ఒకప్పుడు చుక్క నీటికోసం తండ్లాడిన పాలమూరు జిల్లా ప్రాంతం ఇప్పుడు పచ్చగా మారుతోంది. ఎటు చూసినా బీడు భూములే ఉన్న చోట.. ఇప్పుడు పంటల సిరులు కనిపిస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేతిలో రూపం పోసుకున్న కల్వకుర్తి ఎత్తిపోతల పథకం.. కేసీఆర్ సంకల్పం, మంత్రి హరీశ్ కార్యదీక్షతో ఈ ప్రాంతానికి జలకళ తెచ్చిపెట్టింది. పథకం నీటితో కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, వనపర్తి నియోజకవర్గాల్లోని చెరువులు, కుంటలు నిండి.. సుమారు మూడు లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో కల్వకుర్తి ప్రాజెక్టు ప్రాంతంలో ‘సాక్షి’క్షేత్రస్థాయి పర్యటన చేసి, పరిస్థితిని పరిశీలించింది.
(కల్వకుర్తి ఎత్తిపోతల పథకం గ్రామాల నుంచి వర్ధెల్లి వెంకటేశ్వర్లు)
నాడు ఆకలి చావులు
నాగర్‌కర్నూలు జిల్లా తెలకపల్లి. చంద్రబాబు ప్రభుత్వంలో ఒక్క ఏడాదిలోనే 12 మంది ఆకలి చావులను చూసిన మండలం ఇది. ఊరి కి ఆనుకుని పెద్ద చెరువు ఉంది. పేరుకు చెరువేగానీ దాని కింద ఎప్పుడూ బస్తా గింజలు పండలేదు. కానీ ఇప్పుడు కృష్ణా జలాలతో తెలకపల్లి మండలంలోని 80 శాతం చెరువులు నిండాయి. 3,500 ఎకరాలకుపైగా సాగులోకి వచ్చాయి. రెండున్నర దశాబ్దాలుగా నిండని చెరువు ఈసారి నిండింది. దాంతో రైతులు జోరుగా వ్యవసాయం మొదలుపెట్టారు.
బతుకు మీద ఆశ పుట్టింది
ఇదే మండలం బండరావిపాకులలో 25 ఏళ్లు గా జీతానికి పనిచేసిన లింగస్వామి. ఇప్పుడాయన జీతగాడు కాదు.. రైతు. తనకున్న మూడె కరాలతోపాటు మరో మూడెకరాలు కౌలుకు తీసుకుని వరి వేశాడు. మడిలో మందు పిచికారీ చేస్తుండగా.. ‘సాక్షి’ మాట కలిపింది. ‘దొర ఎడ్ల కొట్టం కిందనే బతుకు గడిచిపోయింది. పెద్దోడిని చదువు మాన్పించి మేకలకాడికి పం పిన. ఇంటి ఆడోళ్ల కష్టం, నా కష్టం కలిస్తేనే పూ టకు ఎల్లేది. ఇప్పుడు పంట మంచిగ వస్తోంది. బతుకు మీద ఆశ పుట్టింది’ అని చెప్పాడు.
పనుల్లో బిజీ బిజీ
ఉప్పనుంతల మండలం మర్రిపల్లిలో 250 కుటుంబాలు ఉండగా, 1,600 ఎకరాల సాగు భూమి ఉంది. 150 కుటుంబాలు వ్యవసాయం చేస్తున్నాయి. ఊరంతా వ్యవసాయ పనులతో బిజీగా కనిపించింది. రైతులు బోరు కింద యా సంగి వరి నాట్లు పెట్టగా.. మిగతా భూమిలో వేరుశనగ సాగు చేస్తున్నారు. వేరుశనగ చేనుకు నీళ్లు పెడుతున్న నూకం శ్రీను.. సాగు దెబ్బతిని అప్పులపాలై పదేళ్ల కింద హైదరాబాద్‌కు వలస వెళ్లిన రైతు ఆయన. ‘హోటల్‌లో పనికి కుదిరిన. రూ.180 ఇచ్చి అన్నం పెట్టేవాళ్లు. నా ఈడంతా హోటళ్లనే కరిగిపోయింది. నా భార్య కూలి పనికి వెళ్లేది. సంపాదన పిల్లల బడి ఫీజులు, ఖర్చులకే సరిపోయింది. ఇప్పుడు నీళ్లు వదిలారని మా చుట్టాలు చెప్తే.. ఊరికి వచ్చిన. నాకున్న మూడెకరాలతోపాటు మరో మూడెకరాలను కౌలుకు తీసుకున్న. నీళ్లు బాగనే ఉన్న యి. పైరు పచ్చగా ఎదుగుతోంది. పిల్లలు బడికి పోతున్నరు. అందరం కలసి ఉన్న ఊళ్లో సంతోషంగా ఉంటున్నం’ అని నూకం శ్రీను చెప్పాడు. ఆయన ఒక్కడే కాదు.. దాదాపు 25 కుటుంబాలకు చెందిన సన్నకారు రైతులు తిరిగొచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారు.
