
మాట్లాడుతున్న పద్మనాభరెడ్డి. చిత్రంలో దిలీప్‌రెడ్ది
హైదరాబాద్: ప్రజాస్వామ్యంలో ప్రజలు కోరుకున్నదే చట్టం కావాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు పద్మనాభ రెడ్డి అన్నారు. మహిళలపై అత్యాచారం జరిగితే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసే ధైర్యం రావాలన్నారు. రేప్ ఫ్రీ ఇండియా పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరం సహకరించాలన్నారు. 50 స్వచ్ఛంద సంస్థలు కలిసి ‘రేప్ ఫ్రీ ఇండియా’పేరుతో సంస్థ ఏర్పాటు చేసుకుని మహిళలు, పిల్లలపై జరుగుతున్న వేధింపులపై ప్రత్యేక చట్టం తయారుచేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. దీనికోసం దేశవ్యాప్తంగా ప్రస్తుతం బరిలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులతో సంతకాల సేకరణ నిర్వహించి మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా సాక్షి జర్నలిజం స్కూల్ ప్రిన్సిపాల్ దిలీప్‌రెడ్డి మాట్లాడుతూ సమాజంలో అన్ని వర్గాల వారూ రేప్ ఫ్రీ ఇండియా ఉద్యమానికి సహకరించాలన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులను ఆపేందుకు చేస్తున్న ఏ చిన్న ప్రయత్నమైనా అభినందించాలన్నారు. ప్రస్తుతం సినీ పరిశ్రమలో 70 నుంచి 80 శాతం మంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కాలేజ్ డ్రాప్ అవుట్ అయినవారే ఉన్నారని, వారు తీసే సినిమాలవల్ల సమాజంపై ఎలాంటి ప్రభావం పడుతుందో వారికి అవగాహన లేదని, అందుకే కమర్షియల్ సినిమాలను నిర్మిస్తున్నారన్నారు. కైలాష్ సత్యార్థి ఫౌండేషన్ రీజినల్ డైరెక్టర్ ఓం ప్రకాష్ మాట్లాడుతూ, మహిళలపై అత్యాచారాలు నిరోధించేందుకు తాము చేపట్టిన భారత యాత్ర విజయవంతమైందని తెలిపారు.
ఎంవీ ఫౌండేషన్ నేషనల్ కన్వీనర్ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. బాల్య వివాహాలను ఆపాలని, మహిళలపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలపై అవగాహన కల్పించాలన్నారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ శ్యామల మాట్లాడుతూ.. చట్టాలు పిల్లలకు అనుకూలంగా ఉండాలన్నారు. హ్యూమన్ రైట్స్ ఫోరం ప్రతినిధి జీవన్‌కుమార్ మాట్లాడుతూ.. పోలీసుల మైండ్ సెట్‌లో మార్పు రాలేదని, అత్యాచార కేసుల్లో ఇప్పటికీ ఫిర్యాదులు స్వీకరించడం లేదన్నారు. తరుణి స్వచ్ఛంధ సంస్థ అధ్యక్షురాలు మమతా రఘువీర్, అసోసియేషన్ ఫర్ ప్రమోటింగ్ సోషల్ యాక్షన్ డైరెక్టర్ ఎస్. శ్రీనివాస్‌రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment