పండుటాకు ప్రాణం తీసిన ‘ఆన్‌లైన్’ ఆలస్యం
కొడకండ్ల : పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నా తన ఇంటికి సర్వేకు అధికారులు రాలేదని, పెన్షన్ మంజూరు జాబితాలో కూడా తన పేరు లేదని మనోవేదనకు గురై మండల కేంద్రంలో సోమవారం ప్రాణాలొదిలిన నిరుపేద వృద్ధురాలు పసునూరి అచ్చమ్మ(68) మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నారు.
అచ్చమ్మ పేరు మండలం నుంచి పంపిన ప్రతిపాదిత జాబితాలో ఉన్నప్పటికీ మొదటగా ఆన్‌లైన్‌లో వచ్చిన జాబితాలో మాత్రం లేదు. మండలంలో మొత్తం 965 మందిని అర్హులుగా గుర్తించగా.. మంజూరు జాబితాలో మాత్రం 223 మంది పేర్లే వచ్చారుు. అరుుతే తన పేరు రాలేద ని ఆందోళనకు గురై గుండెపోటుతో అచ్చమ్మ హఠాన్మరణం చెందిన కొద్ది గంటలకే ఆన్‌లైన్‌లో వచ్చిన అర్హుల జాబితాలో ఆమె పేరుండటం గమనార్హం. జాబితాను ఒకేసారి ఆన్‌లైన్‌లో పంపినట్లయితే అచ్చమ్మ ఆందోళనకు గురై ప్రాణాలు కోల్పోయేది కాదని స్థానికులు వాపోయూరు.
దహన సంస్కారాలకు ఆర్థిక సాయం
మృతురాలు అచ్చమ్మ నిరుపేద కావడంతో దహన సంస్కారాలు కూడా నిర్వహించలేని దుస్థితిలో కుటుంబ సభ్యులు ఉండటంతో స్థానిక నాయకులు దాతృత్వాన్ని చాటుకుని ఆర్థిక సాయం అందజేశారు. జెడ్పీటీసీ సభ్యురాలు బాకి లలిత, మార్కెట్ కమిటీ చైర్మన్ సిందె రామోజీ, మండల కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ నసీర్, పీఏసీఎస్ డెరైక్టర్ కాటూరి కృష్ణమూర్తి తదితరులు మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి, దహన సంస్కారాల నిమిత్తం ఆర్థిక సాయం అందజేశారు.