పల్లెకు పాలూ..పెరుగు | Palleku paluperugu | Sakshi
Sakshi News home page

పల్లెకు పాలూ..పెరుగు

Published Sun, Oct 19 2014 1:11 AM | Last Updated on Sat, Sep 2 2017 3:03 PM

పల్లెకు పాలూ..పెరుగు

పల్లెకు పాలూ..పెరుగు

అరేయ్ చిన్నోడా.. పాల చెంబు అందుకొని బూదమ్మ పెద్దమ్మ ఇంటికెళ్లి పాలు తీసుకురారా.. అదే చేత్తో ఇంకో గిలాస పట్టుకెళ్లి పెరుగు కూడా తీసుకురా... ఇదీ పల్లెల్లో నిన్నామొన్నటివరకు వినిపించిన మాట. ఇటీవల కాలంలో పాడిపరిశ్రమ అభివృద్ధి పేరిట పట్టణాల్లో ఏర్పడ్డ డెయిరీలు పెద్ద ఎత్తున పాలసేకరణ చేపడుతున్నాయి.

దీంతో పల్లెల్లో ఉత్పత్తయిన పాలు డెయిరీలకు వెళ్లి.. తిరిగి ప్యాకెట్లలో పల్లెలకు చేరుతున్నాయి. దీంతో పల్లెల్లో పాలకూ పెరుగుకూ కొరత ఏర్పడటంతో పాటు వాటి ధరలు రెట్టింపవుతున్నాయి. -పెద్దపల్లి

 
 పెద్దపల్లి :
 పల్లెల్లోని కిరాణ షాపుల్లో పప్పు, ఉప్పు, అగ్గిపెట్టే, సిగరేట్ ఇవి మాత్రమే అమ్మే వ్యాపారులు ఇప్పుడు పట్టణాల నుంచి పాలప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లు తెచ్చి విక్రయిస్తున్నారు. కిరాణషాపుల్లో పాలూ, పెరుగు ప్యాకెట్లను చూసి ఒకనాటి పల్లెజీవనాన్ని తలుచుకున్నవారు ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పుడు ఇంటింటికీ ఓపాడి గేదెను పెంచుకొని పొరుగింటివారికి మర్యాదగా పాలూ, పెరుగు, మజ్జిగ ఉచితంగా ఇచ్చేవారు. కాస్త దూరపు బంధువులుగా ఉన్నవారికి మాత్రం సాధారణ ధరకే పాలూ, పెరుగును విక్రయించేవారు.

పట్టణాల్లో పాడిపరిశ్రమ రంగాన్ని అభివృద్ధి పర్చడంకోసం ఏర్పాటు చేసిన డెయిరీలతో పల్లెల మర్యాద మాయమవుతోంది. ఇంట్లో ఉన్న చిన్నోడు పాల చెంబు అందుకొని ‘ఆవలివాడ’కెళ్లి పాలుతెచ్చే రోజులు పోయాయి. ఇప్పుడు ఎవరు కూడా ఇలా అరలీటర్, లీటర్ పాలు పోసేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో బజారుకు వెళ్లి కిరాణషాపుల్లో లభించే పాలప్యాకెట్లు తెచ్చి టీ చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి.

 రోజుకు లక్షలీటర్లు
 జిల్లాలో వివిధ పాలకేంద్రాల ద్వారా రోజుకు లక్షలీటర్లపాల సేకరణ కొనసాగుతోంది. విజయ, ప్రియ, తిరుమల డెయిరీలతోపాటు ముల్కనూరు మహిళా స్వకృషి డెయిరీ ఆధ్వర్యంలో పాల సేకరణ ఎక్కువగా జరుగుతోంది. పెద్దపల్లిలోని పాలసేకరణ కేంద్రం ఎనిమిదే ళ్ల క్రితం ప్రారంభించగా అప్పుడు 600 లీటర్లు సేకరించగా ప్రస్తుతం సేకరణ 2,630 లీటర్లకు పెరిగింది. రైతులు ఎక్కువగా పాలసేకరణ కేంద్రానికే పాలు అందించడానికి ఇష్టపడుతుండడంతో ఈ కేంద్రాల వ్యాపారం వర్ధిల్లుతోంది.

 గంగిగోవుపాలు గరిటడైనా చాలు
 గంగి గోవుపాలు గరిటడైనా చాలు అన్న పదం సామెతగా మిగిలిపోయే రోజులు వస్తున్నాయి. అప్పుడు మా ఇంట్లో ఆవు ఉండేది అనే జ్ఞాపకాలుగా దేశవాళీ ఆవులు నిలుస్తున్నాయి. రైతులు జెర్సీ ఆవుల పెంపకంపై దృష్టిపెట్టడంతో దేశవాళీ సంపదకు గడ్డురోజులు వచ్చాయి. ప్రభుత్వం సైతం విదేశీ ఆవుల పెంపకానికే రుణాలు ఇచ్చి ప్రోత్సహించడంతో స్థానిక సంపద కనుమరుగవుతోంది. కేవలం పట్టణాల్లో మాత్రమే గోమాతను పూజించే ఒక వర్గం దేశవాళీ ఆవులపై మమకారం చూపుతోంది. అవికూడా ఒకటి రెండు మినహాయిస్తే పెద్దసంఖ్యలో కనిపించడం లేదు.
 
 పెద్దకల్వలలో బట్టీ పాలు.. సింగరేణి కాలనీలకు...

 30 ఏళ్ల నుంచి పెద్దపల్లి మండలం పెద్దకల్వల పాలబట్టీ నుంచి గోదావరిఖని, మందమర్రి, మంచిర్యాల ప్రాంతాలకు డబ్బాల ద్వారా పాలు తరలిస్తున్నారు. ఇక్కడి గ్రామంలోని బట్టీ(పొయ్యి)వద్ద కాచి వేడిచేసిన పాలను డబ్బాలతో తీసుకెళ్లి కార్మిక కుటుంబాలకు అందిస్తున్నారు. 30 ఏళ్ల క్రితం 2 వేల లీటర్ల పాలు ఈ గ్రామం సరఫరా చేసేది. ప్రస్తుతం అవి 200 లీటర్లకు పడిపోయాయి.

ప్రతీ ఇంటికి రెండు పాడిగేదెలు ఉండేవని, వాటి సంఖ్య 2వేలకు పైనేనని వ్యాపారం మానేసిన వారు తెలిపారు. ఇప్పుడు ఊరంతా కలిపితే 200 కూడా పాడిగేదెలు లేవని చెప్పాడు. అయినా గ్రామంలో ఆనవాయితీగా వస్తున్న బట్టీ పాల వ్యాపారాన్ని ఓ కుటుంబం కొనసాగిస్తోంది.

 చిన్నబోయిన సింగరేణి రైలు
 ప్రతీ ఉదయం జమ్మికుంట, బిజిగిరి షరీఫ్, పొత్కపల్లి, ఓదెల, కొత్తపల్లి, కొలనూర్ రైల్వేస్టేషన్‌లో ఉదయం సింగరేణి రైలు ఆగిందంటే చాలు పదుల సంఖ్యలో పాలడబ్బాలు కిటికీలకు కొక్కెం వేసి తగిలించేవారు. అలా ప్రతీరోజు కోల్‌బెల్ట్ ప్రాంతానికి నాలుగైదువేల లీటర్ల పాలు డబ్బాల ద్వారా తీసుకెళ్లేవారు. దాని ద్వారా పదుల సంఖ్యలో కూలీలు, యువకులు పాలవ్యాపారంతో జీవనం సాగించేవారు.

ప్రస్తుతం గ్రామాలకు కంపెనీల వాహనాలు రావడంతో రైతులు తమ పాలను డబ్బాలకు పోస్తున్నారు. స్థానికంగా విక్రయించడానికి ఇష్టం చూపకపోవడంతో డెయిరీ సంస్థలు గ్రామాలకు పరుగులు తీస్తున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement