నేడే రాష్ట్రపతి రాక
- ఉస్మానియా శతాబ్ది వేడుకల్లో పాల్గొననున్న ప్రణబ్
- అనంతరం ఇఫ్లూ తొలి స్నాతకోత్సవంలో ప్రసంగం
- సాయంత్రం తిరిగి ఢిల్లీకి.. పటిష్టంగా బందోబస్తు ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: ఒక రోజు రాష్ట్ర పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం ఉదయం హైదరాబాద్‌కు రానున్నారు. ఉదయం పది గంటలకు గోవా నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి.. మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్‌లతో పాటు పలువురు మంత్రులు రాష్ట్రపతికి ఘనస్వాగతం పలుకుతారు. అనంతరం రాష్ట్రపతి ఉస్మానియా యూనివర్సిటీకి చేరుకుని.. శతాబ్ది వేడుకల ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రసంగిస్తారు.
అక్కడి నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. అక్కడే మధ్యాహ్న భోజనం చేసి, కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం నాలుగు గంటలకు గచ్చిబౌలిలోని గ్లోబల్ పీస్ ఆడిటోరియానికి చేరుకుంటారు. నాలుగున్నరకు ‘ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)’మొదటి స్నాతకోత్సవంలో ప్రసంగిస్తారు. తర్వాత నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని.. సాయంత్రం 6.20 గంటలకు వైమానిక దళ ప్రత్యేక విమానంలో తిరిగి ఢిల్లీకి బయలుదేరుతారు.
పటిష్టంగా భద్రతా ఏర్పాట్లు
రాష్ట్రపతి పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై డీజీపీ అనురాగ్‌శర్మ మంగళవారం ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఉస్మానియా శతాబ్ది వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చర్యలు చేపట్టాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డికి సూచిం చారు. ఇబ్బందులు సృష్టించేందుకు యత్నించే వారిని గుర్తించి ముందస్తుగా అదుపులోకి తీసుకోవాలని పేర్కొన్నట్లు సమాచారం. ఇక ఉస్మానియా వర్సిటీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు 3 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. వర్సిటీతో పాటు చుట్టూ ఉన్న ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. టాస్క్‌ఫోర్స్, ఎస్‌బీ, సీఏఆర్, బాంబు స్క్వాడ్ తదితర బృందాలను కూడా సిద్ధం చేశారు. ఓయూ పరిధిని వివిధ ప్రాంతాలుగా విభజించి.. ఒక్కో ప్రాంతం బాధ్యతను ఒక్కో ఉన్నతాధికారికి అప్పగించారు. ప్రముఖులు, ఉత్సవాలSకు హాజరయ్యే వారి కోసం వర్సిటీ చుట్టూ 12 చోట్ల ఎంట్రీ పాయింట్లు ఏర్పాటు చేశారు. మిగతా చోట్ల ఉన్న ప్రవేశాలను తాత్కాలికంగా మూసివేశారు.