సాక్షిప్రతినిధి, ఖమ్మం: పంచాయతీ ఎన్నికల కోసం ప్రభుత్వం మరో ముందడుగేసింది. గ్రామ పంచాయతీలకు వచ్చే నెలలో ఎన్నికలు నిర్వహించాలని సంకల్పించిన ప్రభుత్వం జిల్లాలో జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎన్ని పంచాయతీలు కేటాయించాలనే అంశంపై స్పష్టతనిచ్చింది. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలవారీగా ఎన్ని గ్రామ పంచాయతీలు.. ఎవరెవరికి కేటాయించాలనే అంశంపై నిర్ణయం తీసుకుంది. ఇక జిల్లాలో ఏ గ్రామ పంచాయతీ.. ఎవరికి రిజర్వు చేయాలనే దానిపై త్వరలోనే జిల్లా అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. దీనికి సంబంధించి కలెక్టర్ నేతృత్వంలో అధికారులతో సమావేశం నిర్వహించి.. ఏ గ్రామ పంచా యతీ ఎవరికి కేటాయించేది తేల్చనున్నారు.
జిల్లాలో మొత్తం 584 గ్రామ పంచాయతీలున్నాయి. గతంలో 427 జీపీలు ఉండగా.. ఇందులో పలు పంచాయతీలు కార్పొరేషన్, మున్సిపాలిటీలలో విలీనమయ్యాయి. కొత్తగా ప్రభుత్వం 167 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది. దీంతో మొత్తం 584 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. వీటిలో 99 గ్రామ పంచాయతీలు ఏజెన్సీ ప్రాంతంలో, 11 పంచాయతీలు పూర్తి గిరిజన ప్రాంతాలుగా ఉండడంతో వీటిని ఎస్టీలకు రిజర్వు చేశారు. దీంతో మిగిలిన 474 పంచాయతీలు నాన్ షెడ్యూల్ జీపీలుగా ఉన్నాయి. షెడ్యూల్ ఏరియాలోని 99 గ్రామ పంచాయతీల్లో.. 50 గ్రామ పంచాయతీలను మహిళలకు రిజర్వు చేశారు. గిరిజన గ్రామాల్లో ఉన్న 11 గ్రామ పంచాయతీల్లో.. 6 జీపీలను మహిళలకు కేటాయించారు.
మహిళలకు 50 శాతం..
మొత్తం రిజర్వేషన్లలో 50 శాతం జీపీలను మహిళలకు కేటాయించారు. 584 జీపీలలో.. 292 జీపీలను మహిళలకు కేటాయించారు. అలాగే మిగిలిన సీట్లలో పురుషులతోపాటు మహిళలు కూడా పోటీ చేయొచ్చు. మహిళలకు 50 శాతం సీట్లు కేటాయించడం వల్ల ఈ ఎన్నికల్లో వారికి ప్రాతినిధ్యం పెరిగే అవకాశం ఉంది. ఇక సగం పంచాయతీల్లో మహిళా సర్పంచ్‌లు కొలువుదీరనున్నారు.
నాన్ షెడ్యూల్ జీపీల్లో ఇలా..
జిల్లాలో నాన్ షెడ్యూల్ గ్రామ పంచాయతీలు 474 ఉన్నాయి. వీటిలో ఎస్టీలకు 59 కేటాయించారు. ఇందులో మహిళలకు 29 జీపీలు కేటాయించారు. ఎస్సీలకు 120 జీపీలుండగా.. వీటిలో మహిళలకు 60 గ్రామ పంచాయతీలు ఉంటాయి. బీసీలకు 58 గ్రామ పంచాయతీలు ఉండగా.. వాటిలో 29 జీపీలను మహిళలకు కేటాయించారు. ఇక ఇతరులకు 237 గ్రామ పంచాయతీలు ఉండగా.. వాటిలో మహిళలకు 118 కేటాయించారు.
‘పంచాయతీ’కి మరో అడుగు..
Published Tue, Dec 25 2018 8:44 AM | Last Updated on Tue, Dec 25 2018 8:44 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment