panchaythi
-
‘పంచాయతీ’కి మరో అడుగు..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: పంచాయతీ ఎన్నికల కోసం ప్రభుత్వం మరో ముందడుగేసింది. గ్రామ పంచాయతీలకు వచ్చే నెలలో ఎన్నికలు నిర్వహించాలని సంకల్పించిన ప్రభుత్వం జిల్లాలో జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎన్ని పంచాయతీలు కేటాయించాలనే అంశంపై స్పష్టతనిచ్చింది. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలవారీగా ఎన్ని గ్రామ పంచాయతీలు.. ఎవరెవరికి కేటాయించాలనే అంశంపై నిర్ణయం తీసుకుంది. ఇక జిల్లాలో ఏ గ్రామ పంచాయతీ.. ఎవరికి రిజర్వు చేయాలనే దానిపై త్వరలోనే జిల్లా అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. దీనికి సంబంధించి కలెక్టర్ నేతృత్వంలో అధికారులతో సమావేశం నిర్వహించి.. ఏ గ్రామ పంచా యతీ ఎవరికి కేటాయించేది తేల్చనున్నారు. జిల్లాలో మొత్తం 584 గ్రామ పంచాయతీలున్నాయి. గతంలో 427 జీపీలు ఉండగా.. ఇందులో పలు పంచాయతీలు కార్పొరేషన్, మున్సిపాలిటీలలో విలీనమయ్యాయి. కొత్తగా ప్రభుత్వం 167 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది. దీంతో మొత్తం 584 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. వీటిలో 99 గ్రామ పంచాయతీలు ఏజెన్సీ ప్రాంతంలో, 11 పంచాయతీలు పూర్తి గిరిజన ప్రాంతాలుగా ఉండడంతో వీటిని ఎస్టీలకు రిజర్వు చేశారు. దీంతో మిగిలిన 474 పంచాయతీలు నాన్ షెడ్యూల్ జీపీలుగా ఉన్నాయి. షెడ్యూల్ ఏరియాలోని 99 గ్రామ పంచాయతీల్లో.. 50 గ్రామ పంచాయతీలను మహిళలకు రిజర్వు చేశారు. గిరిజన గ్రామాల్లో ఉన్న 11 గ్రామ పంచాయతీల్లో.. 6 జీపీలను మహిళలకు కేటాయించారు. మహిళలకు 50 శాతం.. మొత్తం రిజర్వేషన్లలో 50 శాతం జీపీలను మహిళలకు కేటాయించారు. 584 జీపీలలో.. 292 జీపీలను మహిళలకు కేటాయించారు. అలాగే మిగిలిన సీట్లలో పురుషులతోపాటు మహిళలు కూడా పోటీ చేయొచ్చు. మహిళలకు 50 శాతం సీట్లు కేటాయించడం వల్ల ఈ ఎన్నికల్లో వారికి ప్రాతినిధ్యం పెరిగే అవకాశం ఉంది. ఇక సగం పంచాయతీల్లో మహిళా సర్పంచ్‌లు కొలువుదీరనున్నారు. నాన్ షెడ్యూల్ జీపీల్లో ఇలా.. జిల్లాలో నాన్ షెడ్యూల్ గ్రామ పంచాయతీలు 474 ఉన్నాయి. వీటిలో ఎస్టీలకు 59 కేటాయించారు. ఇందులో మహిళలకు 29 జీపీలు కేటాయించారు. ఎస్సీలకు 120 జీపీలుండగా.. వీటిలో మహిళలకు 60 గ్రామ పంచాయతీలు ఉంటాయి. బీసీలకు 58 గ్రామ పంచాయతీలు ఉండగా.. వాటిలో 29 జీపీలను మహిళలకు కేటాయించారు. ఇక ఇతరులకు 237 గ్రామ పంచాయతీలు ఉండగా.. వాటిలో మహిళలకు 118 కేటాయించారు. -
అధికారులు సమన్వయంతో పని చేయాలి
జైనథ్: గ్రామ స్థాయిలో పని చేసే అధికారులంతా సమన్వయంతో పని చేస్తూ, గ్రామాభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరై శాఖలవారీగా సమీక్షా నిర్వహించారు. విద్యుత్, ఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి సర్వసభ్య సమావేశంలో సర్పంచులు చెప్పిన గ్రామాల్లోని విద్యుత్ సమస్యలు ఇంకా తీరకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని తెలిపారు. ఇందిర జలప్రభ కింద కనెక్షన్ల మంజూరు, గ్రామాల్లో లూస్లైన్స్, విద్యుత్ స్తంభాలు, డీటీఆర్లు ఏర్పాటు చేయడం, ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ కంచె ఏర్పాటు చేయడం వంటి కనీసమైన చర్యలు తీసుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ఆరోగ్యశాఖ సిబ్బంది వారికి కేటాయించిన గ్రామాల్లోనే నివాసముండాలని ఆదేశించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అమ్మఒడి, కేసీఆర్ కిట్ల పంపిణీలో ఆలస్యం కాకుండా చూడాలని ఆదేశించారు. పంచాయతీరాజ్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు, గ్రా మాల్లో డంపింగ్ యార్డుల నిర్మాణం, చెత్త రిక్షాల వాడకం పెంచాలన్నారు. ప్రతిఒక్కరూ హరితహారంలో స్వచ్ఛందంగా పాల్గొని మొక్కలు పెంచే లా ప్రజలను ప్రోత్సహించాలన్నారు. ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా క్షేత్రస్థాయిలో పని చేసే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవ హరిస్తే లబ్ధిదారులకు అందకుండా పోతాయన్నా రు. ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. 2013లో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌లో భాగంగా గ్రామాల్లో చేపట్టిన పనులకు సంబంధించి కూలీ బిల్లులు ఒక్కో పంచాయతీకి రూ. 50–55 వేలు పెండింగ్ ఉన్నట్లు సర్పంచులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఈ బిల్లులను వెంటనే విడుదల చేయాలని పీఆర్ అధికారులను ఆదేశించారు. ఎంపీపీ తల్లెల శోభ, జెడ్పీటీసీ పెందూర్ ఆశారాణి, తహసీల్దార్ బొల్లెం ప్రభాకర్, ఎంపీడీవో రామకృష్ణ, ఈవోపీఆర్డీ సం జీవ్రావ్, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు. -
పరిటాల శ్రీరామ్ పేరు చెప్పి...
ధర్మవరం అర్బన్ : మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరామ్ పేరు చెప్పి..పంచాయితీ చేస్తామని డబ్బులు తీసుకొని, తిరిగి ఇవ్వమన్నందుకు బాధితులపైనే రాళ్లు కట్టెలతో దాడి చేసిన ఘటన పట్టణంలోని చెరువు కట్టవద్ద శనివారం చోటుచేసుకుంది. పట్టణంలోని గూడ్స్‌షెడ్‌కొట్టాలకు చెందిన శంకర్, మణికంఠ అన్నదమ్ములు. శంకర్‌కు కొత్తపేటలో ఇల్లు ఉంది. ఆ ఇంటిని పూసల వెంకటరమణ అనే వ్యక్తికి రిజిష్టర్ తాకట్టు పెట్టాడు. తిరిగి తన ఇల్లు రిజిష్టర్ చేయమని అడిగితే చేయనంటూ బెదిరించారు. చిన్నూరు బత్తలపల్లికి చెందిన టీడీపీ కార్యకర్తలు మధుసూదన్‌నాయుడు, పురుషోత్తంచౌదరి తమకు పరిటాల శ్రీరామ్ బాగా తెలుసు.. మీ ఇల్లు మీకు ఇప్పిస్తామని నమ్మబలికారు. దీంతో శంకర్, అతని తమ్ముడు మణికంఠ రూ.80 వేలు ఇచ్చారు. పంచాయితీ చేయకపోవడంతో డబ్బులు వెనక్కి ఇవ్వాలని అడిగారు. దీంతో శనివారం సాయంత్రం చెరువు కట్ట వద్దకు వస్తే డబ్బులు ఇస్తామని మధుసూదన్‌నాయుడు, పురుషోత్తంచౌదరి చెప్పారు. మరోపది మందితో కలిసి రాళ్లు, కట్టెలతో దాడి చేశారు. అక్కడే ఉన్న మణికంఠ స్నేహితులు బాధితుడిని ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రూ.23 వేలు తీసుకుని పంచాయితీ చేస్తామని చెప్పి, డబ్బులు తిరిగి ఇవ్వలేదని కొత్తపేటకు చెందిన నాగేశ్వరమ్మ అనే బాధితురాలు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పంచాయతీలకు నిధులు విడుదల చేయాలి
కొరిటెపాడు(గుంటూరు), న్యూస్‌లైన్ గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను తక్షణమే విడుదల చేయాలని సర్పంచుల సంఘం రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు, చినకాకాని మాజీ సర్పంచ్ గంగాధరరావు డిమాండ్ చేశారు. సర్పంచుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గుంటూరులో కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా గంగాధరరావు మాట్లాడుతూ పంచాయతీలకు నిధులు రాకపోవడంతో గ్రామాలను ఏమాత్రం అభివృద్ధి చేసుకోలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణం స్పందించి పంచాయితీలకు నిధులను విడుదల చేయాలని కోరారు. సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు కొసనా మధుసూదనరావు మాట్లాడుతూ నిధుల కొరత మూలంగా గ్రామాల్లో పారిశుద్ధ్యం, విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. 2012-12, 2013-14 సంవత్సరాలకు సంబంధించిన నిధులు ఇంత వరకు విడుదల చేయక పోవడం బాధాకరమన్నారు. నిధులు విడుదల చేయనప్పుడు పంచాయితీ ఎన్నికలు ఎందుకు నిర్వహించారని ప్రభుత్వాన్ని నిలదీశారు. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు మరోపక్క విద్యుత్ అధికారుల అరాచకాలు పెరిగి పోయాయన్నారు. ఎన్నికలకు ముందు ప్రత్యేక అధికారుల పాలన నాటి విద్యుత్ బకాయిలకు కూడా తమను జవాబుదారులను చేసి విద్యుత్ అధికారులు ఒత్తిడికి గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్, జేసీ వివేక్‌యాదవ్, జిల్లా పంచాయితీరాజ్ అధికారులను కలసి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు పానకాలరెడ్డి, గంపల శివనాగేశ్వరరావు, గోగినేని వసుధ, ఎం.సాంబశివరావు, గౌస్ సంధాని, జిల్లాలోని అన్ని మండలాల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు, సర్పంచులు పాల్గొన్నారు. -
నజరానా కోసం నిరీక్షణ
సత్తెనపల్లి, న్యూస్‌లైన్: ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలు ప్రభుత్వ నజరానా కోసం ఎదురు చూస్తున్నాయి. గ్రామస్తులంతా ఏకగ్రీవంగా సర్పంచ్‌లను ఎన్నుకుంటే ఆయా పంచాయతీలకు గతంలో రూ. 5 లక్షలు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించేవారు. అయితే ప్రస్తుతం ఆ మొత్తాన్ని ప్రభుత్వం పెంచింది. ఏకగ్రీవ పంచాయతీలో 15వేలలోపు జనాభా ఉంటే రూ. 7 లక్షలు, 15వేలు పైబడి ఉంటే రూ. 20 లక్షలు అందివ్వనున్నట్లు పంచాయతీ రాజ్ శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. సత్తెనపల్లి నియోజకవర్గంలో సత్తెనపల్లి మండలంలో కట్టావారిపాలెం, ఫణిదం, భృగుబండ్ల, గుజ్జర్లపూడి. ముప్పాళ్ల మండలంలో తురకపాలెం, నార్నెపాడు, రుద్రవరం, లంకెలకూరపాడు. రాజుపాలెం మండలంలో ఇనిమెట్ల, మొక్కపాడు, అంచులవారిపాలెం, బ్రాహ్మణపల్లి. నకరికల్లు మండలంలో దేచవరం, చల్లగుండ్ల, తురకపాలెం, నర్సింగపాడు పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. అయితే ఇంత వరకు వీటికి నజరానాలు అందలేదు. పంచాయతీల అభివృద్ధికి త్వరగా ప్రోత్సాహక నిధులు మంజూరు చేయాలని సర్పంచ్‌లు కోరుతున్నారు. దీనిపై వారి అభిప్రాయాలు వారి మాటల్లోనే... నిధుల విడుదలలో జాప్యం వద్దు ప్రభుత్వం ప్రోత్సాహక నిధులు సకాలంలో ఇవ్వగలిగితే వచ్చే ఎన్నికల్లో ఏకగ్రీవాల సంఖ్య పెరుగుతోంది. ప్రజలకు నమ్మకం ఉంటుంది. సకాలంలో ఇస్తేనే సమస్యలు కొంతైనా తీరతాయి. అధికారులు ఆ దిశగా చొరవ చూపాలి. - చెవల ఓబులేశ్వరరావు, సర్పంచ్, కట్టావారిపాలెం సకాలంలో ఇస్తే మేలు పంచాయతీలకు రెండు సంవత్సరాలుగా నిధులు లేకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. ఏం చేద్దామన్నా నిధుల లేమితో అల్లాడుతున్నాం. నజరానాలు సకాలంలో అందిస్తే సమస్యలు తీరతాయి. - మేడం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, సర్పంచ్, నర్సింగపాడు అధికారులు స్పందించాలి పంచాయతీల్లో డ్రెయినేజీ, రహదారుల సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఏకగ్రీవ పంచాయతీలకు కేటాయించే నిధులు గతంలో మాదిరిగా కాకుండా ముందుగా ఇస్తే సమస్యలు తీరతాయి. అధికారులు ఆ విధంగా చర్యలు తీసుకోవాలి. - బండారు వెంకటేశ్వర్లు, సర్పంచ్, దేచవరం ప్రజల కష్టాలు తీర్చాల్సిన బాధ్యత మాపై ఉంది నాపై ఎంతో నమ్మకంతో నన్ను ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నుకున్న ప్రజల కష్టాలు తీర్చాల్సిన బాధ్యత నాపై ఉంది. వీధి దీపాలు, సిమెంటు రోడ్లు, ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. ఏకగ్రీవ పంచాయతీలకు నజరానాలు సత్వరమే అందివ్వగలిగితే అభివృద్ధి వేగవంతం అవుతోంది. - బొక్కా. చినగురువు, సర్పంచ్, చల్లగుండ్ల