విద్యార్థుల ఎస్సెమ్మెస్ నిరసన
వర్సిటీ సమస్యలపై మంత్రులు, ఎమ్మెల్యేలకు ఎస్‌ఎంఎస్‌లు
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలోని సమస్యలపై పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులు వినూత్నంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. శుక్రవారం క్యాంపస్‌లోని యూనివర్సిటీ లైబ్రరీ ఎదుట సుమారు వేయి మంది విద్యార్థులు ఓయూ సమస్యలను పరిష్కరించాలని, విద్యార్థులకు గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించిన రూ.7 కోట్ల భోజన బకాయిలను విడుదల చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సెల్‌ఫోన్‌తో మెసేజ్‌లు పంపారు. విద్యార్థుల సందేశాలకు డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, ఎమ్మెల్యే కొండ సురేఖ సమాధానాలిచ్చారు. ఓయూ సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చినట్లు విద్యార్థులు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నేతలు శ్రీనివాసులు, నరేశ్, స్టాలిన్, నాగేశ్వర్‌రావు, మౌనిక తదితరులు పాల్గొన్నారు.