ఆకలి చావు.. దద్దరిల్లిన అసెంబ్లీ
కోడేరు మండలం పసుపుల గ్రామానికి పక్క నున్న ఖానాపురంలో 360 మంది జనాభా. 800 ఎకరాల సాగు భూమి ఉంది. అన్నీ దళిత కుటుంబాలే. 45 ఏళ్లుగా ఇక్కడ యాసంగి సాగు లేదు. ఒకప్పుడు ఆకలి చావులపై అసెంబ్లీ దద్దరిల్లింది ఈ గ్రామంలో మరణించిన గాదం పురుషోత్తం సంఘటనతోనే. ఇప్పుడీ గ్రామం కల్వకుర్తి నీటితో కళకళలాడుతోంది. చెరువులు నిండాయి. వలస పోయిన 42 కుటుంబాలు సొంతూరును వెతుక్కుంటూ వచ్చాయి. సాగుతో ఊరంతా బిజీగా కనిపించింది. పిల్లలను బడికి పంపుతున్నారు. 30 ఏళ్లుగా బోసిపోయిన ఖానాపురం ఇప్పుడు అచ్చమైన పల్లె రూపం సంతరించుకుంది.
కాకతీయుల చెరువు.. కళకళ
ఖిల్లా ఘణపురంను ఆనుకొనే గణ సముద్రం చెరువు ఉంది. 13వ శతాబ్దంలో కాకతీయ రాజులు ఈ చెరువును తవ్వించారు. 3 కిలోమీటర్ల పొడవు, 29 అడుగుల ఎత్తు కట్టతో ఉండే ఈ భారీ చెరువు నిర్మాణానికి అప్పట్లో 30 ఏళ్లకుపైగా పట్టిందని స్థానికులు చెబుతుంటారు. 34 ఏళ్లుగా ఈ చెరువులో నీళ్లు చేరిందే లేదు. దీంతో చాలా మంది వలస వెళ్లిపోయారు. మంత్రి హరీశ్‌రావు పాలమూరు జిల్లా సందర్శనకు వెళ్లినప్పుడు స్థానికులు కష్టాలను ఏకరువు పెట్టారు. దాంతో కృష్ణా జలాలతో గణపురం చెరువు నింపుతామని హామీ ఇచ్చిన మంత్రి.. రికార్డు సమయంలో ఘణపురం బ్రాంచ్ కెనాల్ నిర్మాణం పూర్తి చేయించారు. జనవరి 8న నీటిని విడుదల చేసి చెరువును నింపారు. తెలంగాణ ప్రభుత్వంలో రికార్డు సమయంలో పూర్తయిన పనుల్లో ఈ కాలువ రెండోదిగా నిలిచింది. దీని కింద 2,500 ఎకరాలు పచ్చని పైర్లతో కళకళలాడుతున్నాయి.
ప్రాణం పోసిన వైఎస్సార్..
వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక.. మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంగా పేరు పెట్టి.. రూ.2,990 కోట్లు కేటాయించారు. 2005లో ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. కొల్లాపూర్ మండలం ఎల్లూరు వద్ద మొదటి లిఫ్టు, పెద్దకొత్తపల్లి మండలం జొన్నలబొగుడ వద్ద రెండో లిఫ్టు, నాగర్‌కర్నూల్ మండలం గుడిపల్లి వద్ద మూడో లిఫ్టును ఏర్పాటు చేస్తూ.. 3.40 లక్షల ఎకరాలకు నీరిందించేలా రూపకల్పన చేశారు. వైఎస్ హయాంలోనే 3 లిఫ్టుల పనులు 90% పూర్తయ్యాయి. తెలంగాణ ఏర్పాటయ్యాక ప్రాజెక్టు సామర్థ్యాన్ని 40 టీఎంసీలకు పెంచారు. అదనంగా రూ.815 కోట్లు నిధులు కేటాయించారు. కాలువలు పూర్తి కాకపోవడంతో ప్రస్తుతం 2.60 లక్షల ఎకరాలకు నీరందుతోంది.
సీఎం కేసీఆర్ సంకల్పం..హరీశ్‌రావు పట్టుదల..
నాగర్‌కర్నూల్ జిల్లాలో మొత్తం 2,258 చెరువులు ఉండగా.. కల్వకుర్తి ప్రాజెక్టు జలాలతోనే 450 చెరువులను పూర్తిగా, మరో 289 చెరువులను సగం వరకు నింపారు. ఈ నీటితో సుమారు 1.22 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకొచ్చారు. గతేడాది జిల్లాలో 1.83 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేయగా.. ఈసారి 2.12 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. కల్వకుర్తి ప్రాజెక్టు కింద నిర్మించిన మూడు రిజర్వాయర్ల సామర్థ్యం 3.96 టీఎంసీలు మాత్రమే. దీంతో మంత్రి హరీశ్‌రావు.. రూ.811 కోట్లతో మరో 19 నూతన రిజర్వాయర్లు నిర్మించేలా సీఎం కేసీఆర్‌ను ఒప్పించారు. రిజర్వాయర్ల నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీనికి సంబంధించి సర్వే పనులు కూడా కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment