కొరిటెపాడు(గుంటూరు), న్యూస్‌లైన్
గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను తక్షణమే విడుదల చేయాలని సర్పంచుల సంఘం రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు, చినకాకాని మాజీ సర్పంచ్ గంగాధరరావు డిమాండ్ చేశారు. సర్పంచుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గుంటూరులో కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా గంగాధరరావు మాట్లాడుతూ పంచాయతీలకు నిధులు రాకపోవడంతో గ్రామాలను ఏమాత్రం అభివృద్ధి చేసుకోలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణం స్పందించి పంచాయితీలకు నిధులను విడుదల చేయాలని కోరారు. సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు కొసనా మధుసూదనరావు మాట్లాడుతూ నిధుల కొరత మూలంగా గ్రామాల్లో పారిశుద్ధ్యం, విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. 2012-12, 2013-14 సంవత్సరాలకు సంబంధించిన నిధులు ఇంత వరకు విడుదల చేయక పోవడం బాధాకరమన్నారు. నిధులు విడుదల చేయనప్పుడు పంచాయితీ ఎన్నికలు ఎందుకు నిర్వహించారని ప్రభుత్వాన్ని నిలదీశారు. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు మరోపక్క విద్యుత్ అధికారుల అరాచకాలు పెరిగి పోయాయన్నారు.
ఎన్నికలకు ముందు ప్రత్యేక అధికారుల పాలన నాటి విద్యుత్ బకాయిలకు కూడా తమను జవాబుదారులను చేసి విద్యుత్ అధికారులు ఒత్తిడికి గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్, జేసీ వివేక్‌యాదవ్, జిల్లా పంచాయితీరాజ్ అధికారులను కలసి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు పానకాలరెడ్డి, గంపల శివనాగేశ్వరరావు, గోగినేని వసుధ, ఎం.సాంబశివరావు, గౌస్ సంధాని, జిల్లాలోని అన్ని మండలాల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు, సర్పంచులు పాల్గొన్నారు.
పంచాయతీలకు నిధులు విడుదల చేయాలి
Published Sat, Mar 8 2014 2:16 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
Advertisement
Advertisement