బుధవారం ఓయూలో సీఎం దిష్టిబొమ్మకు శవయాత్ర చేస్తున్న విద్యార్థులు
- కేసీఆర్ వ్యాఖ్యలపై ఓయూ విద్యార్థుల ఆగ్రహం.. వర్సిటీ బంద్
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ భూములు, విద్యార్థులపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలపై ఓయూ విద్యార్థులు భగ్గుమంటున్నారు. ఉద్యమాలతో ఢిల్లీని కదిలించి రాష్ట్రాన్ని సాధించిన తాము ఉద్యమాలతోనే వర్సిటీ భూములను రక్షించుకుంటామని స్పష్టంచేశారు. ఓయూ భూముల్లో పేదలకు ఇళ్లు నిర్మిస్తామని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా 48 గంటల బంద్ పిలుపులో భాగంగా బుధవారం నవ తెలంగాణ విద్యార్థి జేఏసీ నేతలు ఆంజనేయులు, శివప్రసాద్, ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వర్సిటీ బంద్ పాటించారు.
ఏబీవీపీ నేతలు కడియం రాజు, ఎల్లస్వామి ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మకు శవయాత్ర చేసి ఆర్ట్స్ కళాశాల ఎదుట దహనం చేశారు. పీడీఎస్‌యూ విజృంభణ నేత చనగాని దయాకర్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఓయూ విద్యార్థి జేఏసీ నేతలు నాగేళ్లి వెంకటేష్, పున్న కైలాష్‌నేత, కేతూరి వెంకటేష్, సాంబశివగౌడ్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల వద్ద గల పోస్ట్‌బాక్స్‌లో సచివాలయానికి పోస్టుకార్డులను వేసి సీఎం కేసీఆర్‌కు నిరసన తెలిపారు. తెలంగాణ ఉద్యమ వేదిక నేత చెరుకు సుధాకర్, ఎల్‌హెచ్‌పీఎస్ నేత బెల్లయ్యనాయక్ బంద్‌లో పాల్గొని ఓయూ భూముల విషయమై సీఎం తీరును తప్పుపట్టారు. ఓయూ భూములను విద్యావసరాలకే వినియోగించాలని సుధాకర్ చెప్పారు.
సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి విద్యార్థులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం దారుణమని తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 48 గంటల బంద్‌లో భాగంగా గురువారం బంద్ పాటించి, ఓయూలో జరుగుతున్న సెమిస్టర్ పరీక్షలను, జూన్ 3 నుంచి ప్రారంభంకానున్న ప్రవేశ పరీక్షలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొడతామని తెలంగాణ విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు కొత్తపల్లి తిరుపతి హెచ్చరించారు. ఓయూ భూములను ప్రభుత్వపరం చేయొద్దని, శాశ్వత వీసీని నియమించాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వైఎస్సార్ యూత్ అధ్యక్షుడు వినాష్‌గౌడ్ ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ ప్రొ.సురేష్‌కుమార్‌కు వినతిపత్రం అందచేశారు.
బంద్ పిలుపులో భాగంగా పీజీ న్యాయ కళాశాల విద్యార్థులు ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో పీజీ న్యాయ విభాగం పరీక్షను బహిష్కరించి హాల్‌టికెట్లను దహనం చేసి నిరసన తెలిపారు. మరోవైపు విశ్వవిద్యాలయాల భూములను ప్రభుత్వం నుంచి కాపాడుకునేందుకు వివిధ విద్యార్థి సంఘాల నేతలు ఆర్ట్స్ కళాశాల వద్ద సమావేశమై మల్లెబోయిన అంజియాదవ్ కన్వీనర్‌గా తెలంగాణ విశ్వవిద్యాలయాల భూపరిరక్షణ సమితిని స్థాపించారు.