రాత్రి చోరీ చేశారు.. పొద్దున దొరికిపోయారు..
* పంచలోహ విగ్రహాల చోరీ ముఠా అరెస్ట్
* రూ. కోటి సొత్తు స్వాధీనం
* మల్లూరు ఆలయ గోపురంపై విగ్రహాలను ఎత్తుకెళ్తూ పోలీసులకు చిక్కిన నిందితులు
వరంగల్ క్రైం : పంచలోహ విగ్రహాల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు సభ్యుల ముఠాను వరంగల్ సీసీఎస్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు కోటి రూపాయల విలువ చేసే పంచలోహ విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు హన్మకొండ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీపీ సుధీర్‌బాబు నిందితుల వివరాలు వెల్లడించారు.
ములుగు గణపురం మండలం బస్వరాజుపల్లి గ్రామానికి చెందిన దాసి ప్రవీణ్ ఇంటర్ మధ్యలోనే ఆపేసి 2013లో ట్రాక్టర్‌ను కొనుగోలు చేశాడు. ట్రాక్టర్‌తో ఇసుక తరలిస్తుండగా రెవెన్యూ అధికారులు సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ట్రాక్టర్ ఎనిమిది నెలల వరకు రిలీజ్ కాకపోవడంతో అతడికి ఆదాయం తగ్గి అప్పులు ఎక్కువయ్యాయి. ఈ సమయంలో పురాతన దేవాలయంలో పంచలోహ విగ్రహాలతోపాటు దేవాలయాల్లో లభించే నిధులకు అంతర్జాతీయ మార్కెట్‌లో అధిక మొత్తంలో డబ్బులు వస్తాయని కొందరు వ్యక్తుల ద్వారా తెలుసుకున్నాడు. దీంతో పంచలోహ విగ్రహాలను చోరీ చేసి అమ్మాలని ప్రణాళిక సిద్ధం చేశాడు.
ఇందులో భాగంగా ప్రవీణ్ నిర్మానుష్యంగా ఉండే దేవాలయాలపై దృష్టి సారించాడు. మంగపేట మండలం మల్లూరు నరసింహస్వామి దేవాలయ గోపురంపై ఉన్న సుదర్శన చక్రంతో ఉన్న శ్రీకృష్ణుడి పంచలోహ విగ్రహాన్ని చోరీ చేసేందుకు ప్రణాళిక రచించాడు. ఇందుకు తన చిన్ననాటి మిత్రుడైన భూపాలపల్లి మం డలంలోని కొంపెల్లి గ్రామానికి చెందిన జంగా మధుకర్ సహకారం తీసుకున్నాడు. మూడు రోజుల క్రితం ఇద్దరు కలిసి మల్లూరు నరసింహస్వామి దేవాలయంతోపాటు పరిసర ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించారు.
సోమవారం అర్ధరా త్రి సమయంలో దేవాలయం గోపురం మీద సుదర్శన చక్రంతో ఉన్న శ్రీకృష్ణుడి పంచలోహా విగ్రహాన్ని చోరీ చేశారు. మంగళవారం ఉదయం తాము చోరీ చేసిన విగ్రహాల విలువ తెలుసుకునేందుకు హన్మకొండ వైపు బైక్‌పై వస్తుండగా పెద్దమ్మగడ్డ బ్రిడ్జి సోదాలు చేపట్టిన పోలీసులకు చిక్కారు. వారిని విచారించగా నిం దితులు మల్లూరు నరసింహస్వామి దేవాలయంలో చోరీకి పాల్పడినట్లు ఒప్పుకున్నారు. నిందితులను అరెస్టు చేసి, కోటి రూపాయల విలువైన శ్రీకృష్ణుడి పంచలోహ విగ్రహంతోపాటు పంచలోహ సుదర్శన చక్రంను స్వాధీనం చేసుకున్నారు.
ఇదిలా ఉండగా, పంచలోహ విగ్రహాలను స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచిన క్రైం ఏసీపీ ఈశ్వర్‌రావు, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్, ఏఎస్సై సంజీవరెడ్డి, హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాసరాజు, కానిస్టేబుళ్లు మహమ్మద్ అలీ, రవి, జంపయ్య రాజును సీపీ సుధీర్‌బాబు ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో హన్మకొండ ఏసీపీ శోభన్‌కుమార్, క్రైం ఏసీపీ ఈశ్వర్‌రావు, తది తరులు పాల్గొన్నారు.