30 నెలల్లోపే ‘పాలమూరు’ పూర్తి | palamuru compleated in thirty months | Sakshi
Sakshi News home page

30 నెలల్లోపే ‘పాలమూరు’ పూర్తి

Published Wed, May 25 2016 3:26 AM | Last Updated on Mon, Sep 4 2017 12:50 AM

30 నెలల్లోపే ‘పాలమూరు’ పూర్తి

30 నెలల్లోపే ‘పాలమూరు’ పూర్తి

అధికారులు, కాంట్రాక్టర్లకు మంత్రి హరీశ్‌రావు ఆదేశం
భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచన

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆరంభించిన తొలి భారీ సాగునీటి ప్రాజెక్టు అయిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని గడువు లోపలే పూర్తి చేసి రికార్డు నెలకొల్పాలని భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. కరువు, వలసలతో అరవై ఏళ్లుగా అల్లాడుతున్న మహబూబ్‌నగర్ జిల్లా గోస తీర్చాలని అన్నారు. పాలమూరు ప్రాజెక్టును 30 నెలల్లో పూర్తి చేయాలని షెడ్యూలు పెట్టుకున్నప్పటికీ అంతకుముందే పనులు పూర్తి చేసి జిల్లాకు సాగునీరు ఇవ్వాలని మంత్రి సూచించారు. మంగళవారం సాగునీటి అభివృద్ధి సంస్థ(ఐడీసీ) కార్యాలయంలో పాలమూరు ప్రాజెక్టు పనుల పురోగతిపై 5 గంటల పాటు సమీక్షించారు.

ఈ సమీక్షకు మంత్రి లక్ష్మారెడ్డితో పాటు శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్‌కే జోషి, ఈఎన్‌సీ మురళీధర్, మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ శ్రీదేవి, ఓఎస్‌డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండేతో పాటు కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పరిధిలో నెలకొన్న భూసేకరణ సమస్యపై కలెక్టర్‌ను, ఇంజనీర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా భూసేకరణ సమస్యను కొలిక్కి తెచ్చి, కాంట్రాక్టర్లు పనులు చేసుకునే అవకాశం కల్పించాలని సూచించారు.

కట్టలు, కాల్వల నిర్మాణం కోసం ప్రాధాన్యతా పరంగా భూమి సేకరించాలని ఆదేశించారు. ఈ నెలాఖరులోగా కాంట్రాక్టు ఒప్పందాలన్నీ పూర్తి చేయాలని కోరారు. కాంట్రాక్టు సంస్థలు, ఇంజనీర్లు కలసి పనిచేస్తే పనులు విజయవంతమవుతాయని, ఈ దృష్ట్యా అంతా సమన్వయంతో ముందుకు పోవాలని సూచించారు. ప్రాజెక్టు పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు వీలుగా ఇంజనీర్లు, కాంట్రాక్టర్లతో ప్రత్యేకంగా ఒక వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసుకోవాలన్నారు.

 వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఎకరాలకు నీరు
తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న ఇంజనీర్లకు ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మార్గనిర్దేశంలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తున్నట్లు తెలిపిన మంత్రి.. పాలమూరు ఎత్తిపోతలు భారత దేశ చరిత్రలో మిగిలిపోతుందన్నారు. పాలమూరు జిల్లాలో వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఎకరాలకు నీరందిస్తామని, అయితే ఇందుకు మరింత కష్టపడాల్సి ఉందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement