ఘనంగా వందేళ్ల పండుగ | Osmania University Shatabdi Celebrations as Grand festival | Sakshi
Sakshi News home page

ఘనంగా వందేళ్ల పండుగ

Published Thu, Apr 27 2017 2:17 AM | Last Updated on Tue, Aug 14 2018 11:02 AM

ఘనంగా వందేళ్ల పండుగ - Sakshi

ఘనంగా వందేళ్ల పండుగ

- రాష్ట్రపతి, గవర్నర్, సీఎం సహా పలువురు అతిథులు హాజరు 
- శతాబ్ది భవనం, హాస్టళ్లకు శంకుస్థాపన చేసిన రాష్ట్రపతి

- పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఉద్యోగులు, విద్యార్థులు
- కాలేజీలు, హాస్టళ్లలో తిరుగుతూ గత స్మృతులను గుర్తుచేసుకున్న వైనం
- వేడుకల్లో ప్రసంగించని సీఎం కేసీఆర్‌.. విద్యార్థుల నిరసన.. అరెస్టు
- ఉత్సవాల ఏర్పాట్లపై  విద్యార్థుల అసంతృప్తి  


సాక్షి, హైదరాబాద్‌: పోరాటాల పురిటిగడ్డ ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మధ్యా హ్నం 12.30కు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ప్రముఖులు ప్రసంగించిన అనంత రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు, కళారూపాలను ప్రదర్శించారు. గవర్నర్‌ నరసింహన్, సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి దత్తాత్రేయ తదితర ప్రముఖులతో పాటు పెద్ద సంఖ్యలో ప్రస్తుత, పూర్వ అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. 

గోవా నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టుకు వచ్చిన రాష్ట్రపతి.. మధ్యా హ్నం 12.30కు ఉస్మానియా వర్సిటీకి చేరుకున్నారు. వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ రామచంద్రం, రిజిస్ట్రార్‌ గోపాల్‌రెడ్డిలు అతిథులను సాదరంగా వేదికపైకి ఆహ్వానించి శాలువా, మెమెంటోలతో సత్కరించారు. అనంతరం రాష్ట్రపతి ప్రణబ్‌ శతాబ్ది వేడుకలను ప్రారంభించారు. శతాబ్ది ఉత్సవాలను పురస్కరించు కుని రూపొందించిన ‘వందేళ్ల ఉస్మానియా (తెలుగు)’, రిఫ్లెక్షన్‌ (ఇంగ్లిషు), సౌఘాత్‌ (ఉర్దూ)’ సావనీర్లను గవర్నర్‌ నరసింహన్‌ ఆవిష్కరించి... తొలి కాపీలను రాష్ట్రపతికి అందజేశారు. అనంతరం రూ.75 కోట్లతో నిర్మించ తలపెట్టిన శతాబ్ధి పరిపా లనా భవనం, హాస్టల్‌ భవనాలకు రాష్ట్రపతి శంకుస్థాపన చేశారు.

డాక్యుమెంటరీ.. కళాకారుల ప్రదర్శన
అంతకుముందు ఉస్మానియా విశ్వవిద్యాలయం గొప్పతనాన్ని కీర్తిస్తూ సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ రాసిన, వందేమాతరం శ్రీనివాస్‌ స్వర పరిచిన ‘జయ జయ ఉస్మానియా’ పాటను వేదికపై వినిపించారు. ఓయూ జర్నలిజం విభాగం విద్యా ర్థులు రూపొందించిన ‘వందేళ్ల ఉస్మానియా డాక్యు మెంటరీ’ని ప్రదర్శించారు. సాంస్కృతిక సారథికి చెందిన 50 మంది కళాకారులు పలు కళారూపాలు ప్రదర్శించారు. లిటిల్‌ మ్యుజీషియన్స్‌ అకాడమీకి చెందిన వంద మంది కళాకారులు ‘వందగళాల’ పేరుతో ఆలపించిన సారే జహాసే అచ్చా గీతం ప్రత్యే క ఆకర్షణగా నిలిచింది. వేడుకల్లో గవర్నర్‌ నర సింహన్, సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఉత్సవ నిర్వాహక కమిటీ చైర్మన్, ఎంపీ కె.కేశవరావు, గ్రేటర్‌ హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్, ఉస్మాని యా యూనివర్సిటీ పూర్వ, ప్రస్తుత అధ్యాపకులు, విద్యా ర్థులు పాల్గొన్నారు.

నిరాశతో వెనుదిరిగిన విద్యార్థులు
శతాబ్ది ఉత్సవాల నిర్వహకులు సభాస్థలం వద్ద 24 గ్యాలరీలు, 15 వేల మంది కూర్చునేలా ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి, సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఇతర ప్రముఖులు ఆర్టీసీ ఆస్ప త్రి మధ్య నుంచి సభాస్థలికి చేరుకోగా.. వీఐపీలను ఏ–1 గేటు నుంచి.. వీసీలు, డీన్లు, ప్రిన్సిపాల్స్‌ను ఏ–2 గేటు నుంచి.. అలుమ్నీ సభ్యులు, ఫ్యాకల్టీ, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్, అనుబంధ కాలేజీల అధ్యాపకులు, విద్యార్థులను ఇతర గేట్ల నుంచి అనుమతించారు. ఉస్మానియా క్యాంపస్‌తోపాటు తార్నాక, హబ్సిగూడ, ఎన్‌సీసీ గేటు, వడ్డెర బస్తీ అంతా పోలీసులు భారీగా మోహరించారు. సభాస్థలి చుట్టూ రెండంచెల భద్రత ను ఏర్పాటు చేశారు. అయితే చాలా మంది అధ్యా పకులు, విద్యార్థులు వేడుకలకు హాజరుకాలేక వెను దిరగాల్సి వచ్చింది. ఉత్సవాల ఆహ్వానపత్రంలో ఇచ్చిన కోడ్‌ నంబర్‌తో ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్‌/ ఎంప్లాయీ ఐడీ నంబర్‌ ఎంటర్‌ చేసి ఎంట్రీ పాస్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని.. దానితోపాటు ఆధార్‌గానీ, ఇతర ఐడీగానీ వెంట తీసుకురావాలని నిర్వాహకులు సూచించారు. కానీ చాలా మందికి ఈ సమాచారం అందలేదు. ఆహ్వాన లేఖతోనే లోనికి వెళ్లవచ్చని భావించి వర్సిటీ వద్దకు వచ్చినా.. ఎంట్రీ పాస్‌ లేదంటూ భద్రతా సిబ్బంది లోనికి అనుమతిం చలేదు.

తగిన ఏర్పాట్లు లేక ఇబ్బందులు
ఉత్సవాల వేదిక వద్దకు రాలేకపోయిన వారి కోసం వేదిక బయట ఉన్న ఆడిటోరియాలు, సమావేశ మందిరాల్లో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు చెప్పినా.. ఎక్కడా కన్పించలేదు. ఇంజనీరింగ్‌ కాలేజీ గ్రౌండ్, పీజీఆర్‌సీ పార్కింగ్‌ ప్లేస్, ఆర్ట్స్‌కాలేజీ పార్కింగ్‌ స్థలాలకు.. ‘ఏ’గ్రౌండ్‌లోని సభాస్థలికి మధ్య కిలోమీటర్‌ వరకు దూరం ఉంటుంది. పార్కింగ్‌ స్థలాల నుంచి సభాస్థలికి వచ్చేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తామన్నా.. అవేవీ కనిపించలేదు. చాలా మంది తీవ్రమైన ఎండలో నడవలేక ఇబ్బంది పడ్డారు. మధ్యలో కనీసం తాగునీరు కూడా ఏర్పాటు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తమైంది. సభాస్థలి వద్ద సరిపడా టాయిలెట్లు ఏర్పాటు చేయకపోవడంతో మహిళలు ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇక మధ్యాహ్న భోజనం అధ్వానంగా ఉందని విద్యార్థులు పేర్కొన్నారు.

ప్రసంగించని కేసీఆర్‌.. విద్యార్థుల నిరసన
శతాబ్ది ఉత్సవాల వేదికపై గవర్నర్‌ నర సింహన్, సీఎం కేసీఆర్‌లు ప్రసంగాలు చేయకపోవడం చర్చనీయాంశమైంది. బేగంపేట విమానా శ్రయంలో రాష్ట్రపతికి స్వాగతం పలికిన సీఎం, గవర్నర్‌ ఆయన వెంటే ఉస్మానియా క్యాంపస్‌కు చేరుకున్నారు. రాష్ట్రపతితో కలసి వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమం ప్రణాళిక ప్రకారం వారు వేదికపై ప్రసంగించాల్సి ఉన్నా.. కేవలం రాష్ట్రపతి ప్రసంగంతోనే ప్రారంభో త్సవాన్ని ముగించారు. దీంతో నిర్ణీత షెడ్యూల్‌ కంటే అరగంట ముందే కార్యక్రమం ముగిసింది. అయితే శతాబ్ది వేడుకల వేదికపై సీఎం కేసీఆర్‌ మాట్లాడకపోవడంపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమం ముగిసిన వెంటనే ‘కేసీఆర్‌ డౌన్‌.. డౌన్‌..’అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో కొంత గందరగోళం నెలకొంది. ప్రారంభోత్సవానికి ముందే సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వేదిక వద్దకు ర్యాలీగా బయలుదేరిన వామపక్ష, నిరుద్యోగ, విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అడ్డుకుని.. అంబర్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

గత స్మృతులను నెమరువేసుకుంటూ..
వర్సిటీలో పనిచేసి రిటైరైన అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో తమ కుటుంబ సభ్యులతో శతాబ్ది వేడుకలకు హాజరయ్యారు. కలసి చదువుకున్నవారంతా ఒక్క చోటికి చేరారు. ఆత్మీయ పలకరింపులు, ఆలింగనాలు, తమకు చదువు నేర్పిన అధ్యాపకుల ముచ్చట్లు.. ఇలా క్యాంపస్‌ నిండా సందడి నెలకొంది. వారంతా ఆయా కాలేజీలు, హాస్టళ్లలో కలియదిరిగి సెల్ఫీలు తీసుకున్నారు. గత స్మృతులను గుర్తుచేసుకున్నారు.

ఎంతో సంతోషంగా ఉంది
‘‘ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలను రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషంగా ఉంది. యూనివర్సిటీ అభివృద్ధికి ఉత్సవాల సందర్భంగా రూ.200 కోట్లు కేటాయించినందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రికి కృతజ్ఞ తలు. గడిచిన వందేళ్లలో యూనివర్సిటీ ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. ఎన్నో మైలురాళ్లను దాటింది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఉస్మానియా విద్యార్థులు క్రియాశీలక పాత్ర పోషించారు..’’
– ఉస్మానియా వీసీ రామచంద్రం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement