మెదక్: వచ్చే ఖరీఫ్‌లో రైతులను సన్నద్ధం చే సేందుకు ఈ నెల 25వ తేదీ నుంచి ప్రభుత్వం ‘మన తెలంగాణ-మన వ్యవసాయం’ పేరిట రైతు చైతన్య యాత్రలను తలపెట్టింది. పంచాయతీల పరిధిలో గ్రామాల్లో ఈ నెల 25వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు ఇవి కొనసాగుతాయి. యాత్రలను ఉదయం 7 గంటల కల్లా ప్రారంభించి 11 గంటల్లోగా ముగిస్తారు. గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శి, మండల వ్యవసాయ విస్తీర్ణ అధికారులు కార్యక్రమ నిర్వహణ బాధ్యతలు చేపడతారు.
యాత్రల్లో భాగంగా అధికారులు రైతుల అవసరాలకు తగ్గట్లుగా గ్రామ స్థాయిలోనే ఖరీఫ్ ప్రణాళిక రూపొందించాల్సి ఉంటుంది. ఇందులో వ్యవసాయశాఖతో పాటు అనుబంధ ఉద్యాన, మార్కెటింగ్, పట్టు, మత్స్య, విద్యుత్, అటవీ తదితర శాఖల అధికారులు గ్రామాలకు వెళ్లి రైతులతో సమావేశాలు నిర్వహిస్తారు. ఏయే పంటలు సాగు చేయాలి. ప్రభుత్వ పథకాలు, రాయితీలు తదితర వాటిని వివరిస్తారు.