
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు గ్రోత్ కారిడార్ ప్రాంతాల్లోని 183 గ్రామాలపై సర్కార్ నజర్ పడింది. ఆయా గ్రామాల పరిధుల్లో విచ్చలవిడిగా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలు, లే అవుట్‌లకు ఇక చెక్ పడనుంది. గ్రామపంచాయతీ అధికారుల చేతివాటంతో పుట్టుకొస్తున్న ఆకాశ హర్మ్యాలను నిలువరించే దిశగా ఇటీవల హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) పాలకవర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఘట్‌కేసర్ మండలం చౌదరిగూడ గ్రామ పంచాయతీ పరిధిలో జీ ప్లస్ టూ దాటి భవనాలు నిర్మించినా హెచ్‌ఎండీఏ నుంచి అనుమతి తీసుకోకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం ఆ పంచాయతీ అధికారాలకు కొన్ని నెలల క్రితం కత్తెర వేసింది. వందల కోట్ల రూపాయల ఆదాయానికి గండికొడుతున్నట్లు విజిలెన్స్ విభాగం ద్వారా గుర్తించిన ప్రభుత్వం చౌదరిగూడ గ్రామ పంచాయతీ మాదిరిగానే ఔటర్ గ్రోత్ కారిడార్‌లోని అన్ని గ్రామ పంచాయతీల అధికారాలకు కోత పెట్టాలని నిర్ణయించింది. తొలుత హెచ్‌ఎండీఏ పరిధిలోని 849 గ్రామ పంచాయతీలు అనుకున్నా హెచ్‌ఎండీఏలో తగిన సంఖ్యలో సిబ్బంది లేకపోవడంతో ఔటర్ గ్రోత్ కారిడార్ ప్రాంతంలోని గ్రామ పంచాయతీలకే పరిమితం చేశారు.
ఇక అన్ని అనుమతులూ..
1991లో 408 జీవో ద్వారా గ్రామ పంచాయతీలకు సంక్రమించిన అధికారాలను ప్రభుత్వం ఉపసంహరించుకోనుంది. ఇప్పటివరకు జీప్లస్ టూ దాటితే హెచ్‌ఎండీఏ అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. ప్రభుత్వం త్వరలో తీసుకురానున్న జీఓతో గ్రోత్ కారిడార్‌లోని గ్రామ పంచాయతీల పరిధిలో భవన నిర్మాణాలు చేపట్టాలంటే హెచ్‌ఎండీఏకు దరఖాస్తు చేసుకోవాల్సిందే. ఇప్పటికే చౌదరిగూడ గ్రామ పంచాయతీ పరిధిలో ఈ విధానం అమలవుతోంది.
శివారు ప్రాంతాల్లో విచ్చలవిడిగా..
శివారుల్లో నిబంధనలను అతిక్రమించి బిల్డింగ్, అపార్ట్‌మెంట్లు పుట్టుకొస్తున్నాయి. మాస్టర్ ప్లా¯Œ రోడ్డు, శిఖం భూములు, బఫర్ జోన్లలోనూ అక్రమ నిర్మాణాలు ఆగడం లేదు. ఐదు, నాలుగు అంతస్తులు దాటినా పంచాయతీ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా నిజాంపేట పంచాయతీ పరిధిలోని భండారి లే అవుట్‌తో పాటు మేడ్చల్, ఘట్‌కేసర్ జోన్లలో భారీగా అక్రమ నిర్మాణాలు ఉన్నట్టుగా గుర్తించారు. ఈ వ్యవహారాలపై కన్నేసిన విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం లోతుగా అధ్యయనం చేసి అక్రమ భవన నిర్మాణాలపై ప్రభుత్వానికి నివేదికలు సమర్పించినట్టు తెలిసింది. ఈ మేరకు పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు అధ్యక్షతన జరిగిన హెచ్‌ఎండీఏ పాలకవర్గ సమావేశంలో ఔటర్ గ్రోత్ కారిడార్‌లోని గ్రామ పంచాయతీల అధికారాలకు కత్తెర వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment