సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ మొదటి దశ ప్రవేశాల్లో భాగంగా ప్రవేశాల కమిటీ విద్యార్థులకు సీట్లు కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా 186 కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 64,946 సీట్లు అందుబాటులో ఉండగా, మొదటి దశలో 52,621 మంది విద్యార్థులకు సీట్లను కేటాయించింది. 12,325 సీట్లు ఖాళీగా ఉన్నాయని, సీట్లు పొందిన విద్యార్థులకు సమాచారాన్ని తెలియజేశామని ప్రవేశాల కమిటీ శుక్రవారం పేర్కొంది.
81 కాలేజీల్లో 100 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. అందులో 14 యూనివర్సిటీ, 67 ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి. ఒక కాలేజీలో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. సింగిల్ డిజిట్‌లో విద్యార్థులు చేరిన కాలేజీలు 2 ఉన్నాయి. 20 కాలేజీల్లో 50 మందిలోపు, 45 కాలేజీల్లో 100 మందిలోపే విద్యార్థులు చేరినట్లు ప్రవేశాల కమిటీ కన్వీనర్ నవీన్ మిట్టల్ వెల్లడించారు. సరైన ఆప్షన్లు ఇచ్చుకోని కారణంగా 5,427 మంది విద్యార్థులకు సీట్లు లభించలేదు. ఇంజనీరింగ్ 12,325 సీట్లు, బీఫార్మసీలో 2,109 సీట్లు, ఫార్మ్–డిలో 117 సీట్లు అందుబాటులో ఉన్నట్లు వివరించారు.
సెల్ఫ్ రిపోర్టింగ్ తప్పనిసరి...
విద్యార్థులు వెబ్‌సైట్ నుంచి ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకుని నెట్ బ్యాంకింగ్/క్రెడిట్ కార్డు/డెబిట్ కార్డు ద్వారా ఫీజు చెల్లించవచ్చని అధికారులు తెలిపారు. https://tseamcet.nic.in లో లాగిన్ అయి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని సూచించారు. అనంతరం జాయినింగ్ రిపోర్టును డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. ఫీజు చెల్లింపునకు ఈ నెల 12వ తేదీ వరకు గడువు ఇచ్చామని తెలిపారు. నిర్ణీత తేదీలోగా ఫీజు చెల్లించకపోయినా, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా వారి సీటు రద్దవుతుందని పేర్కొన్నారు.
రెండో దశ తర్వాతే కాలేజీల్లో చేరికలు...
పీజు చెల్లించి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన విద్యార్థులంతా రెండో దశ కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు తర్వాతే కాలేజీల్లో రిపోర్టు చేయాలని అధికారులు సూచించారు. ట్యూషన్ ఫీజు చెల్లించిన తర్వాత కూడా సీటు రద్దు చేసుకోవాలనుకుంటే రెండో దశ కౌన్సెలింగ్ ప్రారంభానికి ముందు ఆన్‌లైన్‌లో రద్దు చేసుకోవాలని, వారు చెల్లించిన మొత్తం ఫీజు తిరిగి చెల్లిస్తామని వెల్లడించారు.
సీట్లు పొందిన విద్యార్థులు కావాలనుకుంటే రెండో దశ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చని, ఆప్షన్లను మార్చుకోవచ్చని తెలిపారు. ఇంజనీరింగ్‌లో చేరాలనుకునే విద్యార్థులకు డిగ్రీలో సీట్లు వచ్చి ఉంటే వారు డిగ్రీ వద్దనుకొని రీలింక్విష్‌మెంట్‌కు అండర్‌టేకింగ్ ఇవ్వాలని సూచించారు.
జూలై 16 నుంచే తరగతులు
ఇంజనీరింగ్ కాలేజీల్లో జూలై 16వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు ఒకటో తేదీ వరకు ఓరియెంటేషన్ తరగతులు నిర్వహించనున్నారు. జూలై మొదటి వారం లేదా రెండో వారంలో రెండో దశ కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. జూలై చివరి వారంలో మూడో విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. కాలేజీ పరిధిలో ఇంటర్నల్ స్లైడింగ్‌ను ఆగస్టు మొదటి వారంలో ప్రవేశాల కమిటీ ఆధ్వర్యంలోనే నిర్వహించి సీట్లను కేటాయించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment