♦ కొత్తగా రెండు డివిజన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు
♦ ఐదు రెవెన్యూ డివిజన్ల సంఖ్యకు సమానంగా పంచాయతీశాఖలో మార్పులు
♦ {పభుత్వానికి నివేదించిన జిల్లా యంత్రాంగం
సాక్షి, రంగారెడ్డి జిల్లా : జిల్లాలో గ్రామ పంచాయతీ వ్యవస్థను మరింత పటిష్టపర్చేందుకు యంత్రాంగం కసరత్తు మొదలుపెట్టింది. పంచాయతీ చట్టాల అమలు, ఆదాయ, వ్యయాలపై పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలంటే పర్యవేక్షణ పెంచాల్సిన ఆవశ్యకత ఉంది. అయితే ఇప్పుడున్న పంచాయతీ డివిజన్ల సంఖ్య తక్కువగా ఉండడం.. గ్రామాల సంఖ్య ఎక్కువగా ఉండడంతో పనిభారం అధికమవుతోంది. ఫలితంగా నామమాత్రపు పర్యవేక్షణతోనే కాలం వెల్లదీయాల్సివస్తోంది. దీన్ని అధిగమించాలంటే ప్రస్తుతం ఉన్న పంచాయతీ డివిజన్ల సంఖ్యను పెంచాలని భావిస్తోంది. జిల్లాలో ఉన్న రెవెన్యూ డివిజన్లకు సమానంగా పంచాయతీ డివిజన్లు హెచ్చించాలంటూ ప్రభుత్వానికి జిల్లా యంత్రాం గం నివేదించింది.
జిల్లాలో మూడు పంచాయతీ డివిజన్లున్నాయి. తూర్పు డివిజన్, చేవెళ్ల, వికారాబాద్ డివిజన్ల పరిధిలో మొత్తం 688 గ్రామ పంచాయతీలున్నాయి. అయితే మూడు డివిజన్లున్నప్పటికీ.. నగర శివారు పంచాయతీల్లో ఆదాయ, వ్యయాల అంశం భారీగా ఉంది. అదేవిధంగా పాలనాపరమైన అంశాల పర్యవేక్షణలోనూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరోవైపు విలువైన పంచాయతీ భూముల ఆక్రమణలు.. అందుకు సంబంధించి కేసులు.. విచారణ.. తదితర అంశాలు ఇప్పుడున్న సిబ్బందికి తలకుమించిన భారమవుతున్నాయి. దీంతో ఏళ్ల తరబడిగా సమస్యలు పేరుకుపోతున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించి.. పాలనను గాడిలో పెట్టాలంటే కొత్తగా మరో రెండు డివిజన్లు అవసరమని యంత్రాంగం నిర్ణయించింది. ప్రస్తుతం జిల్లాలో ఐదు రెవెన్యూ డివిజన్లుండగా.. వాటికి అనుగుణంగా పంచాయతీ డివిజన్ల ప్రతిపాదనలు రూపొందించింది.
నియోజకవర్గాల వారీగా విభజన..
జిల్లా యంత్రాంగం కొత్తగా తయారుచేసిన పంచాయతీ డివిజన్ల ప్రణాళికలో నియోజకవర్గాల ప్రాధాన్యతలో విభజన చేశారు. అదేవిధంగా పనిఒత్తిడిని సైతం పరిగణిస్తూ నగర శివారు మండలాల్లో తక్కువ పంచాయతీలను డివిజన్లకు కేటాయించారు. గ్రామీణ ప్రాంత డివిజన్లకు ఎక్కువ పంచాయతీలను పేర్కొంటూ పంచాయతీ డివిజన్లను విభజించారు. సరూర్‌నగర్ డివిజన్‌కు ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల్లోని 7 మండలాలను కేటాయించారు. మల్కాజిగిరి డివిజన్‌కు కుత్బుల్లాపూర్, మేడ్చల్ నియోజకవర్గాల్లోని ఐదు మండలాలు, రాజేంద్రనగర్ డివిజన్‌కు అదే నియోజకవర్గంలోని రెండు మండలాలు, చేవెళ్ల డివిజన్‌కు చేవెళ్ల, పరిగి నియోజకవర్గాల్లోని 10 మండలాలు, వికారాబాద్ డివిజన్‌లో వికారాబాద్, తాండూరు నియోజకవర్గాల్లోని 9 మండలాలను చేర్చారు. ఈ మేరకు జిల్లా పంచాయతీ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. త్వరలో ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించనున్నట్లు ఆ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.
‘పంచాయతీ’ పునర్విభజన
Published Fri, Jul 3 2015 2:18 AM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement