్రమంలో భాగంగా 26న (బుధవారం) ఉదయం 10.30 నుంచి 12 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతాయి.
– 12–12.30 గంటల మధ్యలో సుద్దాల అశోక్‌తేజ రాసిన, వందేమాతరం శ్రీనివాస్ స్వరపరిచిన ‘జయ జయ ఉస్మానియా’పాట ప్లే. ఓయూ జర్నలిజం విభాగం వర్సిటీపై రూపొందించిన డాక్యుమెంటరీ ప్రదర్శన.
– 12.30కి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి వేదిక వద్దకు చేరుకుంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఉత్సవాల సావనీర్ ఆవిష్కరించి, ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1.30కి తిరిగి వెళ్లిపోతారు.
– సాయంత్రం 3–5 గంటల మధ్యలో ఎంపీ కేశవరావు అధ్యక్షతన ‘రోల్ ఆఫ్ తెలంగాణ అండ్ నేషన్ బిల్డింగ్’అంశంపై సెమినార్. కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి హాజరవుతారు.
– సాయంత్రం 6.30– రాత్రి 9 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు.
రెండో రోజు వివిధ అంశాలపై సెమినార్లు...
– ఉత్సవాల్లో రెండో రోజైన గురువారం ఉదయం 10–11 గంటల వరకు నోబెల్ లెక్చర్స్ తొలి సెషన్‌లో భాగంగా ‘బిల్డింగ్ ప్లూరలిస్టిక్ డెమెక్రసీ’అంశంపై ప్రసంగాలు. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పాల్గొంటారు.
– రెండో సెషన్ (11.45–1.15 గంటలు)లో భాగంగా ‘ఇండియా ఇన్ స్పెస్’అంశంపై ఐఐసీటీ డైరెక్టర్ ఎస్.చంద్రశేఖర్, ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ ప్రసంగిస్తారు.
– సాయంత్రం 3–5 గంటల మధ్య ఎ గ్రౌండ్‌లో ‘అలుమిని మీట్’. మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి హాజరవుతారు.
– మూడో సెషన్‌లో సాయంత్రం 4–5 గంటల వరకు ఆల్ ఇండియా వీసీల సమావేశం. కేంద్ర మంత్రి ప్రకాశ్‌జవదేకర్ పాల్గొంటారు.
– సాయంత్రం 6.30– రాత్రి 9 గంటల వరకు ఆర్ట్స్ కాలేజీ ముందు సాంస్కృతిక కార్యక్రమాలు.
మూడో రోజు ముగింపు సభ...
– శుక్రవారం ఉదయం 9–12.15 గంటల వరకు ఐఐసీటీ ఆడిటోరియంలో ఆల్ ఇండియా వీసీల సమావేశం, సాంకేతిక సెషన్ కొనసాగుతుంది. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి పాల్గొంటారు.
– ఉదయం 10–1 గంటల మధ్య రీజినల్ సెంటర్ ఫర్ అర్బన్ అండ్ ఎన్విరాన్‌మెంట్ స్టడీస్‌లో ‘ఓయూ విజన్’పై ప్యానల్ డిస్కషన్. సాయంత్రం ఆరు గంటలకు ఆర్ట్స్ కాలేజీ వద్ద ముగింపు సభ.
గుర్తింపు కార్డులు తప్పనిసరి: సీపీ
కాగా, సోమవారం ఓయూ వీసీ రాంచంద్రం, సీపీ మహేందర్‌రెడ్డి క్యాంపస్‌లోని ఎ–గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన వేదిక, సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. 3,500 పోలీసులను మోహరించామని, ఏ–గ్రౌండ్స్ నుంచి కిలోమీటర్ వరకు 144వ సెక్షన్ విధించినట్లు సీపీ తెలిపారు. ఉత్సవాలకు వచ్చే వారు ఉదయం 10 గంటలకల్లా ప్రాంగణానికి చేరుకోవాలన్నారు. ఆహ్వాన కార్డుతో పాటు గుర్తింపు కార్డు తప్పని సరన్నారు. బయోమెట్రిక్‌లో వేలుముద్రవేసి లోనికి వెళ్లాలని తెలిపారు